'సస్పెన్షన్ ఎత్తివేత... సచివాలయంలో పోస్టింగ్'
ఏపీఎన్జీవో సభలో తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిని సచివాలయంలోనే పోస్టింగ్ ఇస్తున్నట్లు ఆదేశాలలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ... ఏపీఎన్జనీవోలు గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన నగరంలోని లాల్ బహద్దుర్ స్టేడియంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన కానిస్టేబుళ్లు శ్రీనివాసగౌడ్, శ్రీశైలం ముదిరాజ్ల జై తెలంగాణ అంటూ పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది.
అయితే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఇరుసభలు ఆమోదించడంతోపాటు రాష్ట్రపతి రాజముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పనులు చకచక జరిగిపోయాయి. తెలంగాణ ఆవిర్బావానికి జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డేగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమ ప్రాంతానికి చెందిన కానిస్టేబుళ్లపై నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.