
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా తనకు నివేదిక అందజేయాలని చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత్ విద్యుత్ పథకంలో అక్రమాలు జరిగాయని, ఇందులో లోపాలున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌కు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించాయి. ఈ పథకం వెనుక భారీ కుంభకోణం ఉందంటూ న్యాయవాద వర్గాల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నాయి.
ఉచిత విద్యుత్‌ను అడ్డుకొనే కుట్ర: కేజ్రీవాల్
తాము ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం పట్ల గుజరాత్ ప్రజలు ఆకర్శితులు అవుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అందుకే ఢిల్లీలో ఉచిత్ విద్యుత్‌కు అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గుజరాత్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరిట ప్రజల రక్తం పీల్చేస్తోందని, వారికి కొంత ఊరటనివ్వాలని తాము సంకల్పిస్తే బీజేపీ సహించలేకపోతోందని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయాన్ని అడ్డుకోవడానికి కేంద్ర సర్కారు కుతంత్రాలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. ఢిల్లీలో ఉచిత విద్యుత్ పథకంపై వస్తున్న ఆరోపణలను ఖండించింది.