ధారూరు/ పెద్దేముల్, న్యూస్‌లైన్ : ‘నీటి బొట్టు ఒడిసి పట్టు అన్న విధంగా ప్రతి వర్షపు చుక్క కూడా వృథా కాకుండా జిల్లాలో అవసరమైన చోట్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించేందుకు కృషి చేస్తా’నని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డితో కలిసి కోట్‌పల్లి ప్రాజెక్టు కుడి కాలువ నుంచి నీటిని రైతుల పంట పొలాలకు వదిలారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చిన్న చెరువుల మరమ్మతులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కోసం రూ 100కోట్ల నిధుల విడుదలకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.
జిల్లాలో ప్రధానమైన కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు జపాన్ దేశానికి చెందిన జైకా నుంచి రూ.25కోట్లు మంజూరు చేయించామని, పూర్తిస్థాయి మరమ్మతుల కోసం మరో రూ.25 కోట్లు విడుదల చేయించనున్నట్టు చెప్పారు. ప్రాజెక్టు సందర్శనకు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నందున టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసి ఓ పార్కును నిర్మించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ప్రాజెక్టు కాల్వలు సరిగ్గా లేవని, వరి కాకుండా ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. వరి వేసి నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు.
ఎకరాకు రూ.10వేల పరిహారం అందించేందుకు కృషి
తుపాను వర్షాల కారణంగా జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న తదితర అన్ని పంటలు దెబ్బతిన్నాయని, ఎకరాకు రూ.10వేల పరిహారం అందించేలా కృషి చేస్తానని మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. గతంలో పంట నష్టం అంచనాలు సరిగ్గా రూపొందించకపోవడం వల్ల ఎకరాకు రూ.వెయ్యి, రూ.2వేలు మాత్రమే అందిందని గుర్తు చేశారు. ఈ సారి అలాకుండా క్షేత్రస్థాయిలో అధికారులు వేసిన అంచనాలను పంచాయతీలలో పరిశీలించి ఆమోదించాకే పంట నష్టపోయిన రైతుల జాబితాను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. దీనివల్ల అర్హులైన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం లభించే వీలుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ధారూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మైన్, వైస్ చైర్మన్లు పి.సంగమేశ్వర్‌రావు, బాలునాయక్, ధారూరు పీఏసీఎస్ చైర్మన్ జె.హన్మంత్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈ వెంకటేశం, డీఈ నర్సింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కన్నె బిచ్చన్న, కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల రాములు, యాదగిరి, జి.హన్మయ్య, జి. నారాయణరెడ్డి, చాకలి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
చెరువుల మరమ్మతుకు రూ.100కోట్లు
Published Thu, Nov 14 2013 12:31 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement