ఐకేపీ ఉద్యోగుల వేతనాలు పెంపు
♦ ఉత్తర్వులు జారీ చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ
♦ ఎంసీసీలకు వందశాతం పెరిగిన జీతం
♦ మిగతా ఉద్యోగులకు 30శాతం పెరుగుదల
♦ జిల్లాలో 403 ఉద్యోగులకు లబ్ధి
♦ ఆగస్టు నుంచే పెరుగుదల అమలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇందిరా క్రాంతి పథం ఉద్యోగుల నిరీక్షణ ఫలించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలనే డిమాండును ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. వారి వేతనాలను పెంచుతూ గురువారం పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్ల వేతనాలను ఏకంగా రెట్టింపు చేసింది. ప్రస్తుతం వీరికి రూ.6,200 ఇస్తుండగా.. ఇకపై రూ.12,000 ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ఇతర కేటగిరీల్లో పనిచేస్తున్న జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్ తదితరులకు వారి బేసిక్ వేతనంపై 30శాతం పెంచుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ పెంపును ఆగస్టు నుంచే అమలు చేయనున్నట్లు వివరించింది. ఈక్రమంలో వచ్చేనెల వేతనం నుంచే పెరిగిన మొత్తాన్ని ఉద్యోగులు తీసుకోనున్నారు. దీంతో జిల్లాలో పనిచేస్తున్న 403 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం జిల్లాలోని ఐకేపీ ఉద్యోగులకు నెలవారీగా రూ.66.84లక్షలు వేతనాల రూపంలో అందిస్తున్నారు. తాజా పెరుగుదలతో జిల్లాపై రూ.20లక్షల భారం పడనుంది.
50శాతం పెంచాలన్నాం..
ఇందిరా క్రాంతిపథంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన పెంపు కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాం. అందరికీ 50శాతం పెంచాలని కోరాం. కానీ ఎంసీసీల వేతనాల్ని మెరుగ్గా పెంచినప్పటికీ.. మిగతా ఉద్యోగులకు బేసిక్‌పైన 30శాతం మాత్రమే పెంచారు. దీంతో ఇతర కేటగిరీల ఉద్యోగులు కొంత నిరుత్సాహంలోనే ఉన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో మరింత మెరుగ్గా వేతనాలు పెంచుతారని ఆశిస్తున్నా. ప్రస్తుత పెంపుపై ప్రభుత్వానికి కతజ్ఞతలు చెబుతున్నా. - సురేష్‌రెడ్డి, ఐకేపీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు