తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌కు లైన్‌క్లియర్‌ | Telangana Government Issued Orders On EWS Reservation Implementation | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌కు లైన్‌క్లియర్‌

Published Tue, Aug 24 2021 9:53 PM | Last Updated on Wed, Aug 25 2021 4:01 AM

Telangana Government Issued Orders On EWS Reservation Implementation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ (అగ్రవర్ణ పేదల) రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ కోటా కింద రిజర్వేషన్‌ పొందడంలో.. ఆదాయ ధ్రువీకరణ పత్రమే కీలకంగా ఉండనుంది. ఆయా అభ్యర్థులు/విద్యార్థులు అందజేసిన అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాక నిబంధనలకు అనుగుణంగా తహసీల్దార్లు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీచేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారంఉత్తర్వులు జారీ చేశారు. 

ఎవరెవరు అర్హులు? 

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కిందకురాని వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌కు అర్హులు. 
  • వీరి కుటుంబ స్థూల వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. వేతనం, వ్యవసాయం, వృత్తి, వ్యాపారం తదితర అన్నిమార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. 
  • ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ కోరే వ్యక్తితోపాటు వారి తల్లిదండ్రులు, 18ఏళ్లలోపు ఉన్న తోబుట్టువులు, జీవిత భాగస్వామి, 18ఏళ్లలోపు వయసున్న సంతానాన్ని కుటుంబంగా పరిగణనలోకి తీసుకుంటారు. తోబుట్టువులు, సంతానం 18 ఏళ్లపైన వయసున్న వారైతే.. వారి ఆదాయాన్ని కుటుంబ ఆదాయం కింద లెక్కించరు. 
  • ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమానంగా ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. పరీక్ష, ఇతర ఫీజుల మినహాయింపులు సమానంగా వర్తిస్తాయి. 
    బ్యాక్‌లాగ్‌ నియామకాలకు నో.. 
  • ఏదైనా నియామక సంవత్సరం (రిక్రూట్‌మెంట్‌ ఇయర్‌)లో సరైన అర్హుల్లేక ఈడబ్ల్యూఎస్‌ కోటా పోస్టులు భర్తీ కాకుంటే.. ఆ పోస్టులను తర్వాతి నియామక సంవత్సరానికి బ్యాక్‌లాగ్‌ పోస్టుగా బదిలీ (క్యారీ ఫార్వర్డ్‌) చేయకూడదు. 
  • వికలాంగులు/ఎక్స్‌సర్వీ స్‌మెన్‌ కోటా కింద ఈడబ్ల్యూఎస్‌కు చెందిన వ్యక్తులెవరైనా ఎంపికైతే.. వారికి ఈడబ్ల్యూఎస్‌ రోస్టర్‌ వర్తింపజేయాలి. 
  •  అన్‌రిజర్వ్‌డ్‌ పోస్టులకు పోటీపడే హక్కును ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు నిరాకరించరాదు. 
  • ఈడబ్ల్యూఎస్‌ వ్యక్తులు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెరిట్‌ ఆధారంగా (అన్‌రిజర్వ్‌డ్, ఓపెన్‌ కోటాల కింద) ఎంపికైతే.. వారి ఎంపికను ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద లెక్కించరాదు. 
  •  ఈడబ్ల్యూఎస్‌ కోటాలో అంతర్గతంగా మహిళలకు 33 1/3 శాతం కోటా అమలు చేస్తారు. 
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రోస్టర్‌ పాయింట్లను కూడా ఖరారు చేశారు. ప్రతి 100 ఖాళీల భర్తీలో.. 9, 17 (మహిళలు), 28, 36, 50 (మహిళలు), 57, 65 (మహిళలు), 76, 86, 100 స్థానాల్లో వీటిని కేటాయిస్తారు. 
  • తప్పుడు మార్గాల్లో అనర్హులు ఈడబ్ల్యూఎస్‌ కోటా ద్వారా ఉద్యోగాలు పొందకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. అనర్హులు ఎంపికైతే సర్వీసు నుంచి తొలగించాలి. 
  • ఇకపై జరిపే అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులను చేర్చుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి ఉన్నత విద్యాసంస్థ కూడా వివిధ కోర్సులు/ బ్రాంచీ/ ఫ్యాకల్టీలో సీట్ల సంఖ్యను పెంచాలి. 

‘ఆదాయ’ ధ్రువీకరణ తర్వాతే ఉద్యోగం 
ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఎవరైనా ఉద్యోగానికి ఎంపికైనా.. వారి ‘ఆదాయ ధ్రువీకరణ పత్రం’ తనిఖీ ప్రక్రియను సంబంధిత వర్గాలు పూర్తిచేసే వరకు ఆ నియామకం తాత్కాలికమే. అక్రమంగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ పొందినట్టు గుర్తిస్తే వెంటనే ఎలాంటి కారణాలు తెలపకుండానే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు. ఈ విషయాలను అభ్యర్థులకు జారీచేసే నియామక ఉత్తర్వుల్లో పొందుపర్చాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అభ్యర్థి సమర్పించిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీచేసిన అధికారి ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించారు.  


చదవండి: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా లింబాద్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement