సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ ఆదేశాల మేరకు కొత్త ప్రాజెక్టుల సర్వేకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణకు నీళ్లు అందకుండా పోయే ప్రమాదముందని కేబినెట్ సమావేశంలో ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తాగునీటికీ ఇక్కట్లు తప్పవని సమావేశంలో పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు చేరకముందే మళ్లించేలా పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. కొత్త ప్రాజెక్టుల సర్వేకు ఉత్తర్వులు జారీ చేశారు.
సర్వేకు ఆదేశించిన పనులు ఇవే..
►శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్‌లో జోగుళాంబ బ్యారేజీ నిర్మించి 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేస్తారు.
►భీమా నదికి వరద వచ్చే రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ తరలించేలా నారాయణపేట జిల్లా కుసుమర్తి గ్రామం నుంచి వరద కాలువ తవ్వుతారు. ఈ కాలువ ద్వారా జూరాల ప్రాజెక్టు పరిధిలోని గోపాలదిన్నె రిజర్వాయర్ వరకు చెరువులు, రిజర్వాయర్లు నింపుతారు.
►ఆర్డీఎస్, నెట్టెంపాడు ఎత్తిపోతల గ్యాప్ ఆయకట్టుకు నీళ్లివ్వడానికి సుంకేశుల బ్యారేజీ బ్యాక్ వాటర్‌లో కొత్త ఎత్తిపోతల పథకం చేపడతారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు దీని ద్వారా నీళ్లిస్తారు.
►కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో కొత్తగా 20 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మిస్తారు.
►పులిచింతల డ్యాం ఫోర్‌షోర్‌లో ఎత్తిపోతల పథకం చేపట్టి నల్లగొండ జిల్లాలోని అప్‌ల్యాండ్ ప్రాంతాల్లో గల 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తారు.
►నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌లో ఎత్తిపోతల పథకం నిర్మించి కాల్వ చివరి, ఎగువ ప్రాంతాల్లోని లక్ష ఎకరాలకు నీళ్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment