రూ. కోటిన్నర లాభం కోసం.. రూ.53 కోట్లు పెట్టుబడి! | Penna Cements Is Not Money Laundering Said Appellate Tribunal | Sakshi
Sakshi News home page

రూ. కోటిన్నర లాభం కోసం.. రూ.53 కోట్లు పెట్టుబడి పెడతారా!

Published Tue, Jul 16 2019 3:00 AM | Last Updated on Tue, Jul 16 2019 3:26 AM

Penna Cements Is Not Money Laundering Said Appellate Tribunal - Sakshi

సాక్షి, అమరావతి : జగతి పబ్లికేషన్స్, కార్మిల్‌ ఏసియాలో పెన్నా సిమెంట్, పయనీర్‌ ఇన్‌ఫ్రా హోల్డింగ్‌ కంపెనీలు పెట్టిన రూ.53 కోట్ల పెట్టుబడులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ‘లంచం’గా పరిగణించడాన్ని మనీలాండరింగ్‌ అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ తప్పుబట్టింది. ఈ పెట్టుబడులను ‘లంచం’ అని చెప్పేందుకు ప్రత్యక్ష, నిర్ధిష్టమైన, విశ్వసించదగ్గ ఆధారాలు ఏమీలేవని తేల్చిచెప్పింది. పెన్నా సిమెంట్, పయనీర్‌ ఇన్‌ఫ్రా హోల్డింగ్‌ కంపెనీల ఆస్తుల జప్తు విషయంలో ఈడీ, అడ్జుడికేటింగ్‌ అథారిటీల తీరు సరికాదంది. క్విడ్‌ ప్రో కో కింద లబ్ధి చేకూర్చినందుకు జగతి పబ్లికేషన్స్, కార్మిల్‌ ఏసియాలో రూ.53 కోట్లు పెట్టుబడులు పెట్టామని ఆరోపిస్తూ.. ఈడీ తమ ఆస్తులను జప్తుచేయడాన్ని సమర్థిస్తూ అడ్జుడికేటింగ్‌ అథారిటీ 2015లో జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెన్నా సిమెంట్స్, పయనీర్‌ ఇన్‌ఫ్రాలు అప్పిలెట్‌ అథారిటీ ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన అప్పిలెట్‌ అథారిటీ చైర్మన్‌ జస్టిస్‌ మన్మోహన్‌సింగ్‌ ఇటీవల తన తీర్పు వెలువరించారు.
 
అభియోగాలు నమోదు కాక ముందే..
ఈ కేసులో ఇప్పటివరకు అభియోగాలు నమోదు కాక ముందే.. పెన్నా సిమెంట్, పయనీర్‌ ఇన్‌ఫ్రాలు మనీలాండరింగ్‌ కింద ‘షెడ్యూల్డ్‌ నేరం’ చేశాయని అడ్జుడికేటింగ్‌ అథారిటీ చెప్పడాన్ని అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ తన తీర్పులో ఆక్షేపించింది. అలాగే, జప్తుచేసిన ఆస్తులు నేరానికి సంబంధించినవేనని కూడా నిర్ధారించడాన్ని తప్పుబట్టింది. అదే రీతిలో జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు జారీచేసిన వాటాలకు ఎటువంటి విలువ లేదన్న ఈడీ వాదనను అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. బహిరంగ మార్కెట్‌లో ఈ వాటాల విలువ పెరిగిందన్న విషయాన్ని గుర్తుచేసింది. పెన్నా సిమెంట్స్‌కు భూముల బదలాయింపులో చట్ట నిబంధనలను అనుసరించలేదన్న ఈడీ వాదనను సైతం ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. ఈ వాదన ఎంతమాత్రం సరికాదంది. చట్ట నిబంధనలకు లోబడే భూముల బదలాయింపు జరిగిందనేందుకు నిర్ధిష్టమైన ఆధారాలున్నాయంది. ఆస్తుల జప్తు ఖరారు ఉత్తర్వులను జారీచేసే ముందు ఈ ఆధారాలను న్యాయబద్ధంగా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది.

జప్తు నుంచి హోటల్‌ భవనం విడుదల..
‘సీబీఐ చార్జిషీట్‌లో పెన్నా సిమెంట్స్‌ తదితరులపై ఆరోపణలున్నాయి. అయితే, మేం ఇప్పుడు వాటి జోలికి వెళ్లడంలేదు. ఈ ఆరోపణలు వాస్తవమో కాదో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేలుస్తుంది. ప్రస్తుతం మేం చూసేది ఏమిటంటే మనీలాండరింగ్‌ కింద ఈడీ చేసిన దర్యాప్తు, అలాగే.. ఆస్తుల జప్తునకు జారీచేసిన ఉత్తర్వులు చట్ట నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? అన్నదే.’ అని అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ స్పష్టంచేసింది. పెన్నా సిమెంట్స్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను పాక్షికంగా అనుమతించింది. పెన్సా సిమెంట్స్‌ ప్రాస్పెక్టింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిసిన నేపథ్యంలో అనంతపురం జిల్లా, యాడకి మండలంలో జప్తు చేసిన 231 ఎకరాల భూమిని జప్తు నుంచి విడుదల చేయడంలేదంది. అయితే, ఆ భూమిని తమ స్వాధీనంలోకి తీసుకోరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను ఆదేశించింది.

ఇక పయనీర్‌ ఇన్‌ఫ్రా విషయానికొస్తే.. ఇది బంజారాహిల్స్‌లో నిర్మించిన హోటల్‌ భవనానికి సంబంధించి అడ్జుడికేటింగ్‌ అథారిటీ జారీచేసిన జప్తు ఖరారు ఉత్తర్వులను సవరించింది. ఆ భవనాన్ని జప్తు నుంచి విడుదల చేస్తూ, ఆ భవనం తాలుకు విలువను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కింద వసూలు చేసుకోవాలని ఈడీకి స్పష్టంచేసింది. రూ.6.69 కోట్లను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కింద రెండు నెలల్లో ఈడీకి జమచేయాలని పయనీర్‌ ఇన్‌ఫ్రాను ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఈడీ ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చేంత వరకు ఆ భవనంలోని అంతస్తులను విక్రయించరాదని పయనీర్‌ ఇన్‌ఫ్రాను అప్పిలెట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. 

  • ‘రూ.1.5 కోట్ల లాభం కోసం ఎవరైనా రూ.53 కోట్లు పెట్టుబడి పెడతారా! ఎలా సాధ్యమో కూడా అర్థంకాకుండా ఉంది. ఇలా పెట్టుబడి పెట్టడాన్ని లంచం అనడం ఊహకు అందనిది. ‘సాక్షి’లో పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, పయనీర్‌ ఇన్‌ఫ్రా హోల్డింగ్‌ కంపెనీ పెట్టుబడులు నిఖార్‌సైన వ్యాపార లావాదేవీలు. ఇందుకు సాక్ష్యం.. ప్రారంభించిన కొద్ది సంవత్సరాల్లోనే సర్క్యులేషన్‌ పరంగా ‘సాక్షి’ రెండో అతిపెద్ద పత్రికగా ఆవిర్భవించడమే. జగతి పబ్లికేషన్స్, కార్మిల్‌ ఏసియాలో పెన్నా సిమెంట్, పయనీర్‌ ఇన్‌ఫ్రా హోల్డింగ్‌ కంపెనీ పెట్టిన రూ.53 కోట్ల పెట్టుబడులు ‘లంచం’ అని చెప్పేందుకు ఎటువంటి ప్రత్యక్ష, నిర్ధిష్టమైన, విశ్వసించదగ్గ ఆధారాలు ఏమీలేవు.’
  • ‘పెన్నా సిమెంట్స్‌ కోసం అవసరమైన భూములను తీసుకునే విషయంలో రైతులను, అసైనీదారులను బలవంతం చేశారనడం శుద్ధ అబద్ధం. అంతేకాక.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జాయింట్‌ డైరెక్టర్‌ది ఊహాతీత కట్టుకథ. ఒకవేళ అలా బలవంతం చేయడమే నిజమైతే పెన్నా సిమెంట్స్‌పై రైతులు, అసైనీదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదుచేసి ఉండేవారు. అటువంటి ఫిర్యాదుగానీ, సివిల్‌ ప్రొసీడింగ్స్‌గానీ ఏవీ పెండింగ్‌లో లేవని దర్యాప్తు అధికారి ద్వారా తెలుసుకున్నాం. వాణిజ్య ఆస్తులను జప్తుచేసే ముందు ఆ ఆస్తులపై వందల మంది ఉద్యోగుల భవిష్యత్తు, జీవితాలు ఆ«ధారపడి ఉంటాయన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అందువల్ల ఇటువంటి ఆస్తుల జప్తు కొనసాగరాదు. ఇందుకు బదులు ఆ ఆస్తుల విలువను డిపాజిట్‌ చేయించుకోవాలి.’
  • ‘జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్నది పెన్నా సిమెంట్స్, పయనీర్‌ ఇన్‌ఫ్రా హోల్డింగ్‌ కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్ల నిర్ణయం. 1996లో కూడా జగన్‌ కంపెనీల్లో ప్రతాప్‌రెడ్డి పెట్టుబడులు పెట్టారు. ఇందుకు మా ముందు ఆధారాలు కూడా ఉన్నాయి. మిగిలిన మీడియా కంపెనీల పురోగతిని పోల్చుకున్న తరువాతే జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రతాప్‌రెడ్డి నిర్ణయించారు. జగతిలో పెట్టుబడులు పెట్టే సమయానికి ఈనాడు దినపత్రిక వాటా ఒక్కొక్కటి రూ.5.28 లక్షలుగా ఉంది. ఇదే సమయంలో జగతి పబ్లికేషన్స్‌ ప్రీమియం రూ.350, కార్మెల్‌ ఏసియా ప్రీమియం రూ.252గా ఉంది.’
  • ‘సీబీఐ చార్జిషీట్‌ను.. అందులో చేసిన ఆరోపణలను.. ఇంకేదైనా ఎఫ్‌ఐఆర్‌ను.. ఏదైనా నేర ఫిర్యాదును ఈడీ లేదా అడ్జుడికేటింగ్‌ అథారిటీలతో సహా ఏ దర్యాప్తు సంస్థ కూడా దైవిక వాస్తవం (గాస్పెల్‌ ట్రూత్‌)గా భావించడానికి వీల్లేదు. ఆ ఆరోపణలు ఇంకా చట్ట ప్రకారం న్యాయస్థానం ముందు రుజువు కాలేదన్న విషయాన్ని విస్మరించరాదు. స్వతంత్ర సంస్థగా చెబుతున్న ఈడీ.. ఆయా వ్యక్తులు, సంస్థలకు మనీలాండరింగ్‌తో సంబంధం ఉందని నిరూపించేందుకు అవసరమైన స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలను సేకరించాలి. కేవలం ఆరోపణల ఆధారంగా ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీచేయడానికి వీల్లేదు. ఆ ఆస్తులు మనీలాండరింగ్‌ ద్వారానే సమకూర్చారని నమ్మేందుకు కారణాలు ఉంటే తప్ప వాటిని జప్తు చేయడానికి ఏ మాత్రం వీల్లేదు.’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement