
‘ప్రాణహిత-చేవెళ్లకూ జాతీయ హోదా : బాజిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన విధంగానే తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్లకూ జాతీయ హోదా కల్పించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌నిరాహార దీక్షచేస్తున్న నిమ్స్ వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన సమయంలో పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామన్నారని, తెలంగాణకు ముఖ్యమైన ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా జాతీయహోదా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.40 కోట్లు అవసరం అవుతాయని, తెలంగాణ రాష్ర్టం అంత ఖర్చును భరించే అవకాశం లేదని అనుమానం వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం ప్రజల కోసం పోరాడుతోందని కొనియాడారు. సమన్యాయం కోసం దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణించిందని, బలవంతంగా దీక్ష విరమింపజేయడం సంతోషించదగ్గ పరిణామమని చెప్పారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌సీపీ యథాతథంగా కొనసాగుతోందని చెప్పారు.