
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) తాత్కాలిక చైర్మన్‌గా జస్టిస్ ఏఐఎస్ చీమా యథావిధిగా శుక్రవారం విధులు నిర్వహించారు. చీమాను తాత్కాలిక చైర్మన్‌గా పేర్కొంటూ ద్విసభ్య ధర్మాసనం విచారించాల్సిన ప్రధాన కేసుల జాబితా (కాజ్ లిస్ట్) వెలువడింది. ఈ నెల 20వ తేదీ వరకూ ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. అయితే ఎన్‌సీఎల్‌ఏటీ వెబ్‌సైట్ మాత్రం జస్టిస్ ఎం వేణుగోపాల్‌ను తాత్కాలిక చైర్మన్‌గా పేర్కొంటూ ఆయన ఫొటోను ఫోస్ట్ చేయడం గమనార్హం.
వివాదంలోకి వెళితే..
గడచిన ఒకటిన్నర సంవత్సరాలుగా ఎన్‌సీఎల్‌ఏటీకి శాశ్వత చైర్మన్ నియామకం జరగలేదు. ఎన్‌సీఎల్‌ఏటీ జ్యుడీషియల్ మెంబర్‌గా సెప్టెంబర్ 2017 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ చీమా 2021 ఏప్రిల్ 19న అధికారిక ఛైర్‌పర్సన్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారు. అయితే ఆయన పదవీకాలం సెప్టెంబర్ 20తో ముగిసిపోతుంది. అయితే ఈ లోపే అర్థంతరంగా ఆయనను సెప్టెంబర్ 10న కేంద్రం బాధ్యతల నుంచి తప్పించింది.
11వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చే విధంగా అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు జస్టిస్ ఎం వేణుగోపాల్‌ను నియమించింది. దీనిని సవాలుచేస్తూ, చీమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసును విచారణకు చేపట్టింది. చైర్మన్‌లను తొలగించే అధికారం ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం– 2021 కింద కేంద్రానికి ఉందని కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ వేణుగోపాల్ పేర్కొన్నారు. అలా అయితే ఆ చట్టం అమలు చేయకుండా సుమోటోగా స్టే విధిస్తామని అత్యున్నత స్థాయి ధర్మాసనం హెచ్చరించింది. దాంతో ప్రభుత్వం నుంచి సూచనలు పొందేందుకు అరగంట సమయం ఇవ్వాలని అటార్నీ జనరల్ ధర్మాసనాన్ని కోరారు.
అనంతరం అన్ని అధికారాలతో జస్టిస్ చీమా పదవిని పునరుద్ధరించడానికి కేంద్రం అంగీకరించిందని తెలిపారు. బాధ్యతల్లో నియమించిన వారిని వెంటనే తప్పించడం సబబుకాదుకనుక, జస్టిస్ ఎం వేణుగోపాల్‌ను సెప్టెంబర్ 20వ తేదీ వరకూ సెలవుపై పంపనున్నట్లు కూడా ఆయన ధర్మాసనానికి తెలిపారు. దీనితో వివాదానికి తెరపడినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment