మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత.. సమాచారం అందించి కోర్టు అనుమతితో పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులు అనుమతి కోరితే అనుమతించే అధికారం కోర్టుకు ఉందని స్ప ష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో నిందితుల వాదన వినాలన్న నిబంధన ఎక్కడా లేదని తేల్చిచెప్పింది. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
కారుపై స్టిక్కర్ ఆధారంగా మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా గుర్తించిన పోలీసులు.. ప్రమాద సమయంలో కారులో షకీల్ కొడుకు రాహిల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే అనూహ్యంగా కారు తానే నడిపాను అంటూ ఆఫ్నా న్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు ఈ కేసులో ఏ1గా ఉన్న రాహిల్‌ను ఏప్రిల్ 8న అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ కేసు తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటి షన్‌పై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. కింది కోర్టులో విచారణ ప్రక్రి య ప్రారంభించాక, సాక్షుల వాంగ్మూలం నమోదు దశలో దర్యాప్తునకు అనుమతించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయవాది వాదించారు. రాజకీయ కారణాలతోనే కేసును తిరగదోడుతున్నారన్నారు. కింది కోర్టు ఉత్తర్వులు చట్టబద్ధమేనని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. గతంలో దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందంటూ డీసీపీ ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారని వెల్లడించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. జూబ్లీహిల్స్ కేసులో విచారణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని అభిప్రాయపడ్డారు. కేసులో దర్యాప్తు కొనసాగించినంత మాత్రాన నిందితులకు ఇబ్బంది ఏం కాదంటూ చెప్పారు. రాహిల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు.
Comments
Please login to add a commentAdd a comment