వాషింగ్టన్: మిత్ర దేశాలకు విక్రయించే డ్రోన్ల విషయంలో ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. గంటకు 800 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే సామర్థ్యమున్న డ్రోన్ల ఎగుమతులకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్(ఎంటీసీఆర్) చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే డ్రోన్లను ఇప్పటివరకు బ్రిటన్, ఫ్రాన్సు, ఆస్ట్రేలియాలకు మాత్రమే అమెరికా విక్రయించింది.
తాజా నిర్ణయం అమెరికా మిత్రదేశాలు సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్టులతోపాటు ముఖ్యంగా భారత్‌కు లాభించనుంది. లిబియా, యెమెన్ అంతర్యుద్ధంలో వివిధ పక్షాలు వాడుతున్న చైనా డ్రోన్లకు దీటుగా మిత్ర దేశాలకు వీటిని విక్రయించాలని కూడా అమెరికా యోచిస్తోంది. ‘800 కిలోమీటర్ల నిబంధన’ను చైనా అనుకూలంగా మార్చుకుని, డ్రోన్ల తయారీ భారీగా చేపట్టి, మార్కెట్ అవకాశాలను పెంచుకుంది. అదే సమయంలో అమెరికా డ్రోన్ పరిశ్రమ అవకాశాలను కోల్పోతూ వచ్చింది. అమెరికా మిత్ర దేశాలైన ఈజిప్టు, సౌదీ అరేబియాలకు సైతం చైనా డ్రోన్లను విక్రయించింది.
అమెరికాతోపాటు ఇతర భాగస్వామ్య దేశాల భద్రత ఈ పరిణామంతో ప్రమాదంలో పడింది’అని ట్రంప్ యంత్రాంగం అంటోంది. ‘మా మిత్ర దేశాల అత్యవసర జాతీయ భద్రత అవసరాలు తీరనున్నాయి’అని విదేశాంగ శాఖ ఉన్నతాధికారి క్లార్క్ కూపర్ వెల్లడించారు. అయితే, ట్రంప్ చర్యతో అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆయుధ నియంత్రణ వ్యవస్థ బలహీనపడినట్లేనని సెనేటర్ బాబ్ మెనెండెజ్ అంటున్నారు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ..500 కిలోల బరువైన బాంబులు, హెవీ వార్‌హెడ్స్ తదితర పేలుడు సామగ్రిని మోసుకెళ్లే డ్రోన్లను కూడా స్వేచ్ఛగా విక్రయించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సభ్యుడు, విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎలియట్ ఎంగెల్ ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్‌కు పొసీడన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు
చైనాతో సరిహద్దు వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో భారత సైన్యం అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అమెరికా నుంచి మరో 6 లాంగ్‌రేంజ్ పొసీడన్–8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు సన్నద్ధమైంది. 6 ప్రిడేటర్–బి ఆర్మ్‌డ్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక తయారు చేస్తోంది. 6 పొసీడన్–8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం 1.8 బిలియన్ డాలర్లు(రూ.13,400 కోట్లు) వెచ్చించనున్నారు. ఈ మేరకు అభ్యర్థన లేఖను అమెరికా ప్రభుత్వానికి పంపించినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. పొసీడన్–8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సరిహద్దుల్లో, సముద్ర ఉపరితలంపై నిఘా కోసం ఉపయోగిస్తారు. ఇందులో రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సార్లు ఉంటాయి.
భారత్‌కు లాభమెంత?
చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా నిర్ణయం భారత్‌కు అనుకూలంగా మారింది. 22 ప్రిడేటర్–బి రకం డ్రోన్లను విక్రయించేందుకు భారత్‌తో అమెరికా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. గంటకు 482 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే నిఘా డ్రోన్లు ప్రిడేటర్–బి, 629 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే గ్లోబల్ హాక్‌లను అమెరికా నుంచి సమకూర్చుకునేందుకు వీలు కలుగనుంది. ఈ రెండు రకాల డ్రోన్లు సడలింపునకు లోబడి గంటకు 800 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణించేవే కావడం గమనార్హం. ఇవి 4హెల్‌ఫైర్ క్షిపణులతోపాటు 225 కిలోల లేజర్ గైడెడ్ బాంబులను తీసుకెళ్లగలవు. మానవ సహిత యుద్ధ విమానాల స్థానంలో పర్వత ప్రాంతాల్లో విధులు చేపట్టేందుకు డ్రోన్లతో స్వా్కడ్రన్‌లను ఏర్పాటుచేయాలని భారత్ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment