Nizamabad Rural
-
విచారణకు వెళ్లిబాలికతో అసభ్య ప్రవర్తన
ఖలీల్‌వాడి (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మహేశ్‌పై పోక్సో కేసు నమోదైంది. కానిస్టేబుల్ మహేశ్ ఓ కేసు విషయమై నిందితుడికి సమన్లు అందించడానికి ఆదివారం నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామానికి వెళ్లాడు. ఇంట్లో నిందితుడు లేకపోవడంతో పక్కింట్లో ఉన్న బాలికతో మాట్లాడి నిందితుడి వివరాలను తెలుసుకున్నాడు. ఈ క్రమంలో బాలికతో మహేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చాక బాలిక వారికి విషయం చెప్పింది. దీంతో వారు సోమవారం ఉదయం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ వ్యవహారాన్ని ఎస్సై మహేశ్ నిజామాబాద్ సౌత్ సీఐ వెంకటనారాయణకు వివరించారు. ఆయన సీపీ కల్మేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు శుక్రవారం మహేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మహేశ్ గతంలో ఓ కేసు విషయంలో సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ఎత్తేశాక మళ్లీ అదే స్టేషన్లో విధుల్లో కొనసాగుతున్నారు. పోక్సో కింద కేసు నమోదు కావడంతో సదరు కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. -
Nizamabad: అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించేదీ వీరే..
సాక్షి, నిజామాబాద్: రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి మహిళలు చేరుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో గెలిచే అభ్యర్థి ఎవరు, తర్వాతి స్థానంలో నిలిచే వారు ఎవరని నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లకే ఉందని స్పష్టమవుతోంది. జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలున్నాయి. ఆరు నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య అందులో నమోదైన మహిళా ఓటర్ల లెక్కను పరిశీలిస్తే వారి ఓట్ల సంఖ్యనే ఎక్కువగా ఉందని తేలింది. పురుషుల ఓటర్లలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఈ లెక్కన మహిళలు వేసే ఓట్లే అభ్యర్థుల గెలుపునకు కీలం కానున్నాయి. అత్యధికంగా రూరల్ నియోజకవర్గంలోనే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్ల కోసం గాలం.. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార పార్టీ అభ్యర్థులు మొదట ఖరారు కావడంతో వారు దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు బహుమతులను పంచిపెడుతున్నారు. చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఇతరత్రా గృహోపకరణాలు, అందిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళలు తమవైపు ఉంటే విజయం వరిస్తుందనే ధీమాతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. ఆరు నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు నియోజకవర్గం బాల్కొండ ఆర్మూర్ అర్బన్ రూరల్ బోధన్ బాన్సువాడ మహిళా ఓటర్లు 1,15,898 1,09,933 1,47,571 1,32,212 1,12,381 1,00,608 పురుష ఓటర్లు 99,728 96,404 1,39,163 99,728 1,03,577 92,225 ఎక్కువున్న మహిళలు 16,170 13,529 8,408 32,484 8,804 -
TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్: కేబినెట్ ఆశిస్తే.. కార్పొరేషన్
సాక్షి, నిజామాబాద్ : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎట్టకేలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన రాష్ట్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తూ వస్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ఉండడంతో అవకాశం రాలేదు. చిరకాల వాంఛ నెరవేరకపోfడ బాజిరెడ్డికి నిరాశ కలిగించే అంశమే.. క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న నాయకుడిగా ఉన్న బాజిరెడ్డి ఆది నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడిగా ఉంటూ వచ్చారు. చదవండి: TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ 2018 వరకు ఆర్టీసీ చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పనిచేశారు. ఆ తరువాత నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. మళ్లీ తాజాగా ఎమ్మెల్యే బాజిరెడ్డిని ఈ పదవిలో నియమించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడుతూ తనకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పని చేస్తానన్నారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. చదవండి: NCRB Report: ఆర్థిక నేరాల్లో హైదరాబాద్ నెం.3 -
తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రకటించారు. ప్రస్తుతం గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తనను చైర్మన్‌గా నియమించడంపై గోవర్ధన్ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతను వందకు వంద శాతం న్యాయం చేస్తానని పేర్కొన్నారు. సీఎం మార్గదర్శకత్వంలో ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తానని చెప్పారు. చదవండి: రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు కాగా గోవర్ధన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్నారు. గోవర్దన్ స్వస్థలం సిరికొండ మండలం రావుట్ల. పోలీస్ పటేల్ నుంచి ఆర్టీసీ చైర్మన్‌గా ఎన్నికవడం మామూలు విషయం కాదు. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాక చిమన్పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సిరికొండ ఎంపీపీగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1999లో ఆర్మూర్, 2004లో బాన్సువాడ, 2014, 18లో నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం సీనియర్ శాసన సభ్యుడు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ను ఆర్టీసీ చైర్మన్ గా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు. — Telangana CMO (@TelanganaCMO) September 16, 2021 -
ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా పాజిటివ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆదివారం ఆయనకు కోవిడ్–19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం భార్యతో కలసి హైదరాబాద్‌కు వెళ్లారు. బాజిరెడ్డి సుమారు పదిహేను రోజుల తర్వాత శనివారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చారు. అదే రోజు ఆయన డిచ్పల్లి మండలం బీబీపూర్ తండా వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. కాగా, ఆయనకు అస్వస్థతగా ఉండటంతో బాజిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ను శనివారం సేకరించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వాటిని పరీక్షలకోసం హైదరాబాద్‌కు పంపించారు. రిపోర్టుల్లో బాజిరెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా, ఆయన భార్య వినోద, కుమారుడు, ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌లకు నెగెటివ్ వచ్చింది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్‌కు వెళ్లారు. బాజిరెడ్డి యశోద ఆస్పత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు జగన్ తెలిపారు. హోం క్వారంటైన్లో ఎమ్మెల్సీ, ఆర్డీవో శనివారం బీబీపూర్ తండాలో జరిగిన డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో బాజిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఆర్డీవో వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే నివాసంలో వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి బాజిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు వెలుగులోకి రావడంతో అధికారులు, నాయకులు కలవరానికి గురయ్యారు. బాజిరెడ్డి వెంట వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఆర్డీవో వెంకటయ్య హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ముత్తిరెడ్డిని కలసిన బాజిరెడ్డి..? ఇదిలా ఉండగా బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల కరోనా సోకిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలసినట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమీక్షా సమావేశం సందర్భంగా బాజిరెడ్డి, ముత్తిరెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది. -
‘ఏవండి.. మేమొచ్చాం లేవండి..’
సాక్షి, నిజామాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన తహసీల్దార్ నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లా అధికారుల్లో కలవరపాటుకు గురిచేసింది. జిల్లావాసి.. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్‌గా పని చేస్తున్న జ్వాలా గిరిరావు (50) బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి ఆయన మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వచ్చారు. రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిళ్లు తగ్గించాలని, తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జ్వాలా గిరిరావు స్వస్థలం నల్లగొండ పట్టణంలోని రామగిరి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్టోబర్ 11, 2018న ఆయన బదిలీపై ఇక్కడకు రాగా, కుటుంబ సభ్యులు మాత్రం హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో జ్వాలా గిరిరావు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య విషయం తెలుసుకున్న కలెక్టర్ రామ్మోహన్రావు, జేసీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులను నిర్వర్తించడంతో మానసిక సమస్యలు ఎదురవడం, పని ఒత్తిడి పెరిగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని రెవెన్యూ ఉద్యోగులు భావిస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ తహసీల్దార్ అనేక ఇబ్బందులు పడ్డారని వారు తెలిపారు. (చదవండి: నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ ఆత్మహత్య) స్పందించక పోవడంతో.. జ్వాలా గిరిరావు బుధవారం రాత్రి తన కార్యాలయంలో మరో ఇద్దరు తహసీల్దార్లతో కలిసి ముచ్చటించారు. అనంతరం తొమ్మిది గంటల సమయంలో ఆర్యనగర్‌లోని అద్దెకుంటున్న ఇంటికి వెళ్లారు. ఉపవాసాలు ఉండటంతో ఆయన రాత్రి భోజనం చేయలేదు. కుటుంబ సభ్యులతో కాసేపు ఫోన్లో మాట్లాడిన ఆయన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. ఉదయం ఆయన భార్య ఫోన్ చేయగా, ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె డ్రైవర్ ప్రవీణ్, వీఆర్వో ప్రవీణ్‌కు ఫోన్ చేసి, సార్ స్పందించడం లేదని ఇంటికి వెళ్లాలని చెప్పడంతో వారిద్దరు ఆయన ఇంటికి వచ్చారు. లోపల గడియ ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా, తహసీల్దార్ బెడ్రూంలో వేలాడుతూ కన్పించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. కలెక్టర్, జేసీ, ఆర్డీవో, ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సూసైడ్ నోట్ రాసి ఉంటాడేమోనని పోలీసులు ఆయన ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి నోట్ లభించలేదు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, నాలుగో టౌన్ ఠాణాలో 174 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఏమండి.. మేమొచ్చాం.. లేవండి’ కుటుంబ సభ్యులను త్వరగా నిజామాబాద్ రావాలని పోలీసులు సమాచారమిచ్చారు. వారు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. తహసీల్దార్ మృతదేహాన్ని భార్య, కొడుకు విలపించిన తీరు అక్కడున్న వారిని కలిచి వేసింది. జ్వాలా గిరిరావు చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చే వరకూ తెలియకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. ఆయన బీపీతో అనారోగ్యానికి గురయ్యారని, మీరు వెంటనే నిజామాబాద్ రావాలని సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన అనారోగ్యానికి మాత్రమే గురయ్యారని భావించి ఇక్కడికి చేరుకున్నారు. కానీ జ్వాలా గిరిరావు మంచంపై విగత జీవిగా పడి ఉండటం చూసి ఆయన భార్య గుండెలు బాదుకుంటూ రోదించారు. ‘ఏమండి.. మేమొచ్చాం.. లేవండి’ అంటూ జ్వాలా గిరిరావును లేపే ప్రయత్నం చేయడం చూసి అక్కడున్న వారు కంటతడి పెట్టారు. -
నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ ఆత్మహత్య
నిజామాబాద్ అర్బన్/మోపాల్ : నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ జ్వాలా గిరిరావు (50) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్లగొం డ జిల్లా రామగిరి మండలానికి చెందిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన బదిలీల్లో భాగంగా గతేడాది అక్టోబర్ 11న నిజామాబాద్ రూరల్ మండలానికి వచ్చారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌లో పనిచేసే వారు. జ్వాలా గిరిరావు కుటుంబం హైదరాబాద్‌లో ఉంటుండగా, ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆయన భార్య శ్రీదేవి గురువారం ఉదయం ఫోన్ చేయగా, ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె డ్రైవర్ ప్రవీణ్, వీఆర్వోకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారిద్దరూ గిరిరావు అద్దెకు ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్దలు కొట్టిలోనికి వెళ్లి చూడగా, బెడ్రూంలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కలెక్టర్ రామ్మోహన్రావు, జేసీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తహసీల్దార్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు మృతదేహంతో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దారు ఆత్మహత్య బాధాకరం సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా రూరల్ తహసీల్దారు జ్వాలా గిరిరావు ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లచ్చిరెడ్డి, రమేష్ రాథోడ్ అన్నారు. గిరిరావు కుటుంబానికి డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రగాఢ సానుభూతిని తెలుపుతోందన్నారు. రెవెన్యూ శాఖలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. -
నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఓ తహశీల్దార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో కలకలం సృష్టించింది. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్‌గా ఉన్న గిరిధర్‌రావు..ఆర్యనగర్‌లో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. నల్లగొండ జిల్లా రామగిరి మండలానికి చెందిన గిరిధర్.. ఏడాది క్రితమే నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉండగా..ఆయన ఒక్కరే ఆర్యనగర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిజామాబాద్ రూరల్ నుంచి పోటి చేస్తా: డీఎస్
న్యూఢిల్లీ: గత ఎన్నికల్లో చేదు అనుభవాన్ని మిగిల్చిన నిజామాబాద్ అర్భన్ స్థానం నుంచి పోటీ చేయడానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ నిరాసక్తతతను ప్రదర్శిస్తున్నారు. 2014 ఎన్నికల్లో డీఎస్ స్థాన మార్పిడి కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. నిజమాబాద్ అర్భన్ స్థానం నుంచి కాకుండా రూరల్ స్థానాని కేటాయించాలని స్ర్కీనింగ్ కమిటికి డీఎస్ విజ్క్షప్తి చేశారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్భన్ స్థానంలో పోటి చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గతంలో రెండుస్తార్లు ఓటమి చవిచూసిన డీఎస్ ఈ ఎన్నికల్లో అర్భన్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. స్క్రీనింగ్ కమిటీని కలిసిన కాంగ్రెస్ నేతల్లో భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, సిరిసిల్ల రాజయ్య, జైపాల్‌రెడ్డి, డీఎస్‌లున్నారు.