మందుబాబులకు పోలీసుల సూపర్ ఆఫర్
కోల్‌కతా(పశ్చిమబెంగాల్): బార్లలో అతిగా మద్యం తాగేవారిని సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు కోల్‌కతా పోలీసులు సరికొత్త ఆలోచన చేశారు. బార్లలో తాగిపడిపోయిన వారిని ఇంటికి చేర్చేందుకు అదనంగా వాహన డ్రైవర్లను అందుబాటులో ఉంచుకోవాలని కోల్‌కతా పోలీసులు ప్రముఖ బార్ల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అర్థరాత్రి దాకా పనిచేసేందుకు అనుమతివ్వాలని దాదాపు 30 వరకు ఉన్న బార్లు, క్లబ్బులు, రెస్టారెంట్ల యజమానులు దరఖాస్తు చేసుకోవటంతో శనివారం వారితో పోలీసు అధికారులు సమావేశమై ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
బార్ల నిర్వాహకులు బ్రీత్ ఎనలైజర్లను కూడా దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఇంతేకాకుండా, బార్ల వద్ద మందుబాబులను తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచాలని.. ఇందుకోసం ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సంస్థలతో అవగాహన కుదుర్చుకోవాలని సూచించారు. ఈ ఉత్తర్వులను 15 రోజుల్లోగా అమలు చేయాలని, అలా చేయని బార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోల్‌కతా నగర పరిధిలో ఈ ఉత్తర్వులను ముందుగా అమలు చేసి, క్రమంగా మిగతా ప్రాంతాల్లోనూ అమలయ్యేలా చూస్తామని అదనపు పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ వెల్లడించారు.