పట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కులగణనకు ఎదురు దెబ్బ తగిలింది. వెంటనే ఈ సర్వేని నిలిపివేయాలని పట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు సేకరించిన డేటాని తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎవరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కులాల ఆధారంగా జనాభా లెక్కలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినోద్ చంద్రన్ ఆధ్వర్యంలో హైకోర్టు బెంచ్ పిటిషన్‌దారులు డేటా సమగ్రత, భద్రతపై వెలిబుచ్చిన ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదంటూ పిటిషన్‌దారులు పేర్కొనడాన్ని కూడా ప్రస్తావించింది. కులాల గణాంకాలు ఇతరుల చేతుల్లో పడితే దాని వల్ల రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను జులై 7కి వాయిదా వేసింది. నితీశ్ ప్రభుత్వం జనవరి 7 నుంచి 21 వరకు తొలి విడత కులగణన నిర్వహించింది. రెండో విడత ఏప్రిల్ 15 నుంచి మే 15వరకు జరగాల్సి ఉంది. ప్రభుత్వం ఇది కులగణన కాదని, ఆర్థికంగా వెనుకబడిన వారు ఏయే కులాల్లో ఉన్నారో తెలిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్న ఉద్దేశంతోనే దీనిని చేపట్టినట్టుగా వాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment