బాధ్యతల బరువు.. సౌకర్యాలే కరువు
విధి నిర్వహణలో ఎన్నో కష్టనష్టాలను ఓరుస్తూ.. ప్రజలకు రక్షణ కల్పించేందుకు అంకితమైన హోంగార్డులు తమ జీవితాలు సమీప భవిష్యత్తులోనైనా మెరుగుపడాలని కోరుకుంటున్నారు. శనివారం హోంగార్డుల 52వ అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
నేడు 52వ హోంగార్డుల అవతరణ దినోత్సవం
* హోంగార్డులకు వర్తించని కనీస రాయితీలు
* పదవీ విరమణ చెందితే...ఆర్థిక పరిస్థితి అధోగతే
* కానిస్టేబుళ్లతో సమానంగా విధి నిర్వహణ
శ్రీకాకుళం క్రైం: దేశంలో 1962లో నెలకొల్పిన హోంగార్డు వ్యవస్థ శ్రీకాకుళం జిల్లాలో 1965లో అడుగుపెట్టింది. ప్రస్తుతం 52వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ప్రారంభంలో 110 ఉండగా, ప్రస్తుతం 740 మంది హోంగార్డులు జిల్లాలో ఉన్నారు. వీరిలో 120 మంది డిప్యుటీషన్‌పై వెళ్లారు.
కష్టానికి తగ్గ ఫలితం లేదు
ఖాకీ దుస్తులను ధరించి కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు.. వారి మాదిరిగా వేతనాలు మాత్రం అందకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో పోటీ పడలేక జీవితం సాదాసీదాగా నెట్టుకువస్తున్నారు. హోంగార్డులు పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ పోలీసులకు వస్తున్న రాయితీలు వీరికి అందటం లేదు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించటం, పోలీసు స్టేషన్ల పనులు, పోలీసు ఉన్నతాధికారుల డ్రైవర్లుగా, రాత్రి వేళల్లో పోలీసులతో పాటు గస్తీ తిరుగుతూ నిత్యం బిజీగా కనిపించే హోంగార్డుల బతుకులు మాత్రం అగమ్యగోచరంగానే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకు బందోబస్తులకు వెళ్లేటప్పుడైనా వీరికి అదనపు వేతనం అందటం లేదు. వీరికి కనీస సౌకర్యాలు కూడా లేవనే చెప్పాలి.
వివిధ దశల తర్వాత 2013లో వీరి వేతనాన్ని రూ.9 వేలకు పెంచారు. మునుపటి కంటే వేతనాలు కాస మెరుగైనప్పటికీ వీరు చేస్తున్న విధులకు తగిన ప్రతిఫలం దక్కడం లేదనే చెప్పాలి.చివరకు పీఎఫ్ కూడా అమలు కావటం లేదు. పదవీ విరమణ పొందేవారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారుతోంది. కాగా ఇటీవల జిల్లా పోలీసు యంత్రాంగం ఓ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఎవైరె నా హోంగార్డు పదవీ విరమణ చెందినా, మృతి చెందినా ఆ హోంగార్డు కుటుం బానికి జిల్లాలోని హోంగార్డులంతా కలసి ఒక రోజు వేతనాన్ని అందజేస్తున్నారు. ఇదొక్కటే పెద్ద సాయం. ప్రభుత్వ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం తప్ప, ఇక ఎలాంటి భరోసా లేదు.