
కోల్‌కతా పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
కోల్‌కతా: రాజ్‌భవన్ వద్ద బందోబస్తు విధుల్లో ఉండే కోల్‌కతా పోలీసు సిబ్బంది తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్ నార్త్‌గేట్ వద్ద ఉన్న పోలీస్ ఔట్ పోస్టును ప్రజావేదికగా మార్చాలని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం. గవర్నర్, మమతా బెనర్జీ మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలోనే ఇటీవల చోటుచేసుకున్న ఒక పరిణామమే దీనికి కారణమని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
దీనిపై గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచి్చన సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ నేతల బృందాన్ని రాజ్‌భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయంటూ బీజేపీ నేతలను వెనక్కి పంపించి వేశారు. గవర్నర్ రాతపూర్వకంగా అనుమతి ఇచి్చనప్పటికీ పోలీసులు ఇలా వ్యవహరించడం వివాదస్పదమైంది. దీనిపై సువేందు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించడం.. గవర్నర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారా అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.