
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్దఎత్తున నిసన తెలియజేస్తున్నారు. అయితే మరోవైపు.. హత్యాచార ఘటనప తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. తాజాగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు ఆదివారం ఇద్దరు ప్రముఖ వైద్యులు, సీనియర్ బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డాక్టర్ కునాల్ సర్కార్, డాక్టర్ సుబర్ణ గోస్వామి, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
హత్యాచారం కేసు దర్యాప్తు, పోస్ట్‌మార్టం నివేదికకు సంబంధించి డాక్టర్ సర్కార్, డాక్టర్ గోస్వామి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ సుబర్ణ గోస్వామి.. ఈ ఘటను సామూహిక అత్యాచారమని పేర్కొన్నారు. 150 మిల్లీగ్రాముల వీర్యం, శరీరంలో పలు ఎముకలు విరిగిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదిక తెలిజేస్తోందని ఆయన మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
హత్యాచార బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశారనే ఆరోపణలపై బీజేపీ మాజీ ఎంపీ, లాకెట్ ఛటర్జీపై కోల్‌కతా పోలీసులు ఆరోపణలు చేశారు. బాధితురాలి పేరు, చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు పోలీసులు ఆమెను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. పోలీసులు చేసిన నోటీసులపై లాకెట్ ఛటర్జీ స్పందించారు. ‘కోల్‌కతా పోలీసులు బాధితురాలికి న్యాయం చేయడం కంటే సోషల్ మీడియా పోస్ట్‌లను చూడటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’అని ఆరోపించారు.
ఇక.. ఇప్పటికే జూనియర్ డాక్టర్‌పై వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని కోల్‌కతా పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment