ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: డిసెంబర్‌లోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని శాస్తా గార్డెన్‌లో సోనియాగాంధీ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్‌లోగా రాష్ట్ర విభజన జరిగి ఇటు తెలంగాణకు, అటు సీమాంధ్రకు ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న ప్రత్యేక రాష్ట్రం కేవలం సోనియాగాంధీ చలవ వల్లే సాధ్యమైందన్నారు. 30 ఏళ్లుగా ఇబ్రహీంపట్టణానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోవడం విచారకరమని, ఇక్కడి కార్యకర్తలకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 2014లో తనకు ఇక్కడి నుంచి ఎవరికి టికెట్ వచ్చినా గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. రూ. తొమ్మిది వేల కోట్లు వ్యయమయ్యే జూరాల ప్రాజెక్ట్‌కు సంబంధించి సర్వే పనులకు త్వరలో టెండర్లు పిలవడం జరుగుతుందని మంత్రి ప్రసాద్ కుమార్ తెలిపారు.
పార్టీని రెండుసార్లు గెలిపించిన సత్తా వైఎస్సార్‌దే..
డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను రెండుసార్లు గెలిపించిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. క్యామ మల్లేష్ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. దమ్ముంటే పార్టీని వీడి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సత్తా చాటుకోవాలని ఆయన సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో అవినీతిపరులకు, దళారులకు టికెట్లు రావని, ఇబ్రహీంపట్నం నుంచి మంచి వ్యక్తికి టికెట్ వస్తుందన్నారు.
బొంగ్లూర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు రహదారి విస్తరణకు సంబంధించి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో రాజకీయ ఒత్తిడులొచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణను ప్రకటించిందన్నారు. పీసీసీ సభ్యుడు పాశం లక్ష్మీపతిగౌడ్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గతంలో ఓడిపోయిన నాయకులు కొందరు రాజకీయాలు చేస్తున్నారని, వారి ఆటలు సాగవని హెచ్చరించారు. అభినందన సభను అడ్డుకోవడానికి కొందరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన అన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత మాట్లాడుతూ.. కార్యకర్తలు కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చే యాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు పి. కృపేశ్, ప్రధాన కార్యదర్శులు పాశం భాస్కర్‌గౌడ్, దెంది రాంరెడ్డి, కార్యదర్శి ఎం. వెంకటేశ్, యాచారం మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, సింగిల్‌విండో చైర్మన్ వేముల లక్ష్మణరావు, నాయకులు యాలాల యాదయ్య, శివకుమార్ తదితరులు మాట్లాడారు.
సమావేశంలో డీసీసీ సంయుక్త కార్యదర్శి మంగ వెంకటేశ్, కార్యనిర్వాహక కార్యదర్శులు కర్రె శశిధర్, మంద సుధాకర్, నాయకులు కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, యాచారం రవీందర్, కప్పాటి రఘు తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం మంత్రి ప్రసాద్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు లలితను కార్యకర్తలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంతకు ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బైకు ర్యాలీని నిర్వహించారు.
డిసెంబర్‌లోగా తెలంగాణ ఖాయం
Published Thu, Oct 24 2013 4:35 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement