kolkata police
-
కోల్‌కతా డాక్టర్ కేసు: ఇద్దరు డాక్టర్లు, బీజేపీ నేతకు నోటీసులు
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్దఎత్తున నిసన తెలియజేస్తున్నారు. అయితే మరోవైపు.. హత్యాచార ఘటనప తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. తాజాగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు ఆదివారం ఇద్దరు ప్రముఖ వైద్యులు, సీనియర్ బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డాక్టర్ కునాల్ సర్కార్, డాక్టర్ సుబర్ణ గోస్వామి, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.హత్యాచారం కేసు దర్యాప్తు, పోస్ట్‌మార్టం నివేదికకు సంబంధించి డాక్టర్ సర్కార్, డాక్టర్ గోస్వామి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ సుబర్ణ గోస్వామి.. ఈ ఘటను సామూహిక అత్యాచారమని పేర్కొన్నారు. 150 మిల్లీగ్రాముల వీర్యం, శరీరంలో పలు ఎముకలు విరిగిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదిక తెలిజేస్తోందని ఆయన మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. హత్యాచార బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశారనే ఆరోపణలపై బీజేపీ మాజీ ఎంపీ, లాకెట్ ఛటర్జీపై కోల్‌కతా పోలీసులు ఆరోపణలు చేశారు. బాధితురాలి పేరు, చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు పోలీసులు ఆమెను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. పోలీసులు చేసిన నోటీసులపై లాకెట్ ఛటర్జీ స్పందించారు. ‘కోల్‌కతా పోలీసులు బాధితురాలికి న్యాయం చేయడం కంటే సోషల్ మీడియా పోస్ట్‌లను చూడటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’అని ఆరోపించారు.ఇక.. ఇప్పటికే జూనియర్ డాక్టర్‌పై వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని కోల్‌కతా పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపారు. -
రాజ్‌భవన్ ఆవరణను తక్షణమే ఖాళీ చేయండి
కోల్‌కతా: రాజ్‌భవన్ వద్ద బందోబస్తు విధుల్లో ఉండే కోల్‌కతా పోలీసు సిబ్బంది తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్ నార్త్‌గేట్ వద్ద ఉన్న పోలీస్ ఔట్ పోస్టును ప్రజావేదికగా మార్చాలని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం. గవర్నర్, మమతా బెనర్జీ మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలోనే ఇటీవల చోటుచేసుకున్న ఒక పరిణామమే దీనికి కారణమని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచి్చన సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ నేతల బృందాన్ని రాజ్‌భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయంటూ బీజేపీ నేతలను వెనక్కి పంపించి వేశారు. గవర్నర్ రాతపూర్వకంగా అనుమతి ఇచి్చనప్పటికీ పోలీసులు ఇలా వ్యవహరించడం వివాదస్పదమైంది. దీనిపై సువేందు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించడం.. గవర్నర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారా అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. -
పోలీసులపై బాలల హక్కుల సంఘం చీఫ్ సంచలన ఆరోపణలు
బాలల హక్కుల సంఘం చీఫ్ ప్రియాంక కనూంగో పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసి దుర్భాషలాడరని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు అధికారులు. తాము ఆయనకు సహకరించామని, అతనే తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ వారంలో కోల్‌కతాలోని తిల్జాలా ప్రాంతంలో ఒక మైనర్ తన పొరుగింటి వారి చేతిలోనే హత్యకు గురయ్యింది. ఈ విషయమైన తాను అక్కడకు వచ్చానని నేషనల్ కమిషన్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్) చైర్ పర్సన్ ప్రియాంక కనూంగో చెప్పారు. అప్పుడే కోల్‌కతా పోలీసులు తనపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. పోలీసులు మాపై జరుపుతున్న దర్యాప్తు ప్రక్రియలను రహస్యంగా రికార్డు చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకించినందుకే తనపై దాడి చేరని కనూంగో సోషల్ మీడియా వేదికగా హిందీలో ట్వీట్ చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ కమీషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(డబ్ల్యూసీపీసీఆర్) చీఫ్ సుదేష్నా రాయ్ స్పందిస్తూ..తనను, తమ సహోద్యోగులను కనూంగో అవమానించాడని అన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అసలు ఎన్సీపీసీఆర్ బృందం మాకు సమాచారం ఇవ్వకుండా ఆ బాలిక కుటుంబం వద్దకు వెళ్లిందన్నారు. నిజానికి ఆ ప్రతిపాదిత పర్యటన అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్నే పేర్కొంటూ రాయ్ ఎన్‌సీపీసీఆర్‌కి లేఖ కూడా రాశారు. (చదవండి: విమానంలో మరో అనుచిత ఘటన: తాగిన మత్తులో 62 ఏళ్ల ప్రయాణికుడి వీరంగం) -
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తిపై పోలీసుల ప్రశ్నల వర్షం
కోల్‌కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు, బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని కోల్‌కతా పోలీసులు ప్రశ్నించారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిథున్ చేసిన ఓ ప్రసంగంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం మిథున్‌ను 45 నిమిషాలపాటు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, 71 ఏళ్ల మిథున్ చక్రవర్తి.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ఆవేశపూరితంగా ప్రసంగించారు. కాగా, బెంగాల్ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ హింసపై మిథున్ ప్రసంగాల ప్రభావం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ‘ఎగిరి తంతే.. శవం శ్మశానంలో పడుతుంది’ అంటూ తన సినిమాలోని డైలాగును ఉపయోగించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఆవేశంగా డైలాగులు చెప్పానే తప్ప.. ఉద్దేశపూర్వక ప్రసంగాలు చేయలేదని మిథున్ కోల్‌కతా కోర్టుకు విన్నపించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును కోరాడు కూడా. అయితే కోర్టు మాత్రం ఆయన్ని వర్చువల్‌గా ప్రశ్నించాలని పోలీసులను ఆదేశించింది. ఇక మరో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేనేం ఉత్త పామును కాను. నల్లత్రాచుని. కాటేస్తే.. నీ ఫొటోకి దండ పడాల్సిందే’ అని అర్థం వచ్చేలా కామెంట్లు చేశాడు. అన్నట్లు.. ఈ డిస్కో డ్యాన్సర్ పుట్టినరోజు ఇవాళే. చదవండి: మిథున్ కొడుకుపై రేప్ కేస్ -
మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను: గంగూలీ
కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ కోల్‌కతా పోలీసుపై ప్రశంసల వర్షం కురుపిస్తున్నాడు. దేశమంతా కరోనా వైరస్‌తో భయపడుతుంటే.. పశ్చిమ బెంగాల్‌ను మాత్రం ఉంపన్ తుపాను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తుపాను ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు కూలి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ పోలీసు అధికారి స్థానికులతో కలిసి ఆ చెట్లను పక్కకు లాగుతున్నాడు. రెండు రోజుల క్రితం కోల్‌కతా సౌత్ ఈస్ట్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇప్పటికే పలువురు ప్రశంసలు పొందిన ఈ వీడియోను చూసిన గంగూలీ ‘కోల్‌కతా పోలీసులను చూసి ఎంతో గర్విస్తున్నాం’ అని ప్రశంసిస్తూ మరో సారి రీట్వీట్ చేశాడు. (ఉంపన్.. కోల్‌కతా వణికెన్) We leave no stone unturned. #WeCareWeDare @CPKolkata @KolkataPolice pic.twitter.com/zI6M6OngWl — DC SED Kolkata Police (@KPSoutheastDiv) May 21, 2020 ఉంపన్ ధాటికి రాష్ట్ర రాజధాని కోల్‌కతా చిగురుటాకులా ఒణికిపోతుంది. గంటకి 190 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తూ నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లు గాలుల ధాటికి తిరగబడ్డాయి. కోల్‌కతాలో తుపాను బీభత్స దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారులకి ఇరువైపులా ఉన్న వందలాది చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. భారీ తుపాను కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది మృత్యువాత పడ్డారు. ఉంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.(బెంగాలీ కుటుంబం.. విషాదాంతం) -
ట్రాఫిక్ పోలీస్ ‘మన్కడింగ్’
బట్లర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా అశ్విన్ ఔట్ చేయడం ఎంత వివాదం రేపిందో తెలిసిందే. అయితే కోల్‌కతా పోలీసులు దీనిలో మరో కోణాన్ని చూశారు. వెంటనే దానిని పోస్టర్‌గా మలచి ప్రజల్లో ‘ట్రాఫిక్ అవగాహన’ కోసం వాడుకునే ప్రయత్నం చేశారు. ‘ఆకుపచ్చ లైట్ రాక ముందే ముందుకు వెళ్లవద్దు, గీత దాటితే తప్పించుకోలేరు... అంటూ బెంగాలీలో వ్యాఖ్య రాసి ట్రాఫిక్ ఫోటో కూడా కలిపి పెట్టారు. దీనిపై స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఎందుకంటే 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా నోబాల్ కారణంగా బతికిపోయిన ఫఖర్ జమాన్ సెంచరీతో పాక్‌ను గెలిపించడంతో ఇదే తరహాలో జైపూర్ పోలీసులు పోస్టర్లు వేశారు. దేశం తరఫున ఆడే ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ అప్పట్లో స్వయంగా బుమ్రా దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పోలీసులు వాటిని తొలగించాల్సి వచ్చింది. -
రోడ్డైనా.. క్రీజైనా.. లైన్ దాటితే అంతే!
కోల్‌కతా : వారెవ్వా ఏం క్రియేటివిటీ భయ్యా! అంటూ కోల్‌కతా పోలీసులపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. అవును వారి క్రియేటివిటీ చూస్తే మీరు కూడా ఔరా అనాల్సిందే. ఇంతకీ ఆ క్రియేటివిటీ ఏంటంటే.. ఐపీఎల్లో తాజాగా చోటుచేసుకున్న మన్కడింగ్ వివాదం కింగ్స్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఆ వివాదాన్నే ఉపయోగిస్తూ కోల్‌కతా పోలీసులు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బంతి వేయకుండానే నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న జోస్ బట్లర్ క్రీజు దాటడంతో అశ్విన్ బంతిని వికెట్లకు కొట్టి మన్కడ్ విధానంలో రనౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఇదే పాయింట్ పట్టుకున్న కోల్‌కతా పోలీసులు.. ట్రాఫిక్ సిగ్నల్ లైన్ దాటిన ఓ వాహనం ఫొటోను.. దాని పక్కనే క్రీజు దాటిన జోస్ బట్లర్ ఫొటోను పెట్టి ట్వీట్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా.. ‘క్రీజ్ అయినా.. రోడ్డు అయినా.. లైన్ దాటితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే’ నని పేర్కొంది. వినూత్నంగా ఉన్న ఈ ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. గతంలో జైపూర్ పోలీసులు కూడా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా వేసిన నోబాల్ దృశ్యాన్ని ఇదే తరహా ప్రచారానికి వాడారు. అయితే అప్పట్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బుమ్రా కూడా ఈఘటనపై సీరియస్‌గానే స్పందించాడు. pic.twitter.com/mlcI1qsXeV — Kolkata Police (@KolkataPolice) March 26, 2019 చదవండి: ‘మన్కడింగ్’ రేపిన దుమారం -
షమీకి మరో షాకిచ్చిన భార్య
-
షమీకి మరో షాకిచ్చిన భార్య
కోల్‌కతా: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందు ఊహించని షాక్ తగిలింది. గతేడాది ఐపీఎల్‌కు ముందు షమీపై లైంగిక ఆరోపణలు చేసిన అతని భార్య హసీన్ జహాన్ తాజాగా వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రపంచకప్, ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్న షమీపై ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. (మహ్మద్ షమీ భావోద్వేగం..) ఇక మహ్మద్ షమీ తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడనే సంచలన ఆరోపణలతో హసీన్ జహాన్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం తెలిసిందే. చివరకు షమీపై బీసీసీఐ కూడా చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. హసీన్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ న్యాయ విచారణ కమిటీ దర్యాప్తు చేసి క్లీన్ ఛీట్ ఇచ్చింది. తనకు.. తన కూతురు పోషణ ఖర్చులకు డబ్బులు పంపాలంటూ హసిన్ జహాన్ కోర్టును కూడా ఆశ్రయించింది. దీనికి కూడా తలొగ్గిన షమీ నెలకు రూ.80వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నవిషయం తెలిసిందే. (‘మరో పెళ్లి చేసుకోవడానికి పిచ్చోడినా’) జహాన్.. ఐ మిస్ యూ: షమీ -
సూసైడ్ నోట్లో ఆరోపణలు : చిక్కుల్లో దీదీ
కోల్‌కతా : పదవీవిరమణ చేసిన సీనియర్ పోలీస్ అధికారి బలవన్మరణానికి పాల్పడుతూ సూసైడ్ నోట్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీదీ తనకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టడంతో పాటు గత ఏడాది డిసెంబర్ 31న పదవీవిరమణ అనంతరం రావాల్సిన బకాయిలను తొక్కిపెట్టారని 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గౌరవ దత్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. దత్ ఆత్మహత్యపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మౌనం దాల్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దత్‌పై క్రమశిక్షణా చర్యలు కొనసాగుతున్నందునే ఆయనను కంపల్సరీ వెయిటింగ్ జాబితాలో ఉంచారని, సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టుగా ఎలాంటి బకాయిలు పెండింగ్‌లో లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఓ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ చరిత్రలో ఇదే తొలిసారని బీజేపీ నేత ముకుల్ రాయ్ మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
యువతులను చూస్తూ...
సాక్షి, కోల్‌కతా: బస్సులో మహిళల ముందే వికృత చేష్టలకు దిగాడు ఓ కామాంధుడు. వారికి సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కండక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో ఆ తతంగం అంతా వీడియో తీసిన ఓ యువతి ఫేస్బుక్లో అప్ లోడ్ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్ అయి పోలీసులకు చేరింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... హూగ్లీ జిల్లా వైద్యపతి ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తి ఓ చిరు వ్యాపారి. శనివారం శ్యామ్‌పుకర్ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తూ.. మహిళా ప్రయాణికులను చూస్తూ యువతులను చూస్తూ అసభ్య చేష్టలకు దిగాడు. అది గమనించిన ఇద్దరు మహిళలు కండక్టర్‌తో చెప్పారు. కానీ, అతని నుంచి స్పందన లేకపోవటంతో మౌనంగా ఉండిపోయారు. ఇంతలో ఓ యువతి ఆ వ్యాపారి చేష్టలను వీడియో తీసి ఫేస్బుక్లో అప్ లోడ్ చేసింది. ఎవరూ పట్టించుకోలేదని, మహిళలకు భద్రత ఏదంటూ పోస్టు చేసింది. అది కాస్త గంటల్లో వైరల్ అయి కోల్‌కతా పోలీసులకు చేరింది. ఇలాంటి వ్యవహారాల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని, అతన్ని శనివారం సాయంత్రమే అరెస్ట్ చేసినట్లు కోల్‌కతా పోలీసులు ఫేస్బుక్లో తెలియజేశారు. -
షమీని విచారించిన కోల్‌కతా పోలీసులు
భారత క్రికెటర్ మొహమ్మద్ షమీని కోల్‌కతా పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. అతని భార్య హసీన్ జహాన్ ఈ పేస్ బౌలర్‌పై గృహహింస తదితర కేసులు పెట్టింది. దీనిపై కోర్టు అతనికి సమన్లు జారీ చేయగా...షమీ బుధవారం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీకి ఆడుతున్న అతను 16న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ ముగిశాక జట్టుతో పాటు బెంగళూరు (తదుపరి మ్యాచ్ వేదిక)కు బయల్దేరలేదు.విచారణ నిమిత్తం అక్కడే ఉన్నాడు. విచారణకు షమీ సహకరించాడని, అతను తిరిగి జట్టుతో కలిసేందుకు అనుమతించినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు. -
క్రికెటర్ షమీకి నోటిసులు
-
షమీ దుబాయి ఎందుకు వెళ్లాడు?
కోల్‌కతా : భారత క్రికెటర్ మహ్మద్ షమీ కేసు మరో మలుపు తిరిగింది. భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణల నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. షమీ దుబాయ్ ఎందుకు వెళ్లాడని ఆరా తీయడంతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఏమైనా సహకరించాడా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. దీనిలోభాగంగా షమీ దుబాయ్‌కు వెళ్లిన సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా అని పోలీసులు బీసీసీఐ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో ఇప్పటికే బీసీసీఐ ఇచ్చే వార్షిక వేతనాల కాంట్రాక్ట్ కోల్పోయిన షమీ, ఐపీఎల్‌లోనూ ఆడటం అనుమానంగా మారింది. -
పోలీసులకు హర్లీ డేవిడ్ సన్ బైక్స్
కోల్‌కతా: హర్లీ డేవిడ్ సన్ బైకులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతగా క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. దానిపై మనసు పడినా ధర ఆకాశాన్నంటుతుంది. అలాంటి బైకులను పెట్రోలింగ్ కోసం మన పోలీసులు ఉపయోగిస్తున్నారు. అవును. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం హర్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ 750 బైకులను కోల్‌కతా పోలీసుల కోసం కొనుగోలు చేసింది. ప్రస్తుతం కోల్‌కతా పోలీసు డిపార్ట్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను వాడుతున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన హర్లీ డేవిడ్ సన్ బైకులు, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు జత కలిశాయి. కోల్‌కతా పోలీసులకు కొత్త సాంకేతికతను అందించడంలో కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందే ఉంటోంది. ఈ నెల 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారి కోల్‌కతా పోలీసులు హర్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ 750 బైకులపై పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ బైకులను కొనుగోలు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెచ్చించిన మొత్తం చూస్తే కళ్లు తేలేయాల్సిందే. ఒక్కో బైక్‌కు రూ.5.5 లక్షల చొప్పున మమత ప్రభుత్వం హర్లీ డేవిడ్ సన్‌కు చెల్లించింది. మామూలుగా హర్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ 750 బైకు ధర రూ.4.9 లక్షలే. అయితే, పోలీసుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించి వీటిని తయారు చేయించారు. దాంతో ధర తడిసి మోపిడైంది. -
మందుబాబులకు పోలీసుల సూపర్ ఆఫర్
కోల్‌కతా(పశ్చిమబెంగాల్): బార్లలో అతిగా మద్యం తాగేవారిని సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు కోల్‌కతా పోలీసులు సరికొత్త ఆలోచన చేశారు. బార్లలో తాగిపడిపోయిన వారిని ఇంటికి చేర్చేందుకు అదనంగా వాహన డ్రైవర్లను అందుబాటులో ఉంచుకోవాలని కోల్‌కతా పోలీసులు ప్రముఖ బార్ల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అర్థరాత్రి దాకా పనిచేసేందుకు అనుమతివ్వాలని దాదాపు 30 వరకు ఉన్న బార్లు, క్లబ్బులు, రెస్టారెంట్ల యజమానులు దరఖాస్తు చేసుకోవటంతో శనివారం వారితో పోలీసు అధికారులు సమావేశమై ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బార్ల నిర్వాహకులు బ్రీత్ ఎనలైజర్లను కూడా దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఇంతేకాకుండా, బార్ల వద్ద మందుబాబులను తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచాలని.. ఇందుకోసం ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సంస్థలతో అవగాహన కుదుర్చుకోవాలని సూచించారు. ఈ ఉత్తర్వులను 15 రోజుల్లోగా అమలు చేయాలని, అలా చేయని బార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోల్‌కతా నగర పరిధిలో ఈ ఉత్తర్వులను ముందుగా అమలు చేసి, క్రమంగా మిగతా ప్రాంతాల్లోనూ అమలయ్యేలా చూస్తామని అదనపు పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ వెల్లడించారు. -
కోల్‌కతాలో ఇద్దరు తీవ్రవాద సభ్యుల అరెస్ట్
కోల్‌కతా: జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎమ్బీ) తీవ్రవాద సంస్థ సభ్యులు ఇద్దరిని కోల్‌కతా పోలీసులు (ఎన్ఐఎ ఎస్టీఎఫ్) బృందం గురువారం అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన ఇన్మౌల్ ముల్హా, హబీబుల్ హాక్వె అనే ఇద్దరు వ్యక్తులకు బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఎన్ఐఎ (జాతీయ దర్యాప్తు సంస్థ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్) జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా గతరాత్రి మెటిబ్రజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో దాడులు జరిపినట్టు తెలిపారు. 2014లో జరిగిన బురద్వాన్ బాంబు పేలుడు కేసులో వీరిద్దరికి సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో వీరి పాత్ర ఎంతవరకూ ఉందన్న దానిపై విచారించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కోల్‌కతాలో బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ పలువురిని సభ్యులుగా చేర్చుకున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని పోలీస్ అధికారి యూసఫ్ గెజి వెల్లడించారు. తాజాగా ఇద్దరి అరెస్ట్.. మిగతా తీవ్రవాద సభ్యులను పట్టుకోనేందుకు ఉపయోగపడుతుందని యూసఫ్ అభిప్రాయపడ్డారు. -
హిట్ అండ్ రన్ కేసులో మరొకరి అరెస్ట్
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కుమారుడు సాంబియా సోహ్రాబ్ స్నేహితుడు సోనూను కోల్ కతా పోలీసు విభాగానికి చెందిన ఎస్టీఎఫ్ అధికారులు ఆదివారం రాత్రి ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 13న సాంబియా, అతడి మిత్రులు ఆడీ కారుతో వైమానిక దళ అధికారి అభిమాన్యు గౌడ్(21) ఢీకొట్టి పారిపోయారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ లో పాల్గొన్న ఆ అధికారి ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి సాంబియాను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం అతడిని కోర్టులో హాజరుపరిచారు. అతడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ నెల 30 వరకు పోలీసు కస్టడీకి పంపింది. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో సాంబియా, అతడి స్నేహితులు మద్యం సేవించివున్నారని పోలీసులు గుర్తించారు. -
కోల్‌కతాలో ముగ్గురు ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్
కోల్‌కతా: పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులను ఆదివారం కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కంపెనీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న ఇర్షాద్ అన్సారి (51), అతని కొడుకు అస్ఫాక్ అన్సారి (23), బంధువు మహ్మద్ జహంగీర్‌లను దక్షిణ కోల్‌కతా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్టు సీనియర్ ఎస్టీఎఫ్ అధికారి చెప్పారు. నిందితుల నుంచి డాక్యుమెంట్లు, భారత నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇర్షాద్, జహంగీర్లు పదేళ్లుగా ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్టు ఎస్టీఎఫ్ అధికారి చెప్పారు. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్టు తెలిపారు. కాగా బీఏ రెండో సంవత్సరం చదువుతున్న అస్ఫాక్ పాత్రపై ఇంకా నిర్ధారించాల్సివుందని చెప్పారు. నిందితులు పలుమార్లు పాక్‌కు వెళ్లారని, అక్కడ ఐఎస్ఐ వారికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఐఎస్ఐలో వీరి పాత్ర గురించి విచారిస్తున్నట్టు ఎస్టీఎఫ్ అధికారి తెలిపారు.