సర్పంచ్‌లకు ‘సవాళ్లే’ | Newly Selected Sarpanch are welcome new challenges | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లకు ‘సవాళ్లే’

Published Tue, Feb 5 2019 3:01 AM | Last Updated on Tue, Feb 5 2019 3:38 AM

Newly Selected Sarpanch are welcome new challenges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, పాలకవర్గాలకు కొత్త సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. అధికారాలతోపాటు బాధ్యతలు కూడా పెరగడంతో, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి కొత్త చట్టం కత్తి మీద సాములా మారే ప్రమాదముంది. గతంలో సర్పంచ్‌లకు అధికారాలే తప్ప విధులు, బాధ్యతలు పెద్దగా ఉండేవి కావు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో భాగంగా అనేక లక్ష్యాలు నిర్దేశించారు.

నిర్దేశించిన బాధ్యతలు సరిగా నిర్వహించకపోయినా, కేటాయించిన నిధులను సవ్యంగా ఖర్చుచేయకపోయినా సర్పంచ్‌ల తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దుచేసే అవకాశాన్ని నూతన చట్టంలో కల్పించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను పంచాయతీ పాలకవర్గాలు రూపొందించుకుని తదనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. సర్పంచ్‌లు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ఈ చట్టంలో కట్టుదిట్టమైన నియమాలు రూపొందించారు.

సవాళ్లు ఎన్నో...
కొత్త చట్టంలో సర్పంచ్‌లకు పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారాలతో పాటు, ఉప సర్పంచ్‌లకు కూడా చెక్‌ పవర్‌ను కట్టబెట్టారు. గ్రామాల పురోగతికోసం, వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సర్పంచ్‌లకు బాధ్యతలతో పాటు వార్డుమెంబర్లను కూడా ఇందులో భాగస్వాములను చేశారు. పచ్చదనాన్ని పరిరక్షించడం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటివి ప్రధాన బాధ్యతలుగా నిలుస్తాయి.

మొక్కల పెంపకం.. పారిశుధ్యం
ప్రతి గ్రామంలో మొక్కల పంపిణీకోసం నర్సరీ ఏర్పాటుతో పాటు ఊళ్లోని ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూసే బాధ్యత కూడా గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌దే. ప్రతి రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించి సమస్యలపై చర్చించాల్సి ఉంటుంది. మూడు పర్యాయాలు వరసగా గ్రామసభల నిర్వహణలో విఫలమైతే సర్పంచ్‌లను బాధ్యతల నుంచి తొలగించే వీలు కల్పించారు. గ్రామ పాలకవర్గాలు ప్రతినెలా సమావేశమై అభివృద్ధి, తదితర కార్యక్రమాలను సమీక్షించాల్సి ఉంటుంది. గ్రామాల్లో, ఇళ్ల పరిసరాల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్తా చెదారం పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

ఇంటి ముందు చెత్తవేస్తే ఆ ఇంటి యజమానికి రూ.ఐదువందలు జరిమానా విధించే అధికారాన్ని కల్పించారు. దీనికి అనుగుణంగా సర్పంచ్‌ ఆధ్వర్యంలో పాలకవర్గం జరిమానా విధింపునకు నిర్ణయం తీసుకుంటే గ్రామ కార్యదర్శి ఆ మొత్తాన్ని వసూలు చేస్తారు. మురుగునీరు రోడ్డు మీదకు వదిలితే రూ.ఐదువేలు జరిమానా విధిస్తారు. గ్రామంలోని ఒక్కో కుటుంబం ఆరు మొక్కలు నాటాలని నిర్దేశించగా, అందుల్లో కనీసం మూడింటినైనా వారు నాటేలా చర్యలు తీసుకోవాలి.

హరితహారంలో ఇచ్చిన మొక్కలను పెంచకపోతే ఇంటి యజమాని నుంచి రెండింతలు ఆస్తిపన్నును జరిమానాగా వసూలుచేసే అవకాశం కల్పించారు. గ్రామ సర్పంచ్‌తోపాటు గ్రామకార్యదర్శి కూడా సంబంధిత గ్రామంలోనే నివాసముండాలి. సర్పంచ్, ఉపసర్పంచ్‌లను తొలగించినా, పాలకవర్గాలను రద్దు చేసినా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం కల్పించారు. పంచాయతీ పరిధిలోని వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు నూతన చట్టంలో వీలు కల్పించారు.

స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటు...
నూతన చట్టం ప్రకారం ప్రతి పంచాయతీలో మొక్కలు నాటడం, వాటి పరిరక్షణకు హరితహారం కమిటీ, అభివృద్ధి పనులపై ఒక కమిటీ, వీధిదీపాల నిర్వహణకు మరో కమిటీ, డంపింగ్‌యార్డు, పారిశుధ్యం, శ్మశానాల నిర్వహణతో కలిపి మొత్తం నాలుగు స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలకు నలుగురు వార్డుమెంబర్లను చైర్మన్లుగా, మిగతా వార్డు సభ్యులతోపాటు గ్రామాల్లో ఉత్సాహంగా పనిచేసే యువత, మహిళా సంఘాల సభ్యులను కూడా భాగస్వాములను చేస్తారు.

అక్రమ లేఔట్ల మీదా చర్యలు..
ఒకవేళ పంచాయతీలు అక్రమ లేఔట్లకు అనుమతిస్తే మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. అక్రమ నిర్మాణాల విషయంలోనూ ఇదే రీతిలో కఠిన చర్యలుంటాయి. పంచాయతీలు మూడు వందల మీటర్ల స్థలంలో, పది మీటర్ల ఎత్తు మించకుండా జీ ప్లస్‌ టు భవనాల నిర్మాణాల వరకే అనుమతినివ్వాలి. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని సర్పంచ్, స్థానిక కార్యదర్శి భరించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement