సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వరద ప్రభావిత ప్రాంతాల్లోని చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆ శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. వరదలతో నష్టపోయిన నేత కార్మికుల కుటుంబాలకు ఉచితంగా 20 కేజీల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్‌ను అందించనున్నామని వెల్లడిం చారు. వరద ప్రాంతాల్లో నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు. బుధవారం తన నివాసంలో విలేకర్లతో మాట్లాడిన ప్రసాద్... చేనేత రంగాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా నేత పనిని సులభతరం చేసేలా మరమగ్గాల ఆధునికీకరణకు రూ.200 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు కూడా మరమగ్గాల అప్‌గ్రేడేషన్‌కు నిధులు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారని ప్రసాద్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రంగారెడ్డి జిల్లా సహా తెలంగాణ ప్రాంతంలో అపార పంటనష్టం జరిగిందని, నీలం తుపాను సమయంలో చెల్లించినట్లు హెక్టారుకు రూ.10వేల నష్ట పరిహారం అందించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. జిల్లాలోని అగ్గనూర్-బషీరాబాద్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, తాండూరు-కోట్‌పల్లి, కోట్‌పల్లి-సదాశివ్‌పేట్ మార్గాల అభివృద్ధికి అవసరమైన రూ.60 కోట్లు విడుదల చేయాలనే ప్రతిపాదనలకు కేంద్ర రవాణా, రహదారి శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ సుముఖత చూపినట్లు ప్రసాద్ వెల్లడించారు.
జైత్రయాత్ర వాయిదా?
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 10న జరగాల్సిన తెలంగాణ జైత్రయాత్ర సభ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. వికారాబాద్‌లో ఈ సభ నిర్వహించాలని సూత్రప్రాయంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. అయితే, అంతకుముందు రోజు (నవంబర్ 9న) వరంగల్‌లో జైత్రయాత్ర సభ ఉన్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సభకు ముఖ్యనేతలు హాజరుకాకపోతే బాగుండదనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. టీ ప్రజాప్రతినిధులకు నేతృత్వం వహిస్తున్న పంచాయతీరాజ్ మంత్రి జానారెడ్డితో సంప్రదించిన తర్వాత సభ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి ప్రసాద్ కుమార్ విలేకర్లకు తెలిపారు.
వరద ప్రాంతాల్లో నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు
Published Thu, Oct 31 2013 12:40 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement