రోదిస్తున్న భార్య, కొడుకు, ఇన్‌సెట్‌లో తహసీల్దార్ జ్వాలగిరిరావు (ఫైల్)
సాక్షి, నిజామాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన తహసీల్దార్ నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లా అధికారుల్లో కలవరపాటుకు గురిచేసింది. జిల్లావాసి.. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్‌గా పని చేస్తున్న జ్వాలా గిరిరావు (50) బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి ఆయన మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వచ్చారు. రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిళ్లు తగ్గించాలని, తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జ్వాలా గిరిరావు స్వస్థలం నల్లగొండ పట్టణంలోని రామగిరి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అక్టోబర్ 11, 2018న ఆయన బదిలీపై ఇక్కడకు రాగా, కుటుంబ సభ్యులు మాత్రం హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో జ్వాలా గిరిరావు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య విషయం తెలుసుకున్న కలెక్టర్ రామ్మోహన్‌రావు, జేసీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులను నిర్వర్తించడంతో మానసిక సమస్యలు ఎదురవడం, పని ఒత్తిడి పెరిగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని రెవెన్యూ ఉద్యోగులు భావిస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ తహసీల్దార్ అనేక ఇబ్బందులు పడ్డారని వారు తెలిపారు. (చదవండి: నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ ఆత్మహత్య)
స్పందించక పోవడంతో..
జ్వాలా గిరిరావు బుధవారం రాత్రి తన కార్యాలయంలో మరో ఇద్దరు తహసీల్దార్లతో కలిసి ముచ్చటించారు. అనంతరం తొమ్మిది గంటల సమయంలో ఆర్యనగర్‌లోని అద్దెకుంటున్న ఇంటికి వెళ్లారు. ఉపవాసాలు ఉండటంతో ఆయన రాత్రి భోజనం చేయలేదు. కుటుంబ సభ్యులతో కాసేపు ఫోన్‌లో మాట్లాడిన ఆయన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. ఉదయం ఆయన భార్య ఫోన్ చేయగా, ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె డ్రైవర్ ప్రవీణ్, వీఆర్వో ప్రవీణ్‌కు ఫోన్ చేసి, సార్ స్పందించడం లేదని ఇంటికి వెళ్లాలని చెప్పడంతో వారిద్దరు ఆయన ఇంటికి వచ్చారు. లోపల గడియ ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా, తహసీల్దార్ బెడ్రూంలో వేలాడుతూ కన్పించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. కలెక్టర్, జేసీ, ఆర్డీవో, ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సూసైడ్ నోట్ రాసి ఉంటాడేమోనని పోలీసులు ఆయన ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి నోట్ లభించలేదు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, నాలుగో టౌన్ ఠాణాలో 174 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
‘ఏమండి.. మేమొచ్చాం.. లేవండి’
కుటుంబ సభ్యులను త్వరగా నిజామాబాద్ రావాలని పోలీసులు సమాచారమిచ్చారు. వారు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. తహసీల్దార్ మృతదేహాన్ని భార్య, కొడుకు విలపించిన తీరు అక్కడున్న వారిని కలిచి వేసింది. జ్వాలా గిరిరావు చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చే వరకూ తెలియకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. ఆయన బీపీతో అనారోగ్యానికి గురయ్యారని, మీరు వెంటనే నిజామాబాద్ రావాలని సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన అనారోగ్యానికి మాత్రమే గురయ్యారని భావించి ఇక్కడికి చేరుకున్నారు. కానీ జ్వాలా గిరిరావు మంచంపై విగత జీవిగా పడి ఉండటం చూసి ఆయన భార్య గుండెలు బాదుకుంటూ రోదించారు. ‘ఏమండి.. మేమొచ్చాం.. లేవండి’ అంటూ జ్వాలా గిరిరావును లేపే ప్రయత్నం చేయడం చూసి అక్కడున్న వారు కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment