ఈవై సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: జనరేటివ్ ఏఐపై (జెన్‌ఏఐ) వివిధ రంగాల్లో ఆసక్తి పెరుగుతోంది. విధుల నిర్వహణ సామర్థ్యాలను పెంచుకునేందుకు ఇది గణనీయంగా ఉపయోగపడగలదని దేశీయంగా చాలా మటుకు సీఎఫ్‌వోలు, ఆర్థిక.. ట్యాక్స్ నిపుణులు భావిస్తున్నారు. ఈవై ట్యాక్స్ అండ్ ఫైనాన్స్ ఆపరేషన్స్ (టీఎఫ్‌వో) సర్వే 2024 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా 32 దేశాల నుంచి 18 పరిశ్రమలకు సంబంధించి 1,600 మంది నిపుణులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో భారత్ నుంచి 70 మంది సీఎఫ్‌వోలు, పన్నుల నిపుణులు ఉన్నారు.
ట్యాక్స్, ఫైనాన్స్ విభాగాల్లో ఎదురవుతున్న కీలక సవాళ్లను ఈ నివేదికలో ప్రస్తావించారు. దీని ప్రకారం విధుల నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి జెన్‌ఏఐ ఉపయోగపడగలదని భావించే సీఎఫ్‌వోలు, ఫైనాన్స్, ట్యాక్స్ నిపుణుల సంఖ్య భారత్‌లో 2023లో 19 శాతంగా ఉండగా తాజాగా 94 శాతానికి పెరిగింది. అంతర్జాతీయంగా 87 శాతం మంది ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ట్యాక్స్ నిపుణుల్లో జెన్‌ఏఐ సామర్థ్యాలకు గుర్తింపు పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది. సర్వే ప్రకారం దేశీయంగా ట్యాక్స్ నిపుణులు ఇప్పటికే జెన్‌ఏఐ వినియోగంలో పురోగతి సాధిస్తున్నారు. 14 శాతం మంది జెన్‌ఏఐతో వ్యూహాలను రూపొందించడం, పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించడం, దానితో ఇతరత్రా ఉపయోగాలను తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. 47 శాతం మంది తమ కార్యకలాపాలను మెరుగుపర్చే విషయంలో జెన్‌ఏఐ సామర్థ్యాలపై అధ్యయనాలు, ప్రయోగాలు చేస్తున్నారు. అయితే, 44 శాతం మందికి జెన్‌ఏఐ సామర్థ్యాలను అర్థం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా ఉంటున్నాయి.
వృత్తిగతంగా సానుకూల మార్పులు ..
ట్యాక్స్ ప్రొఫెషనల్స్ కార్యాలయాలు, వృత్తిగత జీవితాల్లో సానుకూల మార్పులకు దోహదపడేలా జెన్‌ఏఐ సమర్ధవంతమైన సాధనంగా ఎదుగుతోందని ఈవై ఇండియా డిజిటల్ ట్యాక్స్ లీడర్ రాహుల్ పట్నీ తెలిపారు. డాక్యుమెంట్ల సమీక్షల నుంచి రోజువారీ పూర్తి చేయాల్సిన డ్రాఫ్టింగ్ వరకు వివిధ అంశాల్లో ఏఐ ఉపయోగపడగలదని వివరించారు. దీనితో నిపుణులు ఇతరత్రా కీలకమైన అంశాలపై దృష్టి పెట్టేందుకు, మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని పట్నీ పేర్కొన్నారు. నియంత్రణ సంస్థ నిబంధనలపరంగా, రిపోరి్టంగ్‌పరంగా భారం పెరిగే కొద్దీ తలెత్తే సవాళ్లను పరిష్కరించేందుకు కంపెనీల్లో ట్యాక్స్ నిపుణులు కొత్త వ్యూహాలు పాటించాల్సి వస్తుందని .. ఇలాంటి విషయాల్లో జెన్‌ఏఐ ఉపయోగకరంగా ఉండగలదనే అభిప్రాయం ఉంటోందని ఈవై ఇండియా నేషనల్ లీడర్ జితేష్ బన్సల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment