పల్లెపల్లెనా ప్రగతి వీచికలు | - | Sakshi
Sakshi News home page

పల్లెపల్లెనా ప్రగతి వీచికలు

Published Fri, Jun 16 2023 6:22 AM | Last Updated on Fri, Jun 16 2023 11:20 AM

హైదరాబాద్‌కు వెళ్తున్న సర్పంచులు - Sakshi

హైదరాబాద్‌కు వెళ్తున్న సర్పంచులు

సుభాష్‌నగర్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పల్లెల ప్రగతిని ఆవిష్కరింపజేశాయి. ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్‌ షెడ్‌ వంటి హంగులతో పల్లెలన్నీ దశాబ్ది వేడుకకు వేదికలుగా నిలిచాయి. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో గురువారం నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమాలతో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపించింది. గ్రామ పంచాయతీలు, పల్లె ప్రకృతి వనాలు తదితర వాటిని మామిడాకులు, పూల తోరణాలతో అలంకరించారు. గ్రామ పంచాయతీల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
ధర్పల్లిలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొనగా, సాటాపూర్‌లో బోధన్‌ ఎమ్మె ల్యే మహమ్మద్‌ షకీల్‌ ఆమిర్‌, నందిపేట్‌లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు భాగస్వాములయ్యారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు సమకూరిన నిధులు, మెరుగుపడిన మౌలిక వసతులు, సాధించిన ప్రగతితోపాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల వివిధ వర్గాల వారికి చేకూరిన లబ్ధి గురించి వక్తలు వివరించారు.

పల్లెల పరిశుభ్రతలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సఫాయి కార్మికుల సేవలను కొనియాడుతూ ‘సఫాయి అన్నా.. సలాం అన్న’ అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కార్మి కుల గౌరవాన్ని ఇనుమడింపజేశాయి. పల్లెల పరిశుభ్రత, ప్రగతి కోసం విశేషంగా కషి చేసిన మల్టీపర్పస్‌ వర్కర్ల సేవలకు గుర్తింపుగా వారిని ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. శానిటేషన్‌ విధులు నిర్వర్తిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌, పాదరక్షలు, గ్లౌజులు, నూనె, సబ్బులు వంటి వస్తువుల తో కూడిన జూట్‌ బ్యాగులను పంపిణీచేశారు.

రాజధానికి తరలివెళ్లిన ఉత్తమ సర్పంచులు
వివిధ అంశాల ప్రాతిపదికన జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికై న సర్పంచులు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ నేతృత్వంలో గురువారం ఉదయం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. జిల్లా నుంచి మొత్తం 27 మంది సర్పంచులు, ఇద్దరు మల్టీ పర్పస్‌ వర్కర్లు ప్రత్యేక బస్సులో బయల్దేరి వెళ్లారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వీరిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీష్‌రావుల చేతుల మీదుగా సన్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సన్మాన కార్యక్రమంలో సఫాయి కార్మికుడి చొక్కాతో బాజిరెడ్డి1
1/1

సన్మాన కార్యక్రమంలో సఫాయి కార్మికుడి చొక్కాతో బాజిరెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement