
పారిస్: క్రీడాలోకమే కాదు... యావత్ దేశం ఎదురుచూపులకు నేడు తెరపడే అవకాశముంది. భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై నేడు తీర్పు వెలువడనుంది. పారిస్ విశ్వక్రీడల్లో మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్లోకి ప్రవేశించిన ఆమె సరిగ్గా బౌట్‌కు ముందు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. దీంతో ఫైనల్లో ఓడినా కనీసం ఖాయమనుకున్న రజతం చేజారడంతో పాటు... అమె పాల్గొన్న వెయిట్ కేటగిరీ జాబితాలో చివరి స్థానంలో నిలవడం భారతావనిని నిర్ఘాంత పరిచింది.
తన అనర్హతపై సవాలుకు వెళ్లిన ఫొగాట్... సంయుక్త రజతం డిమాండ్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిష్ణాతులైన లాయర్లతో ఈ అప్పీలుపై వాదించింది. విచారణ పూర్తికావడంతో నేడు సీఏఎస్ తుది తీర్పు వెలువరించనుంది.
కాగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ... వినేశ్ బరువు పెరగడం, అనర్హతకు బాధ్యుడిని చేస్తూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్‌షా పర్దివాలాపై విమర్శలకు దిగడం సమంజసం కాదని చెప్పింది.సంబంధిత అథ్లెట్ల బరువు, ఈవెంట్ల నిబంధనలపై కోచ్, వ్యక్తిగత సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడింది.
