మర్పల్లి, న్యూస్‌లైన్ : భూకంప భయం దామస్తాపూర్ గ్రామస్తులను వీడటం లేదు. శనివారం రాత్రి 7.10గంటలకు మళ్లీ బాంబులు పేల్చినట్లు భూమిలోంచి శబ్దాలు రావడంతో పిల్లాపాపల సహా రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ నెల 13వ తేదీ నుంచి తరచు భూగర్భంలో శబ్దాలు వస్తుండటంతో ఎక్కడ భూకంపం బారినపడతామేమోనని గ్రామస్తులంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదివరకెన్నడూ లేని రీతిలో శనివారం రాత్రి పెద్దశబ్దాలతో భూమి కంపించినట్లు కావడంతో తీవ్ర ఆందోళనకు గురైన గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రంతా జాగారం చేశారు.
మంత్రి ఆదేశాలు బేఖాతర్...
దామస్తాపూర్‌లో భూ ప్రకంపనల విషయం తెలుసుకున్న రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ ఈ నెల 15న గ్రామాన్ని సందర్శించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. గ్రామంలో టెంట్లు ఏర్పాటు చేయించి, అన్ని వసతులు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అలాగే రెండు రోజుల్లో జాతీయ భూ భౌతిక పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలను గ్రామానికి రప్పించి భూ ప్రకంపనల విషయం తెలుసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతవరకూ అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లలోనే ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఈ మేరకు 21వ తేదీన భూ భౌతిక పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఆర్.కె.చంద్ర, శ్రీనాగేష్‌లు దామస్తాపూర్‌ను సందర్శించి సెస్మోగ్రాఫిక్ పరికరాలతో భూ ప్రకంపనల తీవ్రతను పరిశీలించారు. మరికొన్ని రోజులు టెంట్లలోనే ఉండాలని గ్రామస్తులకు చెప్పారు. దీంతో గ్రామస్తులు రెండు రోజుల పాటు టెంట్ల కింద నిద్రలేని రాత్రులు గడిపారు.
కాగా, ఇటీవలి వర్షాలకు గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులు మళ్లీ ఇళ్లకు వెళ్దామనుకున్న సమయంలో శనివారం రాత్రి మళ్లీ భూమి కంపించినట్లు కావడంతో మళ్లీ రోడ్లపైకి చేరుకున్నారు. వసతులు కల్పించాలన్న మంత్రి ఆదేశాలను పట్టించుకోకుండా, కనీసం టెంట్లు తిరిగి వేయించడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం చూపారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఒక్క అధికారి కూడా గ్రామాన్ని సందర్శించి ధైర్యం చెప్పలేదని, ఇక భగవంతుడిపైనే భారం వేసి గడుపుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దామస్తాపూర్‌లో మళ్లీ ప్రకంపనలు
Published Sun, Oct 27 2013 12:56 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement