ఏపీలో ఎస్పీల బదిలీలు
24 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం
పోస్టింగ్స్ పొందిన ఎస్పీల్లో బయటి రాష్ట్రాలవారూ..
‘రోస్టర్ విధానం’తో కేడర్ మారితే మరోసారి బదిలీలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఎస్పీ స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 13 జిల్లాలు, మూడు అర్బన్ జిల్లాల అధికారులతోసహా 24 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 11 మంది డెరైక్ట్ ఐపీఎస్‌లు కాగా... మిగిలినవారు కన్ఫర్డ్ ఐపీఎస్‌లు. డెరైక్ట్ అధికారుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రాష్ట్రేతర అధికారులు కూడా ఉన్నారు. వీరిలో గ్రేవల్ నవ్‌దీప్‌సింగ్(స్వస్థలం పంజాబ్), తఫ్సీర్ ఇక్బాల్(జార్ఖండ్), ఎస్.సెంథిల్‌కుమార్(తమిళనాడు), నవీన్ గులాటి(గుజరాత్)లను నాలుగు జిల్లాలకు ఎస్పీలుగా నియమించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఐపీఎస్ అధికారుల పంపిణీకోసం ఏర్పాటైన ప్రత్యుష సిన్హా కమిటీ సిఫార్సులు మరో నెల రోజుల్లో అమల్లోకి రానున్నాయి.
వీటిప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పనిచేస్తున్న రాష్ట్రేతర అధికారుల్ని రోస్టర్ పద్ధతిలో పంచుతారని తెలుస్తోంది. ఇది అమలైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న రాష్ట్రేతర అధికారులను వేరే రాష్ట్రానికి కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేడర్లు మారితే నెల రోజుల తరువాత మరోసారి ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టే అవకాశముంది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రధాన విజిలెన్స్ అండ్ భద్రతా అధికారిగా పనిచేస్తున్న జి.శ్రీనివాస్‌ను చిత్తూరు ఎస్పీగా నియమించిన ప్రభుత్వం టీటీడీలో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం గుంటూరు రూరల్, రాజమండ్రి అర్బన్, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారుల్ని ప్రాధాన్యం లేని పోస్టుల్లోకి మార్చింది.