
హిట్ అండ్ రన్ కేసులో మరొకరి అరెస్ట్
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కుమారుడు సాంబియా సోహ్రాబ్ స్నేహితుడు సోనూను కోల్ కతా పోలీసు విభాగానికి చెందిన ఎస్టీఎఫ్ అధికారులు ఆదివారం రాత్రి ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 13న సాంబియా, అతడి మిత్రులు ఆడీ కారుతో వైమానిక దళ అధికారి అభిమాన్యు గౌడ్(21) ఢీకొట్టి పారిపోయారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ లో పాల్గొన్న ఆ అధికారి ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి సాంబియాను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం అతడిని కోర్టులో హాజరుపరిచారు. అతడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ నెల 30 వరకు పోలీసు కస్టడీకి పంపింది. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో సాంబియా, అతడి స్నేహితులు మద్యం సేవించివున్నారని పోలీసులు గుర్తించారు.