obligations
-
శ్రీ శారదాపీఠం... ఉత్తరపథం
ఆదిశంకరుల మార్గాన్ని అనుసరిస్తూ అద్వైతసిద్ధాంత ప్రచారకులుగా మన నేల మీద నడయాడిన మహోపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వారిలో అగ్రేసరునిగా చెప్పదగ్గవారు జగద్గురు శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతీ మహాస్వామి. వారు శంకరాద్వైతానికి ప్రతీక. ఆ కోవలో చేరేవారే విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి. సచ్చిదానందేంద్రస్వామి నిరూపించిన నిర్గుణ బ్రహ్మవాదాన్ని పుణికి పుచ్చుకుని స్వరూపానందేంద్ర ధర్మపరిరక్షకులుగా నేటి భారతాన దర్శనమిస్తున్నారు.సనాతన ధర్మ పరిరక్షణమే సమాజానికి ఆవశ్యకమని చాటి చెబుతున్నారు. ధర్మపోరాటాలు చేపడుతున్నారు. అలాంటి స్వరూపానందేంద్రులవారు 1990 దశకంలో విశాఖపట్నంలోని పెందుర్తి సమీపాన చినముషిడివాడ గ్రామంలో వేదోక్తంగా నెలకొల్పిన శారదా పీఠం దినదిన ప్రవర్థమానమవుతూ ఎందరికో మార్గనిర్దేశం చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన శ్రీ విశాఖ శ్రీశారదాపీఠ వైభవం రాబోయే తరాల్లోనూ వెల్లివిరియాలన్న లక్ష్యంతో స్వరూపానందేంద్ర స్వామి పీఠం భావి బాధ్యతలను ఇరవై ఆరేళ్ల బ్రహ్మచారి కిరణ్ కుమారశర్మకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. కుమారశర్మకు శిష్యతురీయాశ్రమ దీక్షను స్వయంగా తానే ప్రదానం చేయదలిచారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో వేదవేద్యుల సన్నిధిలో ఆహితాగ్ని సాక్షిగా కిరణ్‌కుమారశర్మ సన్యాసాశ్రమ స్వీకరణ ఉత్సవం ఘనంగా జరిగేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాసం... భారతీయ ధర్మపీఠాలు నిత్యం ప్రవహించే జీవనదులు. జనబాహుళ్యంలో చేతన నింపగల దివ్యధామాలు. ప్రజాళిని మంచి మార్గాన నడిపించే భక్తి సదనాలు. ఆదిశంకరాచార్యుని మొదలు ఇప్పటి మహాస్వాముల వరకూ ఎందరెందరో స్వధర్మ సంరక్షణకు పాటుపడుతున్నారు. శ్రుతి, స్మృతి పురాణాలను మరింతగా సమన్వయం చేస్తున్నారు. ప్రకరణ గ్రంథాల సాయంతో జీవితసత్యాలను వెల్లడి చేస్తున్నారు. పరబ్రహ్మతత్వాన్ని ఎరుకపరుస్తున్నారు. ఇలాంటి మహనీయుల పరంపర ఆగిపోకూడదు. వీరు నిర్వహించే పీఠాలు నిత్యమై శాశ్వతమై ధర్మప్రచారాన్ని నిర్వహిస్తూనే ఉండాలి. ఈ యోచనతోనే భారతీయ ధర్మకేంద్రాల అధిపతులు తమ ఉత్తరాధికారిగా ఒకానొక శిష్యుణ్ణి ఎంపిక చేసుకుంటారు. భావి మహాస్వామిగా ఆ బాలసన్యాసిని ప్రకటిస్తారు. శంకరభగవత్పాదులు ప్రారంభించిన పూరీ, శృంగేరీ, ద్వారక, జ్యోతిర్మఠాలు సహా వివిధ సంప్రదాయ పీఠాలెన్నో పరంపరానుగతంగా ఈ సరళిలోనే ముందుకు సాగుతున్నాయి. అజరామరమై విరాజిల్లుతున్నాయి. ఈ ధర్మపీఠాలకు నియుక్తులైన ఉత్తరాధికారులు భవిష్యత్తులో జగద్గురు స్థానాన్ని చేపట్టవలసి ఉంటుంది. జాతికి నీతిని నేర్పవలసి ఉంటుంది. సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడవలసి ఉంటుంది. శంకర పదం.. స్వరూప పథం.. తురీయాశ్రమ ధర్మాన్ని భారతీయ ఉపనిషద్సారం విడమరిచి చెప్పింది. మానవజన్మకు సంబంధించిన జాగృత, స్వప్న, సుషుప్తావస్థలను దాటి నాలుగవదశకు చేరిన చతుర్థశ్రేణి అశ్రమమే తురీయాశ్రమ సన్యాసం. సర్వసంగాలను తెంచుకుని బ్రహ్మజ్ఞానాన్ని అనుసరిస్తూ సన్యాసి తన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ఇలాంటి సన్యాసాశ్రమం స్వీకరించడానికి ధర్మనిష్ఠతో పాటు, స్వీయ ఆత్మను తెలుసుకోవడం పునాది అవుతుంది. శారదా పీఠం ఉత్తరాధికారిగా నియమితులవుతున్న కిరణ్‌కుమారశర్మ ఈ విషయంలో పూజనీయులు. వేదవిద్యను ఆకళింపు చేసుకున్న వేత్తలు. కనక దుర్గమ్మ సాక్షిగా.. కనకదుర్గమ్మ పాదాలచెంత ఈ ఉత్తరాధికార నియామకాన్ని ఒక మహత్కార్యంగా జరిపించాలని స్వరూపానందేంద్ర తలపోశారు. విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమం జయదుర్గా తీర్థాన్ని ఇందుకు వేదికగా శ్రీ చరణులు ఖరారు చేశారు. జూన్ 15, 16, 17 తేదీల్లో వేదవేద్యుల సన్నిధిలో ఆహితాగ్ని సాక్షిగా కిరణ్‌కుమారశర్మ సన్యాసాశ్రమ స్వీకరణ ఉత్సవం ఘనంగా జరిగేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా వేదవిహితమైన అగ్నికార్యాలు ఏర్పాటవుతున్నాయి. సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, షోడశమహాదానాలు నిర్వహిస్తారు. శాస్త్ర వాక్యార్థ సభలు సాకారమవుతాయి. వైశ్వానర స్థాలీపాకం, విరజా హోమాలూ భక్తి శ్రద్ధలతో కొనసాగుతాయి. ప్రాచీన, నవీన గురువందనాలు సభక్తికంగా వీటికి జతపడతాయి. బాలస్వామికి యోగపట్టాను శ్రీ చరణులు అనుగ్రహిస్తారు. ఈ మహత్కార్యంలో భాగం పంచుకునేందుకు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాలనుంచీ భక్తకోటి తరలిరానుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖరరావు, వై.ఎస్. జగన్మోహనరెడ్డి తదితర పెద్దల సమక్షంలో కార్యక్రమం జరుగుతుంది. భక్తి ఉద్యమసారధి బాలస్వామి.. శ్రీశారదా పీఠం ఉత్తరాధికారిగా నియమితులయ్యే కిరణ్‌కుమారశర్మ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం. 1993 ఏప్రిల్ 4 విశాఖలో జన్మించారు. తల్లిదండ్రులు పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ. వీరిది మధ్యతరగతి కుటుంబం. హనుమంతరావు ఇద్దరు పిల్లలలో పెద్దవాడు కిరణ్‌కుమారశర్మ మూడవ తరగతి చదువుతుండగా యాదృచ్ఛికంగా తల్లిదండ్రులతో కలిసి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామిని దర్శించే భాగ్యం కలిగింది. బాలకిరణుడు మహాస్వామి కంటికి అపరశంకరునిగా గోచరించారు. అద్భుత ముఖవర్ఛస్సుతో, బ్రహ్మజ్ఞాన సముపార్జనార్హతతో కళకళలాడుతూ పిల్లవాడు కనిపించడం స్వామివారిని విశేషంగా ఆకర్షించింది.వెనువెంటనే తల్లిదండ్రులతో మాట్లాడారు. లౌకికవిద్యకు స్వస్తి పలికించి పిల్లవాణ్ణి పీఠానికి చేర్చమని సూచించారు. పీఠానికి వచ్చిన నాటినుంచీ కిరణ్‌కుమారశర్మ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆంగ్ల విద్య మలిగిపోయింది. అంతఃచక్షువులకు సంబంధించిన వేదాధ్యయనం మొదలైంది. సంధ్యావందనంతో ప్రారంభమైన చదువు షోడశకర్మలు, పంచదశ కర్మలూ దాటింది. స్మార్తం హృదయగతమైంది. ద్వాదశి విశ్వనాథం, ఉప్పులూరి సంతోష్కుమార్శర్మల గురుత్వంలో కుమారశర్మ రాటుదేలుతూ వచ్చారు. రాణి దక్షిణామూర్తిగారి వద్ద ఉపనిషత్తులు, కారికలు, అరుణం పూర్తి చేశారు. దక్షిణామూర్తి, గిరీశశర్మ అధ్యాపకత్వంలో కృష్ణయజుర్వేదాన్ని అస్థిగతం చేసుకున్నారు. వ్యావహారిక సంస్కృతగ్రామంగా ప్రపంచంలోనే ప్రసిద్ధమైన కన్నడసీమలోని మత్తూరు వాస్తవ్యులు అరుణావధాని, బోధనలో మెళకువలు తెలిసిన ఇరుకు విద్యాసాగరశర్మ వంటి గురువుల నుంచి సంస్కృతం నేర్చుకున్నారు. శ్రీ చరణుల వద్దనే కిరణ్‌కుమార శర్మ తర్క, సాంఖ్య, యోగ, వేదాంత, మీమాంసలతో పాటుగా వేదాంగాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేశారు. మహాస్వామి ప్రధాన శిష్యునిగా మారిపోయారు. బాలస్వామిగా ప్రఖ్యాతమయ్యారు. రామేశ్వరం నుంచీ హిమాలయాలవరకూ స్వరూపానందేంద్రతో కలిసి విశేష పర్యటనలు జరిపారు. ఆ రకంగా మహాస్వామి అడుగులలో అడుగులు కదుపుతూ శిష్య తురీయాశ్రమ సన్యాస దీక్షా స్వీకరణకు సిద్ధమయ్యారు.విశ్వజనీనమైన స్వధర్మాన్ని రానున్న కాలాన బాలస్వామి కుమారశర్మ మునుముందుకు నడిపిస్తారనేదే భక్తజనుల ఆశ. ఆకాంక్ష. – డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు బాలస్వామి యోగ్యుడు అదిశంకరుడు, సచ్చిదానందేంద్రుడు, అద్వైతానందేంద్రుడు వీరి పరంపరగా శారదా పీఠం నడుస్తూ వస్తోంది. దీనికి ఉత్తరాధికారిగా కిరణ్‌కుమారశర్మ వ్యవహరించబోతున్నారు. వీరి సన్యాసనామం వేరుగా ఉంటుంది. దానిని శిష్యతురీయాశ్రమదీక్ష స్వీకార సమయంలో వెల్లడి చేస్తాం. కిరణ్‌కుమార శర్మ యోగ్యులు. వేదవేదాంగాలు చదువుకున్నవారు. వారి నేతృత్వంలో శ్రీ శారదా పీఠం మరిన్ని సత్కార్యాలు చేయనుంది. – స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పూర్వజన్మ సుకృతం బంగారం లాంటి మా అబ్బాయిని స్వరూపానందేంద్ర స్వామివారే మేలిమి బంగారంలా తయారు చేశారు. ధర్మ పరిరక్షణకోసం వినియోగిస్తున్నారు. ఇంతకంటే ఏ తల్లిదండ్రులకయినా కావలసింది ఏముంటుంది. అందుకే విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాబు నియమితులవుతున్నారని తెలిసి సంతోషించాం. కిరణ్‌కుమారశర్మ ఇంతవరకూ మా అబ్బాయి. ఇప్పుడు జగద్గురువు స్థానానికి చేరారు. ఇది మా పూర్వజన్మ సుకృతం. – పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ, కిరణ్‌కుమారశర్మ తల్లిదండ్రులు స్వామి అడుగుజాడల్లో... విశాఖ శ్రీ శారదాపీఠం విలక్షణమైనది. బాధ్యతాయుతమైనది. ఆదిశంకరాచార్యుల వారందించిన చైతన్యంతో నడుస్తోంది. శ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి అడుగుజాడల్లో నడిచి మరిన్ని ధర్మపోరాటాలు చేయాలనేది నా ఆకాంక్ష. వారి సూచనలు పాటిస్తూ ధర్మప్రచారం కోసం అహరహమూ శ్రమిస్తాను. సర్వశక్తులూ ఒడ్డుతాను. – కిరణ్‌కుమారశర్మ, శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి -
నిర్మల ముందున్న అసలు పరీక్ష అదే..!
నిరాడంబరతే నిర్మల ఆభరణం.నిజాయితీ, ముక్కుసూటితనమే భూషణాలు.సూటిగా... స్పష్టంగా ఉంటారామె.బాధ్యతలతోనే ఆమె బంధుత్వం.నిన్న రక్షణ శాఖ.. నేడు ఆర్థిక శాఖ. ఉగ్రదాడుల నుంచి దేశాన్ని రక్షించారు.ఇప్పుడు దేశపద్దులను లోటుపాట్ల నుంచిరక్షించే బాధ్యత చేపట్టారు. నిర్మలా సీతారామన్.. మన దేశ కొత్త ఆర్థిక మంత్రి. ఇందిరా గాంధీ తర్వాత ఆ బాధ్యతలు స్వీకరించిన మహిళ. అప్పట్లో ఇందిరాగాంధీకి ఆర్థికశాఖ అదనపు బాధ్యతగా ఉండేది. పూర్తిస్థాయిలో ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న తొలి మహిళ నిర్మలాసీతారామన్. గత ప్రభుత్వంలో నిర్మల రక్షణ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అది కూడా రికార్డే. రక్షణ శాఖను నిర్వహించిన తొలి మహిళ ఇందిర కాగా రెండవ మహిళ నిర్మల. అంత పెద్ద బాధ్యతలను ఒక మహిళ సమర్థంగా నిర్వహించడం అంటే.. దేశానికే కాదు, మన తెలుగు వాళ్లకు కూడా గర్వించదగిన విషయం.. విజయం. ఢిల్లీ స్టూడెంట్ నిర్మలా సీతారామన్‌కు ఆవకాయ అంటే ఎంతిష్టమో, అత్తగారన్నా అంతే ఇష్టం. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఆమె అత్తగారిల్లు. అత్త కాళికాంబ మాజీ ఎమ్మెల్యే. మామ శేషావతారం మాజీ మంత్రి. అత్తగారి పర్యవేక్షణలో నిర్మల ఆవకాయ కలుపుతున్న ఫొటో ఒకటి అప్పట్లో వాట్సాప్‌లో ప్రాచుర్యం పొందింది. ఆమె రక్షణమంత్రి అయిన తర్వాత నిర్మల నిరాడంబరతకు చిహ్నంగా, ఆ ఫొటోను ఎంతో ఇష్టంగా షేర్ చేసుకున్నారు తెలుగు వాళ్లు. అత్యంత సాధారణ గృహిణి లాగ ఆమె భర్తతో పాటు మోటార్‌సైకిల్ మీద నర్సాపురంలో మార్కెట్‌కెళ్లి కూరగాయలు తెచ్చుకునేవారని స్థానికులు చెబుతారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పుట్టిన నిర్మల స్కూల్ ఎడ్యుకేషన్ చెన్నైలో సాగింది. బిఏ పట్టా అందుకున్న తర్వాత ఆమె ఎకనమిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ... నిర్మల చేతిలో పీజీ పట్టాతోపాటు ప్రభాకర్ చేతిని కూడా పెట్టింది. పరకాల ప్రభాకర్ కూడా జెఎన్‌యూలోనే పీజీ, ఎంఫిల్ చేశారు. వాళ్ల పెళ్లి 1986లో జరిగింది. లండన్ లైఫ్ నిర్మలాసీతారామన్, పరకాల దంపతులు పెళ్లి తర్వాత లండన్ వెళ్లారు. అక్కడి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ప్రభాకర్ పీహెచ్డీ చేశారు. నిర్మల యూకేలోని అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్‌లో అసిస్టెంట్ ఎకనమిస్ట్‌గా, ప్రైస్ వాటర్ హౌస్ అనే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌లో సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగాలు చేశారు. లండన్ వెళ్లడానికి ముందు ఆమె ఇండో– యూరోపియన్ టెక్స్టైల్ ట్రేడ్ అంశంలో పీహెచ్డీ కూడా మొదలుపెట్టారు. వాళ్లకో అమ్మాయి, పేరు వాజ్ఞ్మయి. బీజేపీలో చేరిక హైదరాబాద్‌లో ఉన్నప్పుడు నిర్మల ఆర్ఎస్ఎస్ నిర్వహించే సేవికా సమితి కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఆమె తొలి నుంచి సొంత అభిప్రాయాల మీదే ఉండేవారు. ఆమె పుట్టిల్లు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. తండ్రి రైల్వే ఉద్యోగి. అలాంటి పరిస్థితుల్లో మహిళను అత్తగారిల్లు ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువ. అయితే కాంగ్రెస్ నేపధ్యం కలిగిన అత్తగారింటి వారితో కలిసిపోతూనే తన అభిప్రాయాలను నిలబెట్టుకున్నారామె. తన పేరులో తండ్రి పేరును కూడా కొనసాగించారు. తన ఉనికి తానే అయ్యారు తప్ప అత్తగారింటి కోడలిగా మిగిలిపోలేదు. వాళ్లమ్మాయి వాజ్ఞ్మయి ‘లా’ కోర్సు కోసం నిర్మల కూడా ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో నిర్మల టీవీ చర్చావేదికల్లో చురుగ్గా పాల్గొనడం బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ దృష్టిని ఆకర్షించింది. బీజేపీ లో చేరిన తర్వాత కొద్దికాలానికే నిర్మల అధికార ప్రతినిధి అయ్యారు. అంత కీలకమైన బాధ్యతలు చేపట్టగలగడానికి కారణం కేవలం ఆమె ప్రతిభ మాత్రమే. ఆమెలోని ప్రతిభతోపాటు ముక్కుసూటితనం, కచ్చితత్వమే బీజేపీ నిర్మలను అక్కున చేర్చుకోవడానికి గీటురాళ్లయ్యాయి. ఆ పార్టీ అభ్యర్థిగా 2010లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు నిర్మల. ఆ సభ్యత్వకాలం ముగిసిన తర్వాత 2016లో కర్నాటక నుంచి మళ్లీ ఎన్నికయ్యారామె. ప్రస్తుతం అదే హోదాలో కొనసాగుతూ కేంద్ర ఆర్థికమంత్రిగా కీలకమైన బాధ్యతలను చేపట్టారు. అంతకంటే ముందు వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్ ఉమెన్ కమిషన్ మెంబరుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో మోదీ తొలి ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. తర్వాత మూడేళ్లకే రక్షణ మంత్రిగా మరింత కీలకమైన బాధ్యతలను స్వీకరించారామె. విధి నిర్వహణలో మొహమాటం లేకపోవడం, ఎవరి ఒత్తిడికీ తలొగ్గకపోవడం, బంధుప్రీతి చూపించకపోవడం ఆమెకు పెట్టని ఆభరణాలయ్యాయి. పాలన కార్యకలాపాల్లో బంధువులెవరినీ ప్రోత్సహించలేదామె. వాణిజ్యం నుంచి రక్షణ రంగానికి, ఆ తర్వాత ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టడానికి అవన్నీ సోపానాలే అయ్యాయి. అబద్ధాలను సహించరు నిర్మల కచ్చితంగా ఉంటారని ఆమె వాణిజ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పేరు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయం. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుడు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి వచ్చారామె. ఒంగోలులో జరిగిన రైతుల బహిరంగ సభలో స్థానిక ప్రతినిధులు ప్రసంగిస్తున్నారు. రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురావడంతోపాటు ప్రభుత్వం నుంచి అందబోయే ప్రోత్సాహకాలను రైతులకు వివరిస్తున్నారు వాళ్లు.అలవి గాని హామీలతో సాగుతున్న ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకుంటూ నిర్మలాసీతారామన్ మైక్ తీసుకుని ‘‘మీరు ఇప్పుడు చెప్తున్న ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తోందని మీకెవరు చెప్పారు? అవాస్తవాలతో మభ్యపెట్టకండి. రైతుల కోసం ప్రభుత్వం ఏమేం చేయగలుగుతుందో నేనే వివరిస్తాను’’ అంటూ ఆమె ప్రసంగించారు. అలాగే మంత్రి వస్తున్నారని హడావిడి చేయడాన్ని కూడా ఆమె ఇష్టపడేవారు కాదు. ప్రొటోకాల్ పట్టింపులు కూడా ఉండవు. పర్యటనకు వచ్చినప్పుడు అధికారిక వాహనం ఉన్నప్పటికీ అభిమానులతో కలిసి వారి కారులో ప్రయాణించిన సందర్భాలున్నాయి. ‘ఆమెలో ముక్కు మీద కోపాన్నే చూస్తారు కానీ, ఆమె ఏ విషయంలోనైనా సూటిగా వ్యవహరిస్తారు కాబట్టి అనవసరమైన లౌక్యాలను, సాగదీతలను ఇష్టపడరు. మొదట వ్యతిరేకించిన విషయాన్నయినా సరే పూర్తిగా వివరించి, అవసరాన్ని తెలియచేసిన తర్వాత అంగీకరిస్తారు. తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి మొహమాటపడరు కూడా’’ అని ఆమెను దగ్గరగా చూసిన వాళ్లు చెబుతుంటారు. ఆమెకు ఇష్టమైన హాబీలు కొత్త ప్రదేశాలకు వెళ్లడం, సాహసోపేతంగా ట్రెకింగ్ చేయడం. రుచిగా వండడం, మంచి సంగీతం వినడం. అరవయ్యవ ఏట కూడా చురుగ్గా ఉండవచ్చనడానికి ప్రతీక నిర్మల. సమయానికి తగిన శాఖ ఆర్థిక శాఖను చేపట్టిన వెంటనే నిర్మల ముందు నిలిచిన తొలి సవాల్ బడ్జెట్. జూలై ఐదో తేదీ ఎంతో దూరం లేదు. ఈలోపు రూపాయి రాక, రూపాయి పోక లెక్కలన్నీ సిద్ధం చేయాలి. అసలే మోదీ తొలి ప్రభుత్వం డీ మానిటైజేషన్, జీఎస్టీ ప్రయోగాలతో ఆర్థిక వ్యవస్థ కొంత ఒడిదొడుకులను లోనయి ఉంది. వాటన్నింటినీ సమం చేయగలిగిన బడ్జెట్ తయారు చేయడం ఇప్పుడు నిర్మలాసీతారామన్ ముందున్న పరీక్ష. కచ్చితంగా ఉండే వాళ్ల లెక్క ఎప్పుడూ పక్కాగానే ఉంటుంది. – వాకా మంజులారెడ్డి సైనికుడి కుటుంబంతో... గత ఏడాది జూన్ నెల. రంజాన్ మాసం కూడా. భారత సైన్యంలోని ఒక సిపాయి ఔరంగజేబు పండగకి ఇంటికి వెళ్లడానికి పై అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాడు. ‘సెలవు దొరికింది ఇంటికి వస్తున్నాన’ని ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చాడు. అన్నట్లుగానే తన ఊరికి బయలుదేరాడు, కానీ అతడు ఇల్లు చేరనేలేదు. దారి మధ్యలో అతడిని హిజబుల్ ముజాహిదీన్ తీవ్రవాదులు అపహరించుకుపోయారు. అతడి దేహం బుల్లెట్ గాయాలతో కశ్మీర్ రాష్ట్రం, పుల్వామా జిల్లాలో కలంపురాకు పదికిలోమీటర్ల దూరాన దొరికింది. ఇంటికి చేరింది ప్రాణం లేని దేహం మాత్రమే. ఔరంగజేబు పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. అప్పుడు ఔరంగజేబు తండ్రి మహమ్మద్ హనీఫ్ అన్న మాటలు యావద్దేశాన్నీ కదిలించి వేశాయి. ‘‘నా కొడుకు దేశం కోసం ప్రాణాలు వదిలిన ధీరుడైన సైనికుడు. ఇప్పుడు నేను, నా రెండో కొడుకు కూడా దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఘటనకు పాల్పడిన వాళ్లకు బుద్ధి చెప్పాలి. కశ్మీర్ మాది. కశ్మీర్ మండిపోతుంటే చూస్తూ ఊరుకోం’’ అన్నారాయన ఆవేశంగా. ఔరంగజేబు మాత్రమే కాదు అతడి తండ్రి హనీఫ్ కూడా సైన్యంలో పనిచేశారు, అతడి సోదరుడు కూడా సైన్యంలో ఉన్నారు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ ‘‘ఈ ఇంటి వాళ్లకు ధైర్యం చెప్పాలని వచ్చాను. కానీ వాళ్ల మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి. గొప్ప దేశభక్తి పరుల కుటుంబం’’ అన్నారామె ఉద్వేగంగా. అలాగే రఫెల్ వివాదం పార్లమెంట్‌ను కుదిపేసిన సందర్భంలో రక్షణ మంత్రి హోదాలో పాయింట్–టు–పాయింట్ వివరిస్తూ ఆమె చేసిన ప్రసంగం విమర్శకులను సైతం మెప్పించింది. ఉలవపాడు మామిడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడి కాయలకు ప్రసిద్ధి. అక్కడ కాసిన మామిడి కాయలు రుచికి ప్రసిద్ధి. బీజేపీ అభిమానులు ఢిల్లీకి మామిడి కాయలు పంపించాలంటే నిర్మలా సీతారామన్‌కి పంపించేవారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అభిమానం అంటూ ఆమె ఆ పండ్లను ఢిల్లీలోని పెద్ద నాయకులకు పంచేవారు. అలా ఉలవపాడు మామిడి పండ్లను రుచి చూసిన వాళ్లలో వాజ్‌పేయి, అద్వానీ, అరుణ్‌జైట్లీ కూడా ఉన్నారు. అలాగే పండ్లను తీసుకెళ్లిన యువకులను నాలుగైదు రోజులపాటు ఇంట్లో ఉంచి, ఢిల్లీ అంతా తిప్పి చూపించే ఏర్పాట్లు కూడా చేసేవారామె. -
రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా, నూతన నేవీ చీఫ్ కరంబీర్ సింగ్‌లతో రైసినా హిల్స్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, త్రివిధ దళాల పనితీరుపై వేర్వేరు నివేదికలు సిద్ధం చేయాలని వారికి సూచించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, రక్షణ కార్యదర్శి సంజయ్ మిత్రా, సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్రివిధ దళాల్లో సుదీర్ఘకాలంగా సుప్తావస్థలో ఉన్న ఆధునీకరణను వేగవంతం చేయడంతో పాటు వారి పోరాట సంసిద్ధతకు భరోసా ఇవ్వడం, అలాగే చైనాతో సరిహద్దు వద్ద శాంతి నెలకొల్పటం, చైనా నుంచి వచ్చే ఎలాంటి వ్యతిరేకతనైనా ఎదుర్కోడానికి అవసరమైన సైనిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటివి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ముందున్న అత్యంత కీలక సవాళ్లు. -
సర్పంచ్‌లకు ‘సవాళ్లే’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, పాలకవర్గాలకు కొత్త సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. అధికారాలతోపాటు బాధ్యతలు కూడా పెరగడంతో, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి కొత్త చట్టం కత్తి మీద సాములా మారే ప్రమాదముంది. గతంలో సర్పంచ్‌లకు అధికారాలే తప్ప విధులు, బాధ్యతలు పెద్దగా ఉండేవి కావు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా అనేక లక్ష్యాలు నిర్దేశించారు. నిర్దేశించిన బాధ్యతలు సరిగా నిర్వహించకపోయినా, కేటాయించిన నిధులను సవ్యంగా ఖర్చుచేయకపోయినా సర్పంచ్ల తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దుచేసే అవకాశాన్ని నూతన చట్టంలో కల్పించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను పంచాయతీ పాలకవర్గాలు రూపొందించుకుని తదనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. సర్పంచ్‌లు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ఈ చట్టంలో కట్టుదిట్టమైన నియమాలు రూపొందించారు. సవాళ్లు ఎన్నో... కొత్త చట్టంలో సర్పంచ్‌లకు పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారాలతో పాటు, ఉప సర్పంచ్‌లకు కూడా చెక్ పవర్‌ను కట్టబెట్టారు. గ్రామాల పురోగతికోసం, వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సర్పంచ్‌లకు బాధ్యతలతో పాటు వార్డుమెంబర్లను కూడా ఇందులో భాగస్వాములను చేశారు. పచ్చదనాన్ని పరిరక్షించడం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటివి ప్రధాన బాధ్యతలుగా నిలుస్తాయి. మొక్కల పెంపకం.. పారిశుధ్యం ప్రతి గ్రామంలో మొక్కల పంపిణీకోసం నర్సరీ ఏర్పాటుతో పాటు ఊళ్లోని ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూసే బాధ్యత కూడా గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌దే. ప్రతి రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించి సమస్యలపై చర్చించాల్సి ఉంటుంది. మూడు పర్యాయాలు వరసగా గ్రామసభల నిర్వహణలో విఫలమైతే సర్పంచ్‌లను బాధ్యతల నుంచి తొలగించే వీలు కల్పించారు. గ్రామ పాలకవర్గాలు ప్రతినెలా సమావేశమై అభివృద్ధి, తదితర కార్యక్రమాలను సమీక్షించాల్సి ఉంటుంది. గ్రామాల్లో, ఇళ్ల పరిసరాల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్తా చెదారం పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇంటి ముందు చెత్తవేస్తే ఆ ఇంటి యజమానికి రూ.ఐదువందలు జరిమానా విధించే అధికారాన్ని కల్పించారు. దీనికి అనుగుణంగా సర్పంచ్ ఆధ్వర్యంలో పాలకవర్గం జరిమానా విధింపునకు నిర్ణయం తీసుకుంటే గ్రామ కార్యదర్శి ఆ మొత్తాన్ని వసూలు చేస్తారు. మురుగునీరు రోడ్డు మీదకు వదిలితే రూ.ఐదువేలు జరిమానా విధిస్తారు. గ్రామంలోని ఒక్కో కుటుంబం ఆరు మొక్కలు నాటాలని నిర్దేశించగా, అందుల్లో కనీసం మూడింటినైనా వారు నాటేలా చర్యలు తీసుకోవాలి. హరితహారంలో ఇచ్చిన మొక్కలను పెంచకపోతే ఇంటి యజమాని నుంచి రెండింతలు ఆస్తిపన్నును జరిమానాగా వసూలుచేసే అవకాశం కల్పించారు. గ్రామ సర్పంచ్‌తోపాటు గ్రామకార్యదర్శి కూడా సంబంధిత గ్రామంలోనే నివాసముండాలి. సర్పంచ్, ఉపసర్పంచ్‌లను తొలగించినా, పాలకవర్గాలను రద్దు చేసినా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం కల్పించారు. పంచాయతీ పరిధిలోని వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు నూతన చట్టంలో వీలు కల్పించారు. స్టాండింగ్ కమిటీల ఏర్పాటు... నూతన చట్టం ప్రకారం ప్రతి పంచాయతీలో మొక్కలు నాటడం, వాటి పరిరక్షణకు హరితహారం కమిటీ, అభివృద్ధి పనులపై ఒక కమిటీ, వీధిదీపాల నిర్వహణకు మరో కమిటీ, డంపింగ్‌యార్డు, పారిశుధ్యం, శ్మశానాల నిర్వహణతో కలిపి మొత్తం నాలుగు స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలకు నలుగురు వార్డుమెంబర్లను చైర్మన్లుగా, మిగతా వార్డు సభ్యులతోపాటు గ్రామాల్లో ఉత్సాహంగా పనిచేసే యువత, మహిళా సంఘాల సభ్యులను కూడా భాగస్వాములను చేస్తారు. అక్రమ లేఔట్ల మీదా చర్యలు.. ఒకవేళ పంచాయతీలు అక్రమ లేఔట్లకు అనుమతిస్తే మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. అక్రమ నిర్మాణాల విషయంలోనూ ఇదే రీతిలో కఠిన చర్యలుంటాయి. పంచాయతీలు మూడు వందల మీటర్ల స్థలంలో, పది మీటర్ల ఎత్తు మించకుండా జీ ప్లస్ టు భవనాల నిర్మాణాల వరకే అనుమతినివ్వాలి. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని సర్పంచ్, స్థానిక కార్యదర్శి భరించాల్సి ఉంటుంది. -
కొత్త సీఎస్ ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్పీ సింగ్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన స్థానంలో ఎస్కే జోషిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగో సీఎస్‌గా జోషి నియమితులయ్యారు. సికింద్రాబాద్‌లోనే ‘రైల్వే’శిక్షణ 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జోషి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు. 1959 జనవరి 20న జన్మించిన ఆయన రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. సివిల్స్‌కు ఎంపిక కాకముందు ఎనిమిది నెలలపాటు రైల్వేలో పని చేశారు. సికింద్రాబాద్‌లోనే శిక్షణ పొందారు. అప్పట్నుంచే తెలంగాణతో ఆయనకు అనుబంధం ఉంది. జోషి సివిల్ సర్వీసెస్ అధికారిగా మొదట నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత తెనాలి, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఐటీ, నీటిపారుదల, ఇంధన శాఖ, రెవెన్యూ, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల కార్యదర్శి, ముఖ్యకార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచీ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో రెండు దఫాలుగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. జర్మనీ, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో మన దేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌బౌండరీ వాటర్ రీసోర్సెస్ అనే పుస్తకాన్ని రచించారు. మధ్యాహ్నమే బాధ్యతలు కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి బుధవారం మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం చంద్ర గ్రహణం మొదలవటంతో అంతకుముందే 3 గంటల సమయంలో బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని సమత బ్లాక్‌లో సీఎస్ ఎస్పీ సింగ్ తన బాధ్యతలను జోషికి అప్పగించారు. ఈ సందర్భంగా జోషి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు జోషికి అభినందనలు తెలిపారు. సీ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో పాత సీఎస్ ఎస్పీ సింగ్‌కు వీడ్కోలు పలికారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో మంచి పేరు తెలంగాణ ఏర్పడినప్పట్నుంచీ జోషి అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ మొదలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టాలెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే నీటి పారుదల శాఖ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను సైతం ఆయనకే అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్ అధీనంలో ఉన్న సీసీఎల్ఏ అదనపు బాధ్యతలను రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి అప్పగించారు. సీఎం కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పంచాయతీరాజ్ గ్రామీణ నీటిసరఫరా విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
దుర్గగుడి ఈవోగా వైవీ అనూరాధ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ ఆదివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి చేరుకున్న వైవీ అనూరాధకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం ఆమె రాజగోపురం ఎదురుగా ఉన్న వీఐపీ లాంజ్‌లో ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్‌పై సంతకాలు చేశారు. బ్రాహ్మణవీధిలోని ఇంద్రకీలాద్రి పరిపాలనా భవనానికి చేరుకున్నారు. -
వేధింపులపై కేసు నమోదు
పామిడి : వితంతువు మంజులను వేధించిన కేసులో ఆమె అత్తింటివారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పావగడకు చెందిన మంజులను పామిడి టీచర్స్ కాలనీకి చెందిన మారుతీ ప్రసాద్‌తో వివాహమైంది. మారుతీప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. తమ ఆస్తి తన కోడలికి చెందకూడదన్న ఉద్దేశంతో అత్త నాగరత్నమ్మ, ఆడపడుచు లలిత, మామ ఆదినారాయణ, మంజులను తరచూ వేధించేవారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వేధింపుల కేసు ( 498–ఏ) నమోదు చేశారు. -
టీచర్లకు మధ్యాహ్నం బాధ్యతలు వద్దు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన బాధ్యతలు అప్పగించి వారిని బోధనకు దూరం చేయొద్దని రాష్ట్రోపాధ్యాయ (ఎస్టీయూ) సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏవీ సు ధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. గురువా రం ఇబ్రహీంపట్నంలోని ఎస్టీయూ కా ర్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మా ట్లాడారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు కేవలం బోధనకే పరి మితమని అన్నారు. వారికి మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతలు అప్పగిం చి.. అమలులో ఏ చిన్న లోపం జరిగినా చర్యలు తీసుకోవడం సమంజ సం కాదన్నారు. తమిళనాడు తరహాలో పాఠశాలలకు అనుబంధంగా వంట నిమిత్తం ప్రత్యేక యంత్రాంగాన్ని శాశ్వత ప్రాతి పదికన ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీఓ 154ను సవరించి ఆర్జిత సెలవుల నగదు సౌకర్యాన్ని పం చాయతీరాజ్, మున్సిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని సుధాకర్ డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని, నైట్వాచ్మెన్ల ను నియమించాలని, ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక విధానం లో పారదర్శకత పాటించాలని సూచించారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎన్. పరమేశ్, ఇబ్రహీం పట్నం, మం చాల మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. యాదగిరి, పి.లక్ష్మణ్, ఎం.శ్రీనివాస్‌గౌడ్, ఆర్.కుమార్, నాయకులు రెడ్యానాయక్, శేఖర్‌రెడ్డి, రాజమల్లయ్య, యూసుఫ్‌బాబా, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.