అర్హులందరికీ ప్రభుత్వ భూమి | land distribution in vikarabad | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ప్రభుత్వ భూమి

Published Tue, Dec 31 2013 12:18 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

land distribution in vikarabad

ఆలంపల్లి, న్యూస్‌లైన్: అర్హులైన ప్రతి పేదకు ప్రభుత్వం భూమి పంపిణీ చేస్తుందని చేనేత, జౌళి శాఖా మంత్రి జి.ప్రసాద్‌కుమార్ వెల్లడించారు. ఏడో విడత భూ పంపిణీలో భాగంగా నాలుగు నియోజకవర్గాల లబ్ధిదారులకు సోమవారం వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్‌లో పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం విడతల వారీగా భూ పంపిణీ చేపడుతోందని చెప్పారు. గత ఆరు విడతల్లో 6,300 మంది లబ్ధిదారులకు 9,620 ఎకరాలను పంపిణీ చేశామని, ఏడో విడతలో 1,228 ఎకరాలను 1,009 మంది లబ్ధిదారులకు అందజేస్తున్నట్టు చెప్పారు.
 
 పేదలకు పట్టాలివ్వడమే కాకుండా వారందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇచ్చేలా మంత్రుల సబ్‌కమిటీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ అసైన్డ్ భూమిలేని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా రూ.ఐదు లక్షలు వెచ్చించి భూములను కొనుగోలుచేసి అర్హులైన వారికి అందించనున్నట్టు చెప్పారు. ఆ భూముల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టి అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ ఆమ్రపాలిని మంత్రి ఆదేశించారు. వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయ నిర్మాణానికి రూ.రెండు కోట్లు, ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.60 లక్షలు, చేవెళ్ల, వికారాబాద్ ఆర్డీఓల నివాస గృహాలకు రూ.కోటి చొప్పున మంజూరయ్యాయని వెల్లడించారు.
 
 పొజిషన్ ఇచ్చి హద్దురాళ్లు పాతించాలి
 - ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి
 భూములు ఇవ్వడం కాదు.. వాటి ని సర్వే చేసి లబ్ధిదారులకు పొజిషన్‌ను ఇచ్చి హద్దురాళ్లు పాతేలా చూడాలని అధికారులకు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సూచించారు. హద్దులు లేక గ్రామాల్లో తగాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.  ఉపాధి హామీ ద్వారా భూముల్ని అభివృద్ధిపర్చి సాగుకు అనుకూలంగా మలచాలని మంత్రిని కోరారు.
 
 గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను కొందరు అమ్ముకున్నారని.. కొన్నవారు అన్ని విధాలా అభివృద్ది చేసుకున్న తర్వాత భూములు తమవంటూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. లబ్ధిదారులు భూములు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని జేసీని ఆయన ఆదేశించారు. జిల్లాలో వరదలతో నష్టపోయిన రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు.
 
 కబ్జాలో ఉన్నవారికి పట్టాలు ఇవ్వాలి  
 - ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి
 బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని అటవీ భూముల్లో కబ్జాలో ఉన్న వారందరికీ భూ పట్టాలు ఇవ్వాలని తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి సూచించారు. గ్రామాల్లో అర్హులైన పేదలకు భూములు కేటాయించాలని మంత్రి ప్రసాద్‌కుమార్‌ను ఆయన కోరారు. అనంతరం లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్‌లు, పాసు పుస్తకాలను అందజేశారు.
 
 కార్యక్రమంలో ధారూరు, మర్పల్లి, వికారాబాద్ మార్కెట్ కమిటీల చైర్మన్లు సంగమేశ్వర్, ప్రతాప్‌రెడ్డి, శశాంక్‌రెడ్డి, వికారాబాద్, మర్పల్లి పీఏసీఎస్‌ల చైర్మన్‌లు కిషన్‌నాయక్, ప్రభాకర్ గుప్తా, జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, చేవెళ్ల ఆర్డీఓ చంద్రశేఖర్, ఎమ్మార్వో గౌతంకుమార్, కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement