ఆలంపల్లి, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం విజయవంతమైందని, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లి గ్రామంలో రూ.15లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుందని, త్వరలోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం ఖాయమని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువత పాత్ర ఎంతో ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ యువత కీలక పాత్ర పోషించాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా తమ వంతు సహకారం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటైతే ఎన్నో భారీ పరిశ్రమలు వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు ఎంతోమందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. దళిత, గిరి జనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి ఏటా రూ.12వేల కోట్లు మంజూరు చేస్తోందని చెప్పారు. అలాగే ఆడపిల్లల సంరక్షణ కోసం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందిస్తోందన్నారు.
ఈ ప్రాంతంలో కూరగాయలు పండించే రైతులు నేరుగా వాటిని అమ్ముకునేందు కు వికారాబాద్‌లో రూ.50 లక్షలతో రైతుబజార్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 8,400 ఇళ్లు ఆయా పథకాల కింద అందు బాటులో ఉన్నాయని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, దారి సరిగా లేక పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రెండుమూడు రోజుల్లో బస్సు నడిపించేందుకు చర్యలు తీసుకుంటానని, పొలాలకు వెళ్లేందుకు రోడ్డు వేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ కిషన్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శశాంక్‌రెడ్డి, సర్పంచ్ మాధవివెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రత్నారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాఘవన్‌నాయక్, బుచ్చిబాబు, సంఘమేశ్వర్, దోమ శ్రీధర్, శ్రీనివాస్, గోపాల్, పాండు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది
Published Sun, Oct 6 2013 3:21 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement