తన భూమిని దాయాదులు కబ్జా చేస్తున్నారని ఆరోపణ
పోలీసులు న్యాయం చేయడం లేదని మనస్తాపం
ఘట్‌కేసర్: ఓ హోంగార్డు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పరుశురాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా , మక్త అనంతారం గ్రామానికి చెందిన మహ్మద్ ఘని హైమద్ చెర్లపల్లి పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.
అతడికి ఘట్‌కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 258, 268లో 30 గుంటల భూమి ఉంది. దాయాదులు అఫ్జల్, జబ్బార్ తన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించుకోకుండా అడ్డుకుంటున్నారని మంగళవారం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు.
అయినా తనకు న్యాయం చేయడం లేదని మనస్తాపానికి లోనైన మహ్మద్ ఘని బుధవారం సాయత్రం బాటిల్‌లో డీజిల్ తీసుకుని స్టేషన్‌కు వచ్చాడు. నేరుగా ఇన్‌స్పెక్టర్ క్యాబిన్‌లోకి వెళ్లిన అతను ఆయన ఎదుటే డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తక్షణమే స్పందించిన ఇన్‌స్పెక్టర్, ఇతర పోలీసులు అతడి నుంచి డీజిల్ బాటిల్‌ను లాక్కున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ మేరకు అతడిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment