ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోనే..
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 26 రోజులు గడుస్తున్నా జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా మార్పులు జరగలేదు. జిల్లా వెబ్‌సైట్ www.adilabad.nic.in లో ఆదిలాబాద్ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లే దర్శనమిస్తోంది. ఈ వెబ్‌సైట్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ) చూస్తోంది. సదరు ఎన్‌ఐసీ బాధ్యులు ఆదిలాబాద్ జిల్లా వెబ్‌సైట్‌లో తెలంగాణ రాష్ట్రం అని అప్‌డేట్ చే యలేదు. జిల్లాకు సంబంధించిన పరిపాలన అంశాలతోపాటు ప్రజలకు చేరవేయాల్సిన సమాచారం అంతా ఈ వెబ్‌సైట్ నుంచే జరగుతుంది. ఇంతటి కీలకమైన అప్‌డేట్ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు ఎన్‌ఐసీ వర్గాలకు సమాచారం ఇవ్వాలని తెలంగాణవాదులు కోరుతున్నారు.
నెలలోగా బోర్డు మార్చాల్సిందే..
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సముదాయాల నామఫలకాలు(నేమ్‌ప్లేట్స్)ను నెలలోగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతల పర్యవేక్షణను కార్మిక శాఖకు అప్పగించింది. రాష్ట్రం పేరు మార్పు నిర్ణయాన్ని పాటించని సంస్థలు, కార్యాలయాలపై జరిమానాలు విధించే అధికారాన్ని కట్టబెట్టింది. నేమ్‌ప్లేట్లు ఏ తేదీల్లోగా మార్చాలి, మార్చని సంస్థలు, వ్యాపార సముదాయాలపై విధించే జరిమానాలతో కూడిన జీవో ఒకట్రెండు రోజుల్లో విడుదల కానుంది.
ఇటీవల జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పు ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా కార్మిక శాఖ బాధ్యతలు చూస్తున్న మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం ఆదేశాలిచ్చారు. దీంతో నాయిని ఆ శాఖను అప్రమత్తం చేశారు. విధివిధానాల జీవోను త్వరగా విడుదల చేయాలని కోరారు. రాష్ట్రం పేరు మార్పిడికి సంబంధించిన మార్గదర్శకాలు అందిన తర్వాత తమ కార్యాచరణ ఉంటుందని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దండపాణి తెలిపారు.