
కోల్‌కతా : పదవీవిరమణ చేసిన సీనియర్ పోలీస్ అధికారి బలవన్మరణానికి పాల్పడుతూ సూసైడ్ నోట్‌లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీదీ తనకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టడంతో పాటు గత ఏడాది డిసెంబర్ 31న పదవీవిరమణ అనంతరం రావాల్సిన బకాయిలను తొక్కిపెట్టారని 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గౌరవ దత్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
దత్ ఆత్మహత్యపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మౌనం దాల్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దత్‌పై క్రమశిక్షణా చర్యలు కొనసాగుతున్నందునే ఆయనను కంపల్సరీ వెయిటింగ్ జాబితాలో ఉంచారని, సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్టుగా ఎలాంటి బకాయిలు పెండింగ్‌లో లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, ఓ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ చరిత్రలో ఇదే తొలిసారని బీజేపీ నేత ముకుల్ రాయ్ మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.