సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆదివారం ఆయనకు కోవిడ్–19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం భార్యతో కలసి హైదరాబాద్‌కు వెళ్లారు. బాజిరెడ్డి సుమారు పదిహేను రోజుల తర్వాత శనివారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చారు. అదే రోజు ఆయన డిచ్‌పల్లి మండలం బీబీపూర్ తండా వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. కాగా, ఆయనకు అస్వస్థతగా ఉండటంతో బాజిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ను శనివారం సేకరించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వాటిని పరీక్షలకోసం హైదరాబాద్‌కు పంపించారు. రిపోర్టుల్లో బాజిరెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా, ఆయన భార్య వినోద, కుమారుడు, ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌లకు నెగెటివ్ వచ్చింది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్‌కు వెళ్లారు. బాజిరెడ్డి యశోద ఆస్పత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు జగన్ తెలిపారు.
హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ, ఆర్డీవో
శనివారం బీబీపూర్ తండాలో జరిగిన డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో బాజిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఆర్డీవో వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే నివాసంలో వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి బాజిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు వెలుగులోకి రావడంతో అధికారులు, నాయకులు కలవరానికి గురయ్యారు. బాజిరెడ్డి వెంట వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఆర్డీవో వెంకటయ్య హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.
ముత్తిరెడ్డిని కలసిన బాజిరెడ్డి..?
ఇదిలా ఉండగా బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల కరోనా సోకిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలసినట్లు టీఆర్‌ఎస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమీక్షా సమావేశం సందర్భంగా బాజిరెడ్డి, ముత్తిరెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment