Home Guard: ఈశ్వర్‌.. సూపర్‌ | Home Guard Eshwar Save 23 People In Saroornagar Lake While Serving From 2020 To 2023, More Details Inside | Sakshi
Sakshi News home page

Home Guard: ఈశ్వర్‌.. సూపర్‌

Published Wed, Feb 5 2025 1:25 PM | Last Updated on Wed, Feb 5 2025 2:53 PM

home guard Ishwar save 23 people in Saroornagar Lake

సరూర్‌ననగర్‌ చెరువు కట్టపై విధులు 

చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నంచిన 23 మంది ప్రాణాలు కాపాడిన హోంగార్డు 

ధైర్య సాహసాలకు మెచ్చిన కేంద్రం 

రాష్ట్రపతి మెరిటోరియస్‌ సర్వీస్ మెడల్‌కు ఎంపిక 

ఆగస్టు 15న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకోనున్న ఈశ్వర్‌    

జీవితంపై విరక్తి చెంది.. క్షణికావేశంలో చెరువులో దూకే వారి పాలిట ఆపద్బాంధవుడయ్యాడు ఆ (Home Guard)హోంగార్డు.. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23 మందికి పునర్జన్మ ప్రసాదించాడు.. ఆయా కుటుంబాల్లో చీకట్లు అలుముకోకుండా కొత్త ‘ఊపిరి’ పోశాడు..   

సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌(Saroor Nagar Police Station) పరిధిలోని చెరువు కట్టపై పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌ ఇన్‌చార్జిగా 2020 నుంచి 2023 వరకు మూడేళ్లపాటు విధులు నిర్వర్తించాడు మంత్రి ఈశ్వరయ్య అలియాస్‌ ఈశ్వర్‌. అదే సమయంలో వివిధ కారణలతో సరూర్‌నగర్‌ చెరువులోకి దూకి ఆత్మ హత్యకు యత్నించిన 23 మందిని రక్షించాడు. బాధితులను రక్షించే క్రమంలో కొన్నిసార్లు ప్రాణపాయం వరకూ వెళ్లాడు. అయినా వెరవకుండా చెరువులో దూకేవారి ప్రాణాలను కాపాడాడు. అతని ధైర్య సాహసాలు, సేవలకు గుర్తింపుగా కేంద్రం ప్రతిష్టాత్మక భారత రాష్ట్రపతి మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్‌కు ఇటీవల ఎంపికచేసింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతులమీదుగా ఈశ్వర్‌ అవార్డు అందుకోనున్నారు. 

కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని.. 
మహేశ్వరం(maheshwaram) మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఈశ్వర్‌ చిన్నప్పుడు బావులు, చెరువుల్లో ఈత నేర్చుకున్నాడు. స్నేహితులతో ఈత కొట్టే సమయంలో పోటీలు పెట్టుకుని మొదటి స్థానంలో నిలిచేవాడు. 2000 సంవత్సరంలో హోంగార్డుగా ఎంపికయ్యాడు. 2020లో సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. చెరువు కట్టపై పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌ డ్యూటీ వేశారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. కాపాడే క్రమంలో అతడు కళ్ల ముందే చనిపోయాడు. ఈ సంఘటన (Ishwar)ఈశ్వర్‌ను కలిచివేసింది. అదే సమయంలో వివిధ కారణాలతో ఎంతోమంది చెరువులో దూకి ఆత్మ హత్యయత్నానికి పాల్పడుతుంటారని.. అలాంటి వారిని కష్టపడి రక్షించి ప్రాణాలు పోకుండా చూడాలని సీఐ సీతారామ్‌ చేసిన హితబోధ తన కర్తవ్యాన్ని గుర్తు చేశాయి. ఈ క్రమంలోనే రెండు రోజులకే  చెరువులో దూకిన యువకుడిని కాపాడాడు. ప్రేమ విఫలమై, సంసారంలో కలతలు వచ్చి గొడవలు పడిన దంపతులను రక్షించాడు.   

గాయాలైనా వెరవక.. 
చెరువులో దూకిన వారిని రక్షించే క్రమంలో కష్టంగా ఉండేది. బరువుగా ఉన్న వారిని ఒడ్డుకు తీసుకువచ్చే క్రమంలో ఒక్కోసారి పట్టుకొని చెరువు లోపలికి లాగేవారు. చెరువులో ముళ్లు, రాళ్లు, పడేసిన సీసాల ముక్కలు కాళ్లకు తగిలి తీవ్ర గాయాలయ్యేవి. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దని, చెరువులో దూకిన వారిని ప్రాణాలతో కాపాడాలని కుటుంబ సభ్యులు, ఏసీపీ, సీఐ, ఎస్‌ఐలు చెప్పి ప్రోత్సహించేవారు. అలా 23 మందిని రక్షించాడు. భారత రాష్ట్రపతి మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్‌కు ఎంపికకావడంపై ఎంతో మంది పోలీస్‌ ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈశ్వర్‌ ప్రస్తుతం మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

చదవండి: అప్పులు చేసి అమెరికా వెళ్లిన వారికి ఊహించని దెబ్బ!

బాధ్యత మరింత పెంచింది: మంత్రి ఈశ్వరయ్య
చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిలో ప్రాణాలతో బయటపడ్డవారు ఇప్పటికీ ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు. నీ వల్లే ఈరోజు బతికిబట్టకట్టామని, కొత్త జీవితాన్ని ఇచ్చావంటూ కృతజ్ఞతలు చెబుతుంటారు. వారు మాట్లాడుతుంటే నిజంగా గర్వంగా ఉంటుంది. రాష్ట్రపతి మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఇది నా బాధ్యతను మరింత పెంచింది.         

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement