task management
-
సర్పంచ్‌లకు ‘సవాళ్లే’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, పాలకవర్గాలకు కొత్త సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. అధికారాలతోపాటు బాధ్యతలు కూడా పెరగడంతో, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి కొత్త చట్టం కత్తి మీద సాములా మారే ప్రమాదముంది. గతంలో సర్పంచ్‌లకు అధికారాలే తప్ప విధులు, బాధ్యతలు పెద్దగా ఉండేవి కావు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా అనేక లక్ష్యాలు నిర్దేశించారు. నిర్దేశించిన బాధ్యతలు సరిగా నిర్వహించకపోయినా, కేటాయించిన నిధులను సవ్యంగా ఖర్చుచేయకపోయినా సర్పంచ్ల తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దుచేసే అవకాశాన్ని నూతన చట్టంలో కల్పించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను పంచాయతీ పాలకవర్గాలు రూపొందించుకుని తదనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. సర్పంచ్‌లు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ఈ చట్టంలో కట్టుదిట్టమైన నియమాలు రూపొందించారు. సవాళ్లు ఎన్నో... కొత్త చట్టంలో సర్పంచ్‌లకు పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారాలతో పాటు, ఉప సర్పంచ్‌లకు కూడా చెక్ పవర్‌ను కట్టబెట్టారు. గ్రామాల పురోగతికోసం, వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు సర్పంచ్‌లకు బాధ్యతలతో పాటు వార్డుమెంబర్లను కూడా ఇందులో భాగస్వాములను చేశారు. పచ్చదనాన్ని పరిరక్షించడం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటివి ప్రధాన బాధ్యతలుగా నిలుస్తాయి. మొక్కల పెంపకం.. పారిశుధ్యం ప్రతి గ్రామంలో మొక్కల పంపిణీకోసం నర్సరీ ఏర్పాటుతో పాటు ఊళ్లోని ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూసే బాధ్యత కూడా గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌దే. ప్రతి రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించి సమస్యలపై చర్చించాల్సి ఉంటుంది. మూడు పర్యాయాలు వరసగా గ్రామసభల నిర్వహణలో విఫలమైతే సర్పంచ్‌లను బాధ్యతల నుంచి తొలగించే వీలు కల్పించారు. గ్రామ పాలకవర్గాలు ప్రతినెలా సమావేశమై అభివృద్ధి, తదితర కార్యక్రమాలను సమీక్షించాల్సి ఉంటుంది. గ్రామాల్లో, ఇళ్ల పరిసరాల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్తా చెదారం పడవేయకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇంటి ముందు చెత్తవేస్తే ఆ ఇంటి యజమానికి రూ.ఐదువందలు జరిమానా విధించే అధికారాన్ని కల్పించారు. దీనికి అనుగుణంగా సర్పంచ్ ఆధ్వర్యంలో పాలకవర్గం జరిమానా విధింపునకు నిర్ణయం తీసుకుంటే గ్రామ కార్యదర్శి ఆ మొత్తాన్ని వసూలు చేస్తారు. మురుగునీరు రోడ్డు మీదకు వదిలితే రూ.ఐదువేలు జరిమానా విధిస్తారు. గ్రామంలోని ఒక్కో కుటుంబం ఆరు మొక్కలు నాటాలని నిర్దేశించగా, అందుల్లో కనీసం మూడింటినైనా వారు నాటేలా చర్యలు తీసుకోవాలి. హరితహారంలో ఇచ్చిన మొక్కలను పెంచకపోతే ఇంటి యజమాని నుంచి రెండింతలు ఆస్తిపన్నును జరిమానాగా వసూలుచేసే అవకాశం కల్పించారు. గ్రామ సర్పంచ్‌తోపాటు గ్రామకార్యదర్శి కూడా సంబంధిత గ్రామంలోనే నివాసముండాలి. సర్పంచ్, ఉపసర్పంచ్‌లను తొలగించినా, పాలకవర్గాలను రద్దు చేసినా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం కల్పించారు. పంచాయతీ పరిధిలోని వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు నూతన చట్టంలో వీలు కల్పించారు. స్టాండింగ్ కమిటీల ఏర్పాటు... నూతన చట్టం ప్రకారం ప్రతి పంచాయతీలో మొక్కలు నాటడం, వాటి పరిరక్షణకు హరితహారం కమిటీ, అభివృద్ధి పనులపై ఒక కమిటీ, వీధిదీపాల నిర్వహణకు మరో కమిటీ, డంపింగ్‌యార్డు, పారిశుధ్యం, శ్మశానాల నిర్వహణతో కలిపి మొత్తం నాలుగు స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలకు నలుగురు వార్డుమెంబర్లను చైర్మన్లుగా, మిగతా వార్డు సభ్యులతోపాటు గ్రామాల్లో ఉత్సాహంగా పనిచేసే యువత, మహిళా సంఘాల సభ్యులను కూడా భాగస్వాములను చేస్తారు. అక్రమ లేఔట్ల మీదా చర్యలు.. ఒకవేళ పంచాయతీలు అక్రమ లేఔట్లకు అనుమతిస్తే మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. అక్రమ నిర్మాణాల విషయంలోనూ ఇదే రీతిలో కఠిన చర్యలుంటాయి. పంచాయతీలు మూడు వందల మీటర్ల స్థలంలో, పది మీటర్ల ఎత్తు మించకుండా జీ ప్లస్ టు భవనాల నిర్మాణాల వరకే అనుమతినివ్వాలి. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని సర్పంచ్, స్థానిక కార్యదర్శి భరించాల్సి ఉంటుంది. -
వేటు
వికారాబాద్ : విధి నిర్వహణలో అలసత్వం, అవినీతి, అక్రమాలకు పాల్పడిన పూడూరు మండలం చన్గోముల్ ఠాణా ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న నాగరాజు కేసులు నమోదు చేయడానికి బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడన్నారు. రెవెన్యూ కేసులలో సెటిల్మెంట్లు చే స్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు అవ కాశమిచ్చినప్పటికీ నాగరాజు ప్రవర్తనలో మార్పు రాలేదని, దీంతో సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చిందని ఎస్పీ స్పష్టం చేశారు. చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి పోలీస్టేషన్‌కు వచ్చేవారి నుంచి అనేక విధాలుగా డబ్బులు వసూలు చేసినట్లు తమకు ఫిర్యాదులు అందాయని శ్రీనివాసులు చెప్పారు. అంతేకాకుండా పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారితో సెటిల్మెంట్లకు పాల్పడుతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యవహరించారని పేర్కొన్నారు. పోలీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోవడమే కాకుండా అక్రమ సంపాదనకు తెర లేపారన్నారు. ఇసుక అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ మామూళ్లు వసూలు చే సి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని ఎస్బీ ఎస్ఐ కొమురయ్యను విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఎస్ఐ నాగరాజు కేసులు నమోదు చేయడంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, కొన్ని కేసులలో డబ్బులు తీసుకున్నాడని, ఇసుక లారీల యజమానుల నుంచి డబ్బులు వసూలుకు కానిస్టేబుల్ వెంకటేష్‌ను నియమించుకున్నట్లు తమ విచార ణలో తేలిందని ఎస్పీ తెలిపారు. సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తూ వివిధ రకాల భూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడని తేలిందన్నారు. పీఎస్‌కు ఇచ్చిన వాహనానికి కొత్త టైర్లు అమర్చేందుకు మండలంలోని పలువురు వ్యక్తుల నుంచి కానిస్టేబుల్ వెంకటేష్ ద్వారా భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసిన విషయం వీడియో టేపుల ద్వారా విచారణలో వెల్లడైందన్నారు. అదే విధంగా పోలీస్ సిబ్బంది, ఫిర్యాదుదారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడనే విషయం రుజువు కావడంతో ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారని ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. -
బాధ్యతగా వ్యవహరించకపోతే వేటే!
- ఆర్టీసీ సిబ్బందికి ఆర్ఎం హెచ్చరిక - డీఎంలతో సమీక్షాసమావేశం పట్నంబజారు(గుంటూరు) : విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించని పక్షంలో వేటు తప్పదని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తన చాంబర్లో గురువారం సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఇక నుంచి జిల్లావ్యాప్తంగా పదిమందితో కూడిన బృందాలు తిరుగుతాయని, సిబ్బంది, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పక్కన పెట్టాల్సివస్తుందని స్పష్టం చేశారు. ఆయా డిపోల పరిధిలో బ్రేక్ డౌన్స్ అధికమైపోతున్నాయని, ఎప్పటికప్పుడు బస్సుల స్థితిగతులను చూసుకోవాల్సిన బాధ్యత డీఎంలపైనే ఉందన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి రీజియన్ పరిధిలో జరుగుతున్న ‘బస్సు ప్రయాణ మాసం’లో అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. ప్రతి డిపో మేనేజర్ వారి వారి పరిధిలోని ప్రాంతాల్లో బస్సుల్లో పర్యటిస్తూ ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతి ఆదివారం డీఎంలు సూపర్వైజర్లతో సమావేశాన్ని నిర్వహించి ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు గత నెల 27వ తేదీన శ్రీరామపురం తండా నుంచి ప్రసవం కోసం మాచర్ల బయలుదేరిన అరుణాబాయి బస్సులోనే ప్రసవించింది. ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్ కృష్ణ, కండక్టర్ రహీంలను ఆర్ఎం శ్రీహరి అభినందించారు. -
నిర్లక్ష్యం వద్దు.. పనితీరు మార్చుకోండి
- రెవెన్యూ అధికారులపై కలెక్టర్ నిర్మల ఆగ్రహం సాక్షి, సిటీబ్యూరో: విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, పనితీరు మెరుగుపడకపోతే ఉపేక్షించేది లేదని తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులను కలెక్టర్ నిర్మల హెచ్చరించారు. ఇకపై రెండు నెలలకోసారి జిల్లా రెవెన్యూ అధికారులతో సమావేశాన్ని నిర్వహించటంతోపాటు పనితీరు, ప్రగతి నివేదికను బట్టి గ్రేడులిస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాల అమలులో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో పదిహేను ప్రాధాన్యతాంశాలను కలెక్టర్ నిర్మల సమీక్షించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్లతో విడివిడిగా సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారిగా తహశీల్దార్లతో పెండింగ్ సమస్యలపై ముఖాముఖి చర్చించారు. భూ వివాదాలకు సంబంధించి కోర్టు కేసులు, కంటెమ్డ్ కేసులపై అవగాహన లేకపోవటం, సీఎంఓ నుంచి వచ్చిన పిటీషన్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆసిఫ్‌నగర్, బహదూర్‌పుర, సికింద్రాబాద్ మండలాలతోపాటు మరికొందరు తహశీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవో 58, 59 కింద పట్టాల పంపిణీ, ఆసరా పింఛన్లు, ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, ఎన్ఓసీ, సీఎంఓ పిటీషన్లు, ధృవీకరణ పత్రాల జారీ, ఆపద్బంధు, సీఎం సహాయ నిధి, జాతీయ కుటుంబ ప్రయోజన పథకంతోపాటు రెవెన్యూశాఖ నుంచి ప్రజలకు అందిస్తున్న సేవలపై సమావేశంలో మండలాల వారిగా కలెక్టర్ సమీక్షించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, బయోమెట్రిక్ విధానాన్ని అందరూ పాటించాల్సిందేనని తెలిపారు. జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన భూములను ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలన్నారు. జీవో 58 నుంచి 59కి మార్పిడి చేసిన దరఖాస్తుదారులు మొదటి వాయిదా డబ్బులు ఆగస్టు 10 లోగా, రెండవ వాయిదా డబ్బులు ఆగస్టు 31లోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్నవారు రెండ వాయిదా సొమ్మును ఆగస్టు 31 వరకు చెల్లించాలన్నారు. ఆసరా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు.. ఆసరా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు త్వరితగతిన సేకరించాలని తహశీల్దార్లను కలెక్టర్ నిర్మల ఆదేశించారు. ఎనిమిది మండలాలల్లో బ్యాంకు ఖాతాల సేకరణ వెనుకబడి ఉండటంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని కోరారు. భూ సమస్యపై.. షేక్‌పేట మండలంలోని ప్రభుత్వ భూములపై అత్యధికంగా కోర్టు కేసులు ఉన్నాయని, వీటిన్నంటినిపై ఆర్డీఓ, లా ఆఫీసర్, తహశీల్దార్ కలిసి కౌంటర్లు తయారు చేయాలన్నారు. ప్రభుత్వ భూములను తహశీల్దార్లు ప్రతినెల తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. భూముల పరిరక్షణకు కలెక్టర్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలుంటే వెంటనే తగిన ప్రతిపాదనలు చేయాలన్నారు. సమావేశంలో జేసీ కె.సురేంద్రమోహన్, ఏజేసీ కె.రాజేందర్, డీఆర్ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓలు నిఖిల, రఘురాంశర్మ, అధికారులు గోపాల్‌రావు, సంగీత, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. -
కలెక్టర్ డి.కె.రవి
నాటకంతో ఆకట్టుకుంటున్న విద్యార్థులు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ {పజల్లో చైతన్యం తీసుకువస్తున్న వైనం ఆకట్టుకున్న రవి పాత్రధారి సౌందర్య కోలారు:విధుల నిర్వహణలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన కోలారు జిల్లా మాజీ కలెక్టర్ డి.కె.రవి జీవన విధానంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలకు విద్యార్థులు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రవి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అ ప్పగించాలన్న నినాదాన్ని కూడా వినిపిస్తున్నారు. శుక్రవారం కోలారు జిల్లా కలెక్టరేట్ వద్ద చింతామణికి చెందిన పట్టు వ్యవసాయ విద్యార్థులు ప్రదర్శిం చిన ‘కలెక్టర్ డి.కె.రవి’ అనే వీధి నాటకం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. నాటకం పూర్తి అయ్యే వర కూ అక్కడి నుంచి ఏ ఒక్కరూ పక్కకు కూడా వెళ్లలేకపోయారు. రవి బాల్యం మొదలు ఐఏఎస్ అధికారి అయ్యే వరకూ, అనంతరం ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను విద్యార్థులు కళ్లకు కట్టారు. ఓ పేదవాడు చదువుకునేందుకు పడుతున్న తపన చూపరులను కంటతడి పెట్టించింది. అవినీతి పరుల కుట్రలకు రవి ఎలా బలయ్యాడన్న అంశాన్ని విద్యార్థులు ప్రదర్శించేటప్పుడు చూపరుల శరీరం రోమాంచితమైంది. నాటకంలో రవి పాత్రను సౌందర్య, తల్లి పాత్రను లావణ్య, అవినీతి భూతం పాత్రను నాగవేణి పోషించారు. అనంతరం రవి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. -
బాధ్యతల బరువు.. సౌకర్యాలే కరువు
విధి నిర్వహణలో ఎన్నో కష్టనష్టాలను ఓరుస్తూ.. ప్రజలకు రక్షణ కల్పించేందుకు అంకితమైన హోంగార్డులు తమ జీవితాలు సమీప భవిష్యత్తులోనైనా మెరుగుపడాలని కోరుకుంటున్నారు. శనివారం హోంగార్డుల 52వ అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నేడు 52వ హోంగార్డుల అవతరణ దినోత్సవం * హోంగార్డులకు వర్తించని కనీస రాయితీలు * పదవీ విరమణ చెందితే...ఆర్థిక పరిస్థితి అధోగతే * కానిస్టేబుళ్లతో సమానంగా విధి నిర్వహణ శ్రీకాకుళం క్రైం: దేశంలో 1962లో నెలకొల్పిన హోంగార్డు వ్యవస్థ శ్రీకాకుళం జిల్లాలో 1965లో అడుగుపెట్టింది. ప్రస్తుతం 52వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ప్రారంభంలో 110 ఉండగా, ప్రస్తుతం 740 మంది హోంగార్డులు జిల్లాలో ఉన్నారు. వీరిలో 120 మంది డిప్యుటీషన్పై వెళ్లారు. కష్టానికి తగ్గ ఫలితం లేదు ఖాకీ దుస్తులను ధరించి కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు.. వారి మాదిరిగా వేతనాలు మాత్రం అందకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో పోటీ పడలేక జీవితం సాదాసీదాగా నెట్టుకువస్తున్నారు. హోంగార్డులు పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ పోలీసులకు వస్తున్న రాయితీలు వీరికి అందటం లేదు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించటం, పోలీసు స్టేషన్ల పనులు, పోలీసు ఉన్నతాధికారుల డ్రైవర్లుగా, రాత్రి వేళల్లో పోలీసులతో పాటు గస్తీ తిరుగుతూ నిత్యం బిజీగా కనిపించే హోంగార్డుల బతుకులు మాత్రం అగమ్యగోచరంగానే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకు బందోబస్తులకు వెళ్లేటప్పుడైనా వీరికి అదనపు వేతనం అందటం లేదు. వీరికి కనీస సౌకర్యాలు కూడా లేవనే చెప్పాలి. వివిధ దశల తర్వాత 2013లో వీరి వేతనాన్ని రూ.9 వేలకు పెంచారు. మునుపటి కంటే వేతనాలు కాస మెరుగైనప్పటికీ వీరు చేస్తున్న విధులకు తగిన ప్రతిఫలం దక్కడం లేదనే చెప్పాలి.చివరకు పీఎఫ్ కూడా అమలు కావటం లేదు. పదవీ విరమణ పొందేవారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారుతోంది. కాగా ఇటీవల జిల్లా పోలీసు యంత్రాంగం ఓ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఎవైరె నా హోంగార్డు పదవీ విరమణ చెందినా, మృతి చెందినా ఆ హోంగార్డు కుటుం బానికి జిల్లాలోని హోంగార్డులంతా కలసి ఒక రోజు వేతనాన్ని అందజేస్తున్నారు. ఇదొక్కటే పెద్ద సాయం. ప్రభుత్వ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం తప్ప, ఇక ఎలాంటి భరోసా లేదు. -
నిర్లక్ష్యంపై ఐజీ వేటు
నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పొదలకూరు సీఐ హైమారావుపై గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ గురువారం సస్పెండ్ వేటు వేశారు. పొదలకూరు సీఐగా ఎం.హైమారావు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పొదలకూరు సర్కిల్ పరిధిలోని మూగసముద్రం గ్రామంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన వృద్ధుడితో పాటు కొందరు గాయాలపాలయ్యారు. అప్పట్లో 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గాయాలపాలైన వృద్ధుడు నెల తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. దీన్ని సాకుగా తీసుకున్న సీఐ ప్రత్యర్థి వర్గంపై 302 కింద కేసు నమోదు చేసి మృతుడి తరఫు వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అలాగే పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేష్ విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై పోలీసులు ఫోక్సాయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడికి కొమ్ముకాసే విధంగా దర్యాప్తు సాగింది. నిందితున్ని అరెస్ట్ చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు లేకపోలేదు. మరో ఫోక్సాయాక్ట్ కేసులో ఇదే విధంగా సీఐ వ్యవహరించారు. అంతేకాకుండా బాధితురాలిని సకాలంలో వైద్యపరీక్షలకు తీసుకెళ్లలేదు. దర్యాప్తులోనే అలసత్వం వహించారని ఆరోపణలు వచ్చాయి. నిందితులను తప్పించేలా వ్యవహరించారని విమర్శలు గుప్పుమన్నాయి. ఈ ఘటనలపై ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్‌కు ఫిర్యాదులు అందాయి. సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అనంతరం నివేదికను ఐజీకి పంపారు. గుంటూరు రేంజ్ ఐజీ నివేదికను పరిశీలించి పొదలకూరు సీఐ హైమారావుపై సస్పెండ్ వేటు వేశారు. ఆది నుంచీ అవినీతి ఆరోపణలు హైమారావు ఆది నుంచీ అనేక అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఆర్టీసీకి చెందిన ఓ వ్యక్తిని బినామీగా నియమించుకుని అవినీతికి పాల్పడ్డాడన్న విమర్శలున్నాయి. అతని ఆధ్వర్యంలో పంచాయితీలు, సివిల్ వివాదాలు నెరిపారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల కలువాయికి చెందిన కొందరు ఎర్రచందనం రవాణా విషయంలో సీఐ తమను వేధిస్తున్నారని ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో సీఐ వ్యవహారశైలిపై ఎస్పీ సమగ్ర విచారణ జరిపి నివేదికను ఐజీకి అందజేసినట్టు తెలుస్తోంది. వరుస ఘటనలతో సిబ్బంది బెంబేలు అవినీతి, అక్రమాలకు పాల్పడితే వేటు తప్పదన్న సంకేతాలతో పోలీసు అధికారులు బెంబేలు ఎత్తుతున్నారు. క్రమశిక్షణతో నడచుకోకపోతే చర్యలు తప్పవని ఐజీ ఇప్పటికే పలుమార్లు సిబ్బందిని హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ అధికారిని అక్రమంగా నిర్బంధించి అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో సీఐ చెంచురామారావును ఐజీ సస్పెండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించిన వాకాడు ఎస్ఐ వాసును ఏకంగా సర్వీసు నుంచి తొలగించారు. బొగ్గు కుంభకోణం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో కృష్ణపట్నం పోర్టు ఎస్ఐను సస్పెండ్ చేశారు. తాజాగా సీఐ హైమారావును సస్పెండ్ చేశారు. -
పొదలకూరు సీఐ సస్పెన్షన్
గుంటూరు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు కేసు దర్యాప్తులో సరైన ఆధారాలను సేకరించడంలో విఫలమైన నెల్లూరు జిల్లా పొదలకూరు సీఐ హైమారావును గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 2012లో పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నీలకుల రమేష్ పదేళ్లలోపు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 164-ఏ సీఆర్పీసీ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి. 24 గంటల్లోగా బాధిత విద్యార్థినులను వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించడంతోపాటు వారి స్టేట్మెంట్లను సీఐ నమోదు చేయాల్సి ఉంది. పోక్సో చట్టం ప్రకారం దర్యాప్తు కొనసాగించాల్సిన సీఐ పూర్తిగా విఫలమయ్యూరు. దీంతో కోర్టులో కేసు విచారణలో సరైన ఆధారాలు చూపించలేకపోయూరు. అందుకు బాధ్యుడైన సీఐకు నెల్లూరు జిల్లా ఎస్పీ సింథల్కుమార్ ఈ ఏడాది సెప్టెంబర్ 16న వివరణ కోరుతూ మెమో జారీచేశారు. ఎస్పీ కోరిన వివరాలు ఇవ్వడంలోనూ సీఐ విఫలమవ్వడంతో ప్రత్యేక నివేదికలు రూపొందించి ఐజీకి పంపారు. గతంలో కూడా పలు కేసుల విచారణలో సీఐ విఫలమయ్యూరనీ ఎస్పీ అందజేసిన నివేదిక ఆధారంగా సీఐ హైమారావును సస్పెండ్ చేసి వెంటనే విధుల నుంచి తొలగించాలని ఐజీ ఆదేశాలు జారీ చేశారు. -
రక్షకులారా..వందనం
పోలీస్.. ఈ పేరు వింటేనే సంఘవిద్రోహశక్తులకు వణుకుపుడుతుంది. నేరగాళ్లకు భయమేస్తుంది. సామాన్య ప్రజలకు భరోసా లభిస్తుంది. తలపై మూడు సింహాల టోపీ.. ఒంటిమీద ఖాకీ దుస్తులు.. చేతిలో లాఠీ.. కాళ్లకు బూట్లు ధరించగానే త్యాగానికి వారు మారుపేరవుతారు. రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ అలుపెరుగని రక్షకులవుతారు. సమాజాన్ని, ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. అలాంటి సమయంలో ఎంతోమంది పోలీసులు ప్రాణాలర్పించారు. నేడు 55వ పోలీసు అమరవీరుల దినం సందర్భంగా.. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు జోహార్లు. * నేడు 55వ పోలీసు అమరవీరుల దినం * ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఒంగోలు క్రైం : పోలీస్ ఉద్యోగమంటే.. ఇంకేముందిలే అంతా హ్యాపీనేగా అనుకుంటారు. ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఏమైనా చేయొచ్చు, పవర్ చూపించొచ్చు, మంచి జీతం, కావాల్సినంత గీతం అని అందరూ భావిస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు ఎంతో త్యాగముంటుంది. రాత్రింబవళ్లు విధులుంటాయి. ఏ సమయంలో ఏం జరిగినా పరిగెత్తుకుంటూ వెళ్లి పనిచేయాలి. సమాజంలో జరిగే ప్రతి నేరానికీ వారే బాధ్యత వహించాలి. ఇంట్లో ఎప్పుడుంటారో వారికే తెలీదు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు అతి తక్కువ సమయం ఉంటుంది. ఇక.. బంధువులు, స్నేహితులనైతే మర్చిపోవాల్సిందే. పోలీస్ ఉద్యోగం సాధించేందుకు ఎంతో కష్టపడాలి. బాధ్యతగా పనిచేస్తూ ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకునేందుకు అంతకన్నా కష్టపడాలి. విధి నిర్వహణలో నిత్యం సవాళ్లు ఎదుర్కోవాలి. ప్రాణ త్యాగానికి సైతం సిద్ధంగా ఉండాలి. అలాంటి పోలీసులకు జిల్లాలో కొదవలేదు. జిల్లాకు చెందిన ఎంతోమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలర్పించారు. అమరవీరులుగా జోహార్లు అందుకుంటున్నారు. మంగళవారం 55వ పోలీసు అమరవీరుల దినం సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది. 1959 అక్టోబర్ 21వ తేదీ భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన ఆక్సాయ్‌చిన్ వద్ద జరిగిన పోరాటంలో ఎంతోమంది సాయుధ పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను గుర్తుచేసుకునేందుకు అప్పటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీ దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినం నిర్వహిస్తున్నారు. అనంతరం మావోయిస్టులతో జరిగిన పోరాటాలు, ఇతర సందర్భాల్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులనూ అమరవీరుల జాబితాలో చేర్చి ఏటా వారి సేవలను స్మరించుకుంటున్నారు. జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులు వీరే... * 1995లో అప్పటి ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డిపై ఆయన కార్యాలయంలో మావోయిస్టులు దాడిచేశారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఎంపీ మృతిచెందా రు. ఆయన అంగరక్షకునిగా ఉన్న కానిస్టేబుల్ పీసీ రత్నం మావోయిస్టులతో తీవ్రంగా పోరాడి ప్రాణాలొదిలారు. * 2002లో పుల్లలచెరువు పోలీసుస్టేషన్‌కు చెందిన ఏఎస్సై ప్రశాంతకుమార్ విధి నిర్వహణలో భాగంగా శతకోడు గ్రామం వెళ్లారు. అక్కడ మావోయిస్టులు దాడిచేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. * 2008 జూన్ 29న ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో విధులు నిర్వహిస్తూ బలిమెల దుర్ఘటనలో మావోయిస్టుల ఘాతుకానికి లేళ్ల శంకర్, మోటా ఆంజనేయులు మృతిచెందారు. వీరిద్దరూ మన జిల్లా వారే. వీరితో పాటు జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బెటాలియన్లలో పనిచేస్తూ శత్రుదేశాల దాడిలో జిల్లాకు చెందిన అనేక మంది అమరులయ్యారు. * 2009 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితోపాటు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ కర్నూలు జిల్లా పావురాలగుట్ట వద్ద జరిగిన ప్రమాదంలో సీఎంతో పాటు జిల్లాకు చెందిన ఆయన ప్రధాన భధ్రతా అధికారి అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ మరణించారు. * 2010 మే 19న లైలా తుపాను సమయంలో నల్లవాగులో కొట్టుకుపోతున్న ఆర్టీసీ కండక్టర్ యానాదిరావును కాపాడే ప్రయత్నంలో అద్దంకికి చెందిన కానిస్టేబుల్ రఫీ ప్రాణాలు కోల్పోయారు. నివాళులర్పించనున్న మంత్రి, కలెక్టర్, ఎస్పీ... పోలీసు అమరవీరుల దినం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం ఉదయం 7.45 గంటల నుంచి నిర్వహించనున్న కార్యక్రమాల్లో మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టర్ విజయకుమార్, ఎస్పీ శ్రీకాంత్, తదితరులు పాల్గొననున్నారు. పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులకు స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. అనంతరం పోలీసు అమరవీరుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
డీఎస్పీ, సీఐలపై చర్యలకు ఆదేశం
చార్జిషీటు చదవకుండా కోర్టుకు పంపించారని అదనపు జిల్లా జడ్జి వ్యాఖ్య నరసాపురం(రాయపేట) : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ, సీఐలపై తగు చర్యలు తీసుకోవాలని అదనపు జిల్లా న్యాయస్థానం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.కల్యాణరావు సోమవారం తీర్పు చెప్పారు. గతంలో పాల కొల్లు సీఐ, ప్రస్తుతం విజయవాడ డీటీఎస్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జె.సీతారామస్వామి, అప్పటి ఎస్సై, ప్రస్తుతం పాలకొల్లు రూరల్ సీఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌పై తగు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నరసాపురం డీఎస్పీ కార్యాలయ పరిధిలోని మొగల్తూరు పోలీసు స్టేషన్లో క్రైమ్ నంబరు 129/2009 కేసుకు సంబంధించి సెక్షన్ 302, 201 ఐపీసీ ప్రకారం జూలై 8, 2009లో కేసు నమోదు చేశారు. అప్పటి పాలకొల్లు సీఐ సీతారామస్వామి విచారణ అధికారిగా పని చేశారు. కేసు విషయంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పరిశోధన చాలా సాధారణంగా ఉందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని కొత్త సవరణలను పాటించకుండా, ఒక లేఖరి యాంత్రికంగా తయారు చేసిన చార్జిషీటును న్యాయపరంగా సరిపోయిందా లేదా అని చూడ కుండా.. కనీసం చదవకుండా కోర్టుకు దాఖలు చేయడం విధినిర్వహణలో అలసత్వంగా భావిస్తున్నట్లు తీర్పులో అదనపు జిల్లా సెషన్స్ జడ్డి పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతులను సద్వినియోగం చేసుకోకుండా, సమన్లు అందుకున్న అధికారులు సకాలంలో న్యాయస్థానానికి హాజరు కాకపోవడంతో అధికారులపై దురహంకారం, అమర్యాద, ఉల్లంఘన, విధి నిర్వహణలో లోపాలు, సత్వర విచారణ జరపటంలో ఆటంకపర్చి న్యాయస్థానానికి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు, నిందితుని తరపు న్యాయవాదికి ఇబ్బందులు కలగజేశారని పేర్కొ న్నారు. కేసు విచారణ త్వరితగతిన ముగించేం దుకు, నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించేందుకు, న్యాయస్థానం ఆదేశాల మేరకు సాక్షులను ఆయా తేదీల్లో ప్రవేశపెట్టేందుకు సీఐ ఆసక్తి చూపలేదన్నారు. దీనివల్ల న్యాయస్థానానికి, న్యాయవాదులకు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఇబ్బం దికర పరిస్థితులు కలిగాయని పేర్కొన్నారు. సీఐ అహంకారం, న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘన, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించి తగు చర్యలకు ఆదేశించినట్టు తీర్పులో వెల్లడించారు. హత్య, మానభంగం, దొంగనోట్లు తదితర నేరాల పరిశోధనలో నాణ్యమైన ప్రమాణాలను పాటించాలని, లేనిపక్షంలో నేర పరిశోధన వ్యవస్థ అంతిమ తీర్పు ఇవ్వడంలో విఫలమవుతుందన్నారు. -
తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు
ఒంగోలు టౌన్ : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహశీల్దార్లకు షోకాజు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ విజయకుమార్ జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. ఆ మేరకు.. వైద్యారోగ్యశాఖతో ముందస్తు సమీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన లింగసముద్రం, కొనకనమిట్ల తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సబ్‌సెంటర్లకు స్థలాలు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జరుగుమల్లి, గుడ్లూరు, లింగసముద్రం, తాళ్లూరు, పామూరు, ఉలవపాడు తహశీల్దార్లకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వెలిగండ్లలో ఐసీడీఎస్ భవన నిర్మాణానికి, హనుమంతునిపాడులో సంక్షేమ వసతి గృహానికి స్థలాలు కేటాయించని హనుమంతునిపాడు తహశీల్దార్‌తో పాటు కనిగిరి ఏఎస్‌డబ్ల్యూవోకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కందుకూరులో ఐసీడీఎస్ భవన నిర్మాణానికి స్థలం చూపించకపోవడంతో అక్కడి తహశీల్దార్‌కు, పచ్చతోరణం పథకం కింద మొక్కలు నాటేందుకు స్థలాలు సేకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన దొనకొండ, సీఎస్ పురం, గుడ్లూరు, వలేటివారిపాలెం, పొన్నలూరు, జరుగుమల్లి తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గుడ్లూరులో రేషన్‌కార్డుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్కడి డిప్యూటీ తహశీల్దార్‌కు కూడా షోకాజ్ నోటీసు జారీ అయింది. రెవెన్యూ వర్గాల్లో కలకలం... జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద సంఖ్యలో తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో రెవెన్యూ వర్గాల్లో కలకలం రేగింది. ఇప్పటివరకు ఒకటీఅరా మాత్రమే షోకాజ్ నోటీసులు ఇస్తూ వస్తున్న కలెక్టర్ విజయకుమార్.. ఒకేసారి పదుల సంఖ్యలో తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల డివిజనల్ సమీక్ష సమావేశాల తీరుతెన్నులను కలెక్టర్ మార్చారు. తాను సమీక్షించే నాటికి గ్రూపులుగా ఏర్పడి శాఖాపరమైన సమీక్షలు నిర్వహించాలని గత నెలలో జరిగిన సమావేశాలకు ముందుగానే కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, డివిజనల్ అధికారులు, తహశీల్దార్లకు ఆదేశాలందాయి. అయితే, తాజాగా శుక్రవారం జరిగిన కందుకూరు డివిజనల్ సమీక్ష సమావేశంలో తహశీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కలెక్టర్ విజయకుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్వోను ఆదేశించారు. వారు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మొత్తంమ్మీద అధిక సంఖ్యలో తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
మాకూ వీక్లీ ఆఫ్ కావాలి...
- తెలంగాణ తరహాలో వారాంతపు సెలవు కోరుతున్న పోలీసులు - ప్రతిపాదనలున్నాయి... ప్రభుత్వ నిర్ణయమే తరువాయంటున్న ఎస్పీ శ్రీకాకుళం క్రైం: నిత్యం నేరాలు ఘోరాలతో సావాసం... రాత్రనక పగలనక తిండి తిప్పలు లేక విధి నిర్వహణ... ప్రజాప్రతినిధుల రక్షణలో కీలక పాత్ర... ప్రజల మాన, ప్రాణ, ఆస్తుల రక్షణలో నిమగ్నం... ఇవన్నీ చెబుతున్నది ఎవరి గురించో అర్ధమయ్యేవుంటుంది.. వారే మన పోలీసులు. రోజంతా ప్రజల కోసం శ్రమిస్తారు. కాని ఆ పోలీసుల ఆరోగ్య రక్షణ, వారి కుటుంబ సరదాలను ఎవ్వరూ పట్టించుకోరు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు వారంలో ఒక రోజును వారాంతపు సెలవుగా ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్ర పోలీసుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే తరహాలో మన రాష్ట్ర పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్ మంజూరు ేయాలన్న ఆలోచన మొదలైంది. జిల్లాలో ఎస్పీ, ఇద్దరు ఓఎస్డీలు, నలుగురు డీఎస్పీలు, 56 మంది సీఐలు, నలుగురు ఆర్ఐలు, 11 మంది ఆర్ ఎస్సైలు, 111 మంది ఎస్సైలు, 81 మంది ఏఎస్సైలు, 251 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 982 మంది కానిస్టేబుళ్లు, 400 మంది ఎ.ఆర్.ఎస్సైలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ శాఖలో పనిచేసిన వారికైనా వారాంతపు సెలవు ఉంటుంది గానీ, ఒక్క పోలీసులకు మాత్రం ఇంత వరకు ఆ భాగ్యం దక్కలేదు. దీని కారణంగా చాలా మంది పోలీసులు ఒత్తిడికి గురై అనారోగ్యానికి లోనవుతున్నారు. అంతేకాకుండా కుటుంబసభ్యులతో సరదాగా గడిపే ఆనందాన్ని కూడ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ భావనను దూరం చేయాలంటే కచ్చితంగా వారాంతపు సెలవు కావల్సిందేనన్నది పోలీసు ఉన్నతాధికారుల భావన.ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. అయితే వారాంతపు సెలవు వల్ల విధులకు భంగం రాకుండా కొత్త నియామకాలు చేపట్టి సిబ్బందిని పెంచాల్సివుంటుంది. -
క్షణాల్లో దుర్ఘటన.. ఐదుగురి దుర్మరణం
రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. లారీ రూపంలో పొంచి ఉన్న మృత్యువు ఐదుగురిని బలితీసుకుంది. విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులతో పాటు స్థానికుడు దుర్మరణం చెందారు. కలెక్టర్ రాక కోసం నిరీక్షిస్తూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న వీరిపై అతి వేగంగా వస్తున్న లారీ దూసుకెళ్లి.. బోల్తా పడింది. క్షణాల్లో ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఘటనా స్థలంలో విషాదం అలుముకుంది. - విధుల్లో ఉన్న ఉద్యోగులపైకి దూసుకొచ్చిన లారీ - ఆర్ఐ, ముగ్గురు తలారులు, మరో వ్యక్తి మృతి - తహశీల్దార్, వీఆర్వో, తలారికి తీవ్ర గాయాలు - నన్నూరు గ్రామ సమీపంలో ఘటన - కలెక్టర్ కోసం ఎదురుచూస్తుండగా ప్రమాదం సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు పెద్దాసుపత్రి కన్నీటి సంద్రమైంది. ఐదుగురు మృతి వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు తనువు చాలించారు. ఆసుపత్రిలో హడావుడి.. అధికారులు, నేతల పరామర్శల నడుమ ఏమి జరుగుతుందో తెలియని దయనీయ స్థితి. ఒకరు చనిపోయారంటే.. మరొకరు ఇంకా బతికే ఉన్నారంట అనే సమాచారం గందరగోళానికి గురి చేసింది. ‘చివరి’ వరకు తమ కుటుంబ పెద్ద కోలుకుంటారనే ఆశ. ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి తరలించే వరకు ఎందరు శ్రమించినా.. వైద్యులు శక్తివంచన లేకుండా కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇక మాకు దిక్కెవరంటూ తలారి రామకృష్ణ భార్య ఈశ్వరమ్మ.. కుమారుడు, కవలలైన ఇద్దరు ఆడ పిల్లలతో కలసి రోదించడం అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తూ ఎందరో ప్రాణాలు కాపాడిన హుసేనాపురం గోపాల్ మృతితో ఆయన స్వగ్రామం కన్నీరుమున్నీరైంది. ‘‘పెద్ద సారోళ్లు వచ్చారంట. పని అయిపోగానే మధ్యాహ్నానికి తిరిగొస్తాం’’ అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన నిరుపేద తలారులు శివరాముడు, వెంకటేశ్వర్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులు కుప్పకూలారు. విధి నిర్వహణలో విషాదం రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు అనువైన స్థలాల వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఏర్పాటుకు సుమారు 300 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం కోరగా.. అధికారులు భూ సేకరణలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం నన్నూరు సమీపంలో అనువైన భూములు ఉండటంతో జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి బుధవారం ఉదయం పరిశీలన నిమిత్తం ఓర్వకల్లుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఓర్వకల్లు తహశీల్దార్ సునీతాబాయి, ఆర్ఐ శ్రీనివాసులు, తలారులు శివరాముడు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు కర్నూలు-నంద్యాల రహదారిలోని గడెంతిప్ప వద్ద రోడ్డు పక్కన వేచి చూస్తున్నారు. హుసేనాపురానికి చెందిన గోపాల్ కర్నూలుకు వెళ్తూ తన స్నేహితుడు, అధికారులు కనిపించడంతో వారి వద్దకు వెళ్లి పలకరించాడు. కలెక్టర్ రాక కోసం ఎదురుచూస్తున్న వీరంతా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ మృత్యు వాహనం వారి వైపునకు దూసుకొచ్చింది. మహారాష్ట్రకు చెందిన లారీ సిలికా లోడ్‌తో కర్నూలు వైపునకు వస్తూ రోడ్డు పక్కన నిల్చొన్న ఉద్యోగుల మీదుగా వెళ్లింది. ఘటనలో గ్రామ సేవకులు శివరాముడు(36), వెంకటేశ్వర్లు(43), హుసేనాపురం గోపాల్(28) అక్కడికక్కడే మరణించగా.. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు(45), గ్రామ సేవకుడు రామకృష్ణ(45)లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన తహశీల్దార్ సునీతాబాయి, పూడిచర్ల వీఆర్వో తిమ్మయ్య, నన్నూరు తలారి నాయుడును కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరితో పాటు అక్కడే ఉన్న సర్వేయర్ మల్లికార్జున, పత్రికా విలేకరులు గోపాల్, రాజేంద్రలు తమవైపునకు దూసుకొస్తున్న లారీని గమనించి పక్కకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. 45 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ అధికారుల మీదుగా వెళ్లిన లారీ వారిని 45 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. వేగంగా వస్తున్న లారీ తమ వైపునకు వస్తుందని గ్రహించలేక భూముల వివరాలు మాట్లాడుతూ ఉండిపోయారు. తప్పించుకోవాలన్నా వెనుక ముళ్లకంచె ఉండటంతో సాహసం చేయలేకపోయారు. లారీ ముందుగా తహశీల్దార్‌ను ఢీకొనగా.. తలారులు ఒకరినొకరు పట్టుకుని తప్పించుకోవాలని ప్రయత్నించినా రెప్పపాటులో లారీ కింద నలిగిపోయారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలు ఘటనా స్థలంలో మిన్నంటాయి. ఆసుపత్రికి భారీగా తరలిన రెవెన్యూ ఉద్యోగులు... ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు రెవెన్యూ ఉద్యోగులు భారీగా తరలివెళ్లారు. సహచరులు మరణించడంపై ప్రతి ఒక్కరిలో ఆందోళన వ్యక్తమయింది. కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జేసీ కన్నబాబు, ఏజేసీ అశోక్‌కుమార్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి రమణరావు, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్, రెవెన్యూ సంఘం నాయకులు రామన్న, సుధాకర్‌రావు, సిరాజ్ ఉద్దీన్, రాజశేఖర్‌బాబు, సుబ్బరాయుడు, సత్యదీప్, పలువురు.. మృతుల కుటుంబాలను, గాయపడి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం కర్నూలు(కలెక్టరేట్): రోడ్డు ప్రమాదంలో మరణించిన రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 వేల ప్రకారం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగా జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సహాయాన్ని అసోసియేషన్ ద్వారా తక్షణం ఇస్తున్నట్లు చెప్పారు. భూములను సర్వే చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై భారీ వాహనం దూసుకురావడంతో ఒక ఆర్ఐతో పాటు ముగ్గురు వీఆర్ఏలు మరణించారని, ఈ సంఘటన రెవెన్యూ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. మృతిచెందినవారి కుటుంబాలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించినట్లు పేర్కొన్నారు. విధి నిర్వహణలో మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాల్లో చదువుకున్న పిల్లలకు తక్షణం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలన్నారు. అన్ని విధాలా ఆదుకుంటాం : కలెక్టర్ సుదర్శన్ రెడ్డి కర్నూలు(కలెక్టరేట్): మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కల్గించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.25 వేల ప్రకారం ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. తగిన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సినవన్నీ త్వరలోనే అందజేస్తామని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన తహశీల్దార్ సునీతాబాయి పరిస్థితి విషమంగానే ఉందని, ఆమె కోలుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు.