సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో రెండేళ్లపాటు చక్రంతిప్పిన వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్ తాజా మాజీ మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీఎం కిరణ్ బుధవారం సమర్పించిన రాజీనామాను శుక్రవారం గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్ర మంత్రివర్గం రద్దయింది. దీంతో ప్రసాద్ మంత్రి పదవిని కోల్పోయారు. 2012 ఫిబ్రవరి 6న కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో తొలిసారి బెర్త్ దక్కించుకున్న ఆయన రెండేళ్ల 15రోజులపాటు చేనేత మంత్రిగా పనిచేశారు. గతంలో మర్పల్లి ఎంపీపీగా పనిచేసిన ప్రసాద్.. టీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ రాజీనామాతో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నుంచి బరిలోకి దిగారు.
తొలిసారే విజయఢంకా మోగించి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నిల్లోనూ గెలిచిన ప్రసాద్‌కు అనతికాలంలో ఆమాత్య పదవి లభించింది. అధికారపార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, సామాజిక సమీకరణలు అప్పట్లో ఆయనకు కలిసొచ్చాయి. వివాదస్పద వ్యాఖ్యలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన శంకర్రావు స్థానంలో ఈ ఛాన్స్ కొట్టేశారు. జిల్లా నుంచి అప్పటికే కేబినెట్‌లో సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, సామాజిక సమతుల్యతలో భాగంగా అవకాశం లభించింది. రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేలెవరూ లేకపోవడం.. మెజార్టీ శాసనసభ్యులు కూడా ప్రసాద్ పేరును సూచించడం ప్లస్‌పాయింట్‌గా మారింది.
కాగా, మంత్రి పదవి రాకమునుపే సబితకు వైరివర్గం నేతగా పేరొందిన ప్రసాద్.. ఆ తర్వాత కూడా అదే వైఖరిని కొనసాగించారు. జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కేసు నమోదు చేయడంతో సబిత మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ప్రసాద్ ఏకచక్రాధిపత్యానికి తెరలేచింది. గత పది నెలలుగా ఒకే ఒక్కడుగా జిల్లాలో పాలనా వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కోటరీలో కీలక సభ్యుడిగా ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో దూరం కూడా పెరిగింది. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో నిరసనగా కిరణ్ తన పదవికి రాజీనామా చేయడంతో ప్రసాద్ కూడా మంత్రి బాధ్యతల నుంచి వైదొలిగాల్సిన పరిస్థితి అనివార్యమైంది.
24నెలలు..15 రోజులు
Published Fri, Feb 21 2014 11:19 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement