సాక్షి, అమరావతి: జగతి పబ్లికేషన్స్, రాంకీ గ్రూపు ఆస్తుల జప్తు విషయంలో ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీల తీరును మనీ లాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. జగతి పబ్లికేషన్స్, రాంకీ సంస్థ లేవనెత్తిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, అందుబాటులో ఉన్న ఆధారాలను పట్టించుకోకుండా ఏకపక్ష వైఖరిని అవలంభించిందని పేర్కొంది. జగతి పబ్లికేషన్స్ ఎఫ్‌డీఆర్ జప్తు విషయంలో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను వెంటనే జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఆ రూ.10 కోట్ల మొత్తానికి సమానమైన ఇండెమ్నిటీ బాండ్‌ను హామీగా ఈడీకి సమర్పించాలని జగతి పబ్లికేషన్స్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్‌సింగ్ శుక్రవారం తీర్పు వెలువరించారు.
మిగిలిన ఆస్తులను వెంటనే విడుదల చేయండి
ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చేంత వరకు ఫార్మా సిటీ లోపల 50 మీటర్ల బఫర్ జోన్‌ను కొనసాగించాలని అప్పిలెట్ ట్రిబ్యునల్ రాంకీ ఫార్మాస్యూటికల్ సిటీ లిమిటెడ్‌ను ఆదేశించింది. దీని విషయంలో మాత్రం జప్తు కొనసాగుతుందని, మిగిలిన ఆస్తులను జప్తు నుంచి వెంటనే విడుదల చేయాలని తేల్చి చెప్పింది. అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేంత వరకు బఫర్ జోన్‌లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం గానీ, బఫర్ జోన్ ప్రాంతాన్ని అమ్మడం గానీ చేయరాదని రాంకీని ఆదేశించింది. అలాగే 16 ప్లాట్లను వెంటనే రాంకీ సంస్థకు స్వాధీనం చేయాలని ఈడీ అధికారులకు స్పష్టం చేసింది. ఈ ప్లాట్లను విక్రయించడం గానీ, ఇందులో నిర్మాణాలు చేపట్టడం గానీ, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం గానీ చేయరాదని రాంకీకి సూచించింది.
ఆరోపణల నిరూపణ బాధ్యత ఈడీదే
జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను, అలాగే రాంకీ గ్రూపునకు చెందిన పలు ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ జప్తును సమర్థిస్తూ ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్, రాంకీ సంస్థ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్‌సింగ్ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ తాజాగా తీర్పు వెలువరించారు. ఈ మొత్తం కేసులో ప్రత్యేక కోర్టు ఇంకా అభియోగాలు నమోదు చేయలేదన్నారు. అభియోగాలను నమోదు చేయనంత వరకు వ్యక్తులపై, సంస్థలపై మనీ లాండరింగ్ ఆరోపణలు చేశారో, ఆ ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత ఈడీపై ఉంటుందన్నారు. ఈ కేసులో రాంకీ గ్రూపు ‘కళంకిత డబ్బు’తో భూములు కొన్నట్లు ఈడీ ఆధారాలు చూపలేదని తెలిపారు. రాంకీతో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని కొన్ని కీలక క్లాజులను ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విస్మరించాయని వెల్లడించారు.
ఫార్మా ఇండస్ట్రియల్ పార్కు గ్రీన్‌బెల్ట్ ఏరియాను 50 మీటర్లకు తగ్గించినందుకే రాంకీ గ్రూపు జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. సీబీఐ చార్జిషీట్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. అదే చార్జిషీట్ ఆధారంగానే రాంకీ, జగతి పబ్లికేషన్స్ ఆస్తులను జప్తు చేసింది. ఆ జప్తును అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. అయితే, మనీ లాండరింగ్ కింద ఈడీ స్వతంత్రంగా దర్యాప్తు చేయలేదు. సీబీఐ ఆరోపణలను ఆధారంగా చేసుకుంటూ జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మనీ లాండరింగ్ కింద తాను చేసిన ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో ఈడీ విఫలమైంది. ఆ రూ.10 కోట్లు ‘లంచం’ అని ప్రాథమికంగా నిరూపించలేకపోయింది. కేవలం అనుమానాలు, ఊహల ఆధారంగానే జగతి పబ్లికేషన్స్, రాంకీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
రాష్ట్రంలో ఫార్మా రంగం అభివృద్ధి కోసం 18.7.2000న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. విశాఖపట్నం పరవాడలో 2,162.5 ఎకరాల్లో ఫార్మా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించింది. రాంకీ గ్రూపునకు చెందిన రాంకీ ఫార్మాస్యూటికల్ సిటీ ఇండియా లిమిటెడ్ (ఆర్‌పీసీఐఎల్) ఫార్మా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతో 12.3.2004న ఏపీఐఐసీ–ఆర్‌పీసీఐఎల్ మధ్య జాయింట్ వెంచర్ కింద ఒప్పందం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ ఒప్పందంలో గ్రీన్‌బెల్ట్ గురించి ప్రస్తావనే లేదు. అయినప్పటికీ ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేందుకు 50 మీటర్ల గ్రీన్‌బెల్ట్‌కు అంగీకరించినట్లు రాంకీ చెప్పింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఈ ఒప్పందం జరిగింది.
– మనీ లాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment