సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం ‘టి9-30 టికెట్’ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టికెట్ కు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పించినట్లు వారు తెలిపారు.
(చదవండి: పెద్దపల్లిలో విషాదం.. సబితం జలపాతం వద్ద జారిపడి విద్యార్థి మృతి)
ఎక్కడ తీసుకోవాలంటే?
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27 (గురువారం) నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్ అందుబాటులో ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ ను వారు ఇస్తారని వెల్లడించారు.
30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఈ టికెట్ వర్తిస్తుందని బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు. టి9-30 టికెట్ తీసుకున్న ప్రయాణికులు తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఒక నెల పాటు ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి పొడిగించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
(చదవండి: తెలంగాణకు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ హై అలర్ట్)
అందరికీ ‘టి9-60 టికెట్’ వర్తింపు
ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టి9-60 టికెట్ ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు చైర్మన్, ఎండీ ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకువచ్చిన ఈ టికెట్ ను.. ఈ నెల 27 (గురువారం) నుంచి పురుషులకు కూడా వర్తింపజేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు.
రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే ఈ టికెట్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. టి9-30 టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment