Ishwar
-
సెటిల్మెంట్ అని పిలిపించి.. కారుతో తొక్కించి
‘దొంగలతో దోస్తీ’ ఆరోపణలపై పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయిన మేకల ఈశ్వర్‌పై గురువారం రాత్రి హత్యాయత్నం జరిగింది. వ్యవస్థీకృతంగా జేబు దొంగల ముఠాలు నడిపే ఈశ్వర్‌కు, ఆ ముఠాలకు చెందిన మరికొందరు నాయకుల మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణమని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొన్నాళ్లుగా తమిళనాడులో ఉంటూ తెలంగాణ వ్యాప్తంగా సెల్‌ఫోన్ జేబు దొంగల ముఠాలు నిర్వహిస్తున్న ఇతడిని సెటిల్మెంట్ కోసమని పిలిచిన నలుగురు కీలక నిందితులు కారుతో ఢీ కొట్టారు. అతడి పైనుంచి రెండుసార్లు వాహనాన్ని నడపటంతో ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. మీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా వద్ద ఈ ఘటన జరగ్గా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలిసింది. – సాక్షి, హైదరాబాద్క్రైమ్ వర్క్ చేస్తూ క్రిమినల్స్‌తో నెట్వర్క్ఆంధ్రప్రదేశ్కు చెందిన మేకల ఈశ్వర్ 2010లో కానిస్టేబుల్‌గా పోలీసు విభాగంలో అడుగుపెట్టాడు. ఎస్సార్‌నగర్, చిక్కడపల్లి, బేగంపేట పోలీసుస్టేషన్లతో పాటు టాస్క్‌ఫోర్స్‌లోనూ పని చేశాడు. మొదట్నుంచీ నేరాలకు సంబంధించిన విధులే నిర్వర్తించిన ఇతను.. అప్పట్లో చోరీ చేసిన ఫోన్లు ఖరీదు చేసే వాళ్లను బెదిరిస్తూ దందా మొదలెట్టాడు. తనకున్న పరిచయాలను వినియోగించుకుని చోరీకి గురైన ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు సేకరించేవాడు.వాటి ఆధారంగా అవి ప్రస్తుతం ఎవరు వాడుతున్నారో గుర్తించేవాడు. విషయం తెలియక సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో చోరీ ఫోన్లు కొనుగోలు చేసి వాడుతున్న వారిని పిలిచి బెదిరించేవాడు. ఫోన్ తీసుకోవడంతో పాటు కేసు పేరుతో భయపెట్టి కనీసం రూ.25 వేలు వసూలు చేసేవాడు. రికవరీ చేసిన ఫోన్‌ను అమ్ముకుని సొమ్ము చేసుకునే వాడు. ఇలా మొదలైన ఈశ్వర్ దందా పెద్ద నెట్‌వర్క్‌గా మారింది.వసతులు, ‘జీతాలు’ ఇచ్చి నేరాలుచోరీ ఫోన్ల మార్కెట్‌పై పట్టు లభించడంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న స్నాచర్లు, దొంగలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ప్రాంతానికి చెందిన వారిని మరోచోటుకు పంపేవాడు. అక్కడ వారికి అద్దె ఇంటిలో వసతి కల్పించేవాడు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం నాలుగు ఫోన్లు కొట్టేయాలనే టార్గెట్ పెట్టేవాడు. వీటిలో ఒక ఫోన్‌ను విలువను లెక్కించి ఆ మొత్తాన్ని జీతం కింద వారికి ఇచ్చేవాడు.ఇక ఈ ఫోన్లను విక్రయించడానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోని వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. వీరినుంచి ప్రతినెలా మామూళ్లు కూడా వసూలు చేసేవాడని తెలిసింది. మరోవైపు సెల్ఫోన్లతో పాటు బంగారు నగలనూ స్నాచింగ్ చేయించేవాడు. 2022లో నల్లగొండ పోలీసులు ఈ తరహా ఓ కేసులో ఈశ్వర్‌ను అరెస్టు చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు.తల్లిదండ్రులకు అప్పులిచ్చి పిల్లలతో దందాహైదరాబాద్లో ఫోన్ల దొంగతనం, విక్రయం దందా చేసే ముఠాలు ఎన్నో ఉన్నాయి. కొన్నాళ్లుగా వీళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ప్రత్యేకంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. తల్లిదండ్రులకు భారీ మొత్తం అప్పు ఇవ్వడం ద్వారా వారి పిల్లలతో హైదరాబాద్ సహా దక్షిణాదిలోని ఇతర ప్రధాన నగరాల్లో దందా చేయిస్తున్నారు. వీరికి వసతి కల్పించడంతో పాటు ఆహారం, మద్యం సరఫరా చేయడమే కాకుండా ప్రతిరోజూ రూ.300 ఖర్చుల కోసం ఇస్తున్నారు.రద్దీ ప్రదేశాలు, బస్సులు, సభలు, సమావేశాల్లో సెల్ఫోన్ల చోరీ వీరి పని. ఈ ముఠాల్లో అప్పులు తీసుకున్న మహిళలు కూడా ఉన్నారు. వీరు తమ చిన్నారులతో కలిసి బంగారం, ఇతర దుకాణాలకు వెళ్లి, యజమానులు వర్కర్ల దృష్టి మళ్లించి చోరీలు చేస్తుంటారు. వీరు ప్రతిరోజూ నిర్దిష్ట సంఖ్యలో చోరీలు చేయాలనే షరతు ఉంది. కాగా చోరీ చేసిన సొత్తులో కొంత మొత్తం వారి అప్పులో అసలు, వడ్డీ జమ చేసుకుంటారు. ఇలా అప్పు తీరే వరకు వీరంతా ముఠా నాయకుల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి నగరంలో పలు ముఠాలు ఉన్నట్లు తెలుస్తోంది.కక్ష కట్టి, సెటిల్మెంట్ అంటూ పిలిచి..ఇలాంటి కొన్ని ముఠాలపై ఈశ్వర్ గుత్తాధిపత్యం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నగరంలో మరే ఇతర ముఠాకు ‘పనివారు’ దొరకుండా చేస్తున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆధిపత్య పోరు పెరిగిపోగా ఎవరైనా అతికష్టమ్మీద వేరే ప్రాంతం నుంచి దొంగల్ని పట్టుకుని వస్తే, ఈశ్వర్ తనకున్న పాత పరిచయాల ద్వారా పోలీసులకు సమాచారం చేరవేస్తూ వాళ్లు అరెస్టు అయ్యేలా చేస్తున్నాడు. దీంతో కక్షకట్టిన నాలుగు ముఠాలకు చెందిన నాయకులు అతనిపై హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.గురువారం మందమల్లమ్మ చౌరస్తాలోని ఓ బార్‌కు అతన్ని పిలిచిన నలుగురు నిందితులు.. కొద్దిసేపు వాగ్వాదం తర్వాత తమ ప్రతిపాదనల్ని తిరస్కరించి, బెదిరించి వెళ్లిపోతున్న ఈశ్వర్‌పై కారుతో ఢీ కొట్టి హత్యాయత్నం చేసినట్లు తెలిసింది. అయితే కొందరు వ్యక్తులు చిట్టీల వ్యాపారంలో విభేదాల వల్లే ఈశ్వర్‌పై హత్యాయత్నం చేశామంటూ మీర్‌పేట పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలుస్తోంది. దీంతో రాచకొండ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
తీవ్ర విషాదం.. క్రికెటర్ ఈశ్వర్ ఇకలేరు
విశాఖపట్నం: జీవీఎంసీ 68వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన క్రికెటర్ సోముదల ఈశ్వర్(40) కన్నుమూశారు. ఆగస్టు 28వ తేదీనే ఆయన గుండెపోటుతో మృతి చెందగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాఖలో డివిజన్ క్రికెట్ ఆడుతూనే ఈశ్వర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏసీఏకు చేదోడు వాదోడుగానూ ఉంటూ.. టోర్నీల నిర్వహణలో సహాయం అందించేవాడు. అలా ఆయన ప్రతిభ ఐపీఎల్‌కు తాకింది. ఎడమ చేతి వాటం బౌలర్ అయిన ఈశ్వర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్లకు నెట్స్‌లో బంతులు విసిరేందుకు సహాయకుడిగా చేరాడు. ఐపీఎల్లో సపోర్టింగ్ స్టాఫ్‌గా ప్రస్థానం కొనసాగిస్తూనే.. విశాఖలో జరిగిన ఏపీఎల్ సీజన్ పాల్గొన్నాడు. ఇటీవల ఏపీఎల్ సీజన్ ముగియడంతో అప్పన్నకాలనీలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ నెల 28న స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చాడు. బైక్ దిగి స్టాండ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తల్లి రాములమ్మ తెలిపారు. ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడని బోరున విలపించారు. ఈ వార్త విన్న భారత క్రికెటర్ శ్రీకర్ భరత్.. ఈశ్వర్ ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈశ్వర్‌కు వివాహం కాలేదు. క్రికెటర్ వేణుగోపాల్‌తో సాన్నిహిత్యం తన 16వ ఏటనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈశ్వర్‌కు పేదరికం వెంటాడింది. 10వ తరగతి వరకు చదువుకున్న ఈశ్వర్ క్రికెట్టే ప్రపంచంగా భావించాడు. క్రికెటర్ వేణుగోపాల్, ఈశ్వర్ ఇద్దరూ రంజీ సెలక్షన్‌కు వెళ్లారు. వేణుగోపాల్ రంజీకి ఎంపిక కాగా.. ఈశ్వర్‌కు నిరాశే మిగిలింది. అయినా ఏనాడు కుంగిపోలేదు. ఈ క్రమంలో ఈశ్వర్‌పై అభిమానం పెంచుకున్న వేణుగోపాల్ తనతో పాటు పలు మ్యాచ్‌లకు తీసుకువెళ్లేవాడు. ఈశ్వర్ ఫాస్ట్ బౌలర్. గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఈశ్వర్ బౌలింగ్ అంటే భారత క్రికెటర్లకు ఎంతో ఇష్టం. అందుకే స్టార్ క్రికెటర్లు ఆయనతో బౌలింగ్ వేయించుకుని నెట్ ప్రాక్టీస్ చేసేవారు. దీంతో ఈశ్వర్‌కు ఎక్కువగా భారత క్రికెట్ క్యాంపుల్లో అవకాశం దక్కేది. అలా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రికీ పాటింగ్, డేవిడ్ వార్నర్.. తదితర ఎంతో మంది క్రికెటర్లకు అభిమానిగా మారాడు. ఈశ్వర్‌ను ఎక్సట్రా ప్లేయర్‌గా అన్ని విషయాల్లో సమానంగా చూసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మరణవార్త తెలుసుకున్న క్రికెటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మృతి బాధాకరం నేనూ ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు ప్రస్తుత సీజన్ ఐపీఎల్లో ఆడాను. జట్టుతో పాటు ప్రాక్టీస్ చేసేప్పుడు ఈశ్వర్ నెట్స్‌లో బంతులు విసిరేవాడు. ఇద్దరం విశాఖ వాసులమే కావడంతో తొలినాళ్ల నుంచి అతనితో పరిచయం ఉంది. అతను అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరం. – భరత్, భారత టెస్ట్ క్రికెటర్ ప్రగాఢ సానుభూతి మా అన్ని శిక్షణ సెషన్స్, మ్యాచ్‌ల్లో జట్టుకు సహాయకారిగా ఉన్న ఈశ్వర్‌ను మిస్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మా ప్రియమైన సైడ్ ఆర్మ్ స్పెషలిస్ట్ ఈశ్వర్ ఇకలేరు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. – ఢిల్లీ కాపిటల్స్ మేనేజ్మెంట్ -
పల్లెటూరి జంక్షన్.. విలేజ్ డ్రామా
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన విలేజ్ డ్రామా ‘సూర్యాపేట జంక్షన్’. నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో అనిల్ కుమార్ కత్ర గోడ, ఎన్. శ్రీనివాసరావు నిర్మించారు. ఈ చిత్రంలోని ‘చెంగు చెంగుమంటూ జింక పిల్లలాగా..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను నిర్మాత సి. కల్యాణ్ రిలీజ్ చేశారు. రోషన్ సాలూరి స్వరకల్పనలో ఎస్. సాయిచరణ్, సోరస్ పాడిన ఈ పాటకు రెహమాన్ లిరిక్స్ అందించారు. ‘‘వ్యవస్థను సరిదిద్దే బాధ్యత యువతపై ఉంటుంది. కొత్త తరం ఓటర్లు చూడాల్సిన చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు హరి గౌర మరో స్వరకర్త. -
అమ్మకు ప్రేమతో..
► ఎస్వీయూ పీజీసెట్‌లో ► 4వ ర్యాంక్ సాధించిన ఈశ్వర్ ► కూలిపనులు చేస్తూ కుమారున్ని చదివించిన అమ్మ కర్నూలు సీక్యాంప్: తాను చదువుకోకపోయినా కుమారున్ని మాత్రం ఉత్తమంగా చదివిస్తోంది ఆ తల్లి. కూలి పనులు చేస్తూ వచ్చినంతలోనే కుమారుని చదువుకు ఏ ఆటంకం లేకుండా చూస్తోంది. కుమారుడు కూడా తల్లి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత మాత్రం ఒమ్ము చేయడం లేదు. ఎస్వీ యూనివర్సిటీ పీజీ సెట్ కామర్స్ విభాగంలో 4వ ర్యాంకు సాధించి అమ్మకు ప్రేమతో కానుకగా ఇచ్చాడు. 20 ఏళ్లుగా క్యాంప్‌లోని పూరిగుడిసెలో ఉంటున్న పుల్లమ్మ ఏమీ చదువుకోలేదు. కొడుకు ఈశ్వర్‌ను మాత్రం కూలి డబ్బుతోనే చిన్నప్పటి నుంచి చదివించింది. ఈ నెల 25న విడుదలైన ఎస్వీ యూనివర్శిటీ పీజీ సెట్ కామర్స్ ఫలితాల్లో ఈశ్వర్ 4వ ర్యాంక్ సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. -
వాలెంటైన్స్ డే రోజు ప్రియుడి హత్య
న్యూఢిల్లీ: ప్రేమికుల రోజు నాడు ప్రియురాల్ని కలుసుకుందామని వచ్చిన ఓయువకుడు శవమై తేలాడు. ఢిల్లీకి చెందిన ఈశ్వర్ (27) ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వాలెంటైన్స డే సందర్భంగా ప్రేమికులిద్దరూ గుర్గావ్ లో కలుసుకున్నారు. ప్రియురాలిని తొలిసారి కలిసిన ఆనందం క్షణకాలం ముగియకుండానే ఆమె బంధువుల చేతిలో హత్యకు గురికావడం విషాదాన్ని నింపింది. తీవ్రగాయాలతో ఒక యువకుడు తమ ఆసుపత్రిలో చేరినట్టుగా స్థానిక ఆసుపత్రి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తయ్యారు. కానీ వారు అక్కడికి చేరే లోపే ఈశ్వర్ ప్రాణాలు విడిచాడు. దీనిపై సుశాంత్ లోక్ పోలీసు స్టేషన్ అధికారులు ఆరా తీశారు. వారు అందించిన సమాచారం ప్రకారం.. ఈశ్వర్ ఏడునెలల క్రితం ఫేస్బుక్ లో పరిచయమైన అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమికుల రోజున ఇద్దరు ఒకరికొకరు ముఖాముఖి కలుసుకోవాలని నిర్ణయించుకుని మెట్రో రైల్వే స్టేషన్ లో మీట్ అయ్యారు. అనంతరం సుశాంత్ లోక్ ఏరియాలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలోకి వెళ్లారు. వీరిని గమనించిన ఆమె బావ రమేష్ (30), అతని డ్రైవర్ అనిల్ కుమార్ (25) వాళ్లను ఫాలో అయ్యారు. ప్రేమికులిద్దరూ మాట్లాడుకుంటుండగా బావ రమేష్, ఈశ్వర్ తో వాదనకుదిగారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఈశ్వర్ ను పైనుంచి కిందికి తోసేశారు. దీంతో తీవ్రగాయాలపాలైన ఈశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని కొంత దూరంకారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేసారని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నంలో భాగంగా అక్కడినుంచి వెళ్లిపోయారన్నారు. రమేష్, అనిల్ పై హత్యకేసు నమోదుచేశామని,దర్యాప్తు కొనసాగుతోందని గుర్గావ్ పోలీస్ అధికారి దీపక్ తెలిపారు. -
దొంగల దాడిలో కానిస్టేబుల్ మృతి!
ఒక ఎస్సైకి గాయాలు.. నగర శివార్లలో అర్ధరాత్రి ఘటన పోలీసుల కాల్పుల్లో ఒక దొంగ మృతి శామీర్‌పేట: తమను వెంబడిస్తూ వచ్చిన పోలీసులపై కత్తులతో దొంగలు చేసిన దాడిలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా.. ఎస్సైకి తీవ్రగాయా లయ్యాయి. ఇదే సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక దొంగ మృతిచెందాడు. హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ చౌరస్తా సమీపంలోని బావర్చి హోటల్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రాజీవ్ రహదారిపై అనుమానాస్పదంగా వెళుతున్న కొందరు దొంగలను జేటీఎఫ్ టీమ్ పోలీసులు వెంబడించారు. కానీ, వారు ముందుగా వెళ్లిపోవడంతో... మజీద్‌పూర్ చౌరస్తా సమీపంలోని బావర్చి హోటల్ వద్ద ఆగిపోయారు. పోలీసు బృందం అక్కడ ఆగిన సమయంలోనే... ఆ దొంగలు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక దొంగ మరణించగా... ఎస్సై వెంకటరెడ్డికి, కానిస్టేబుల్ ఈశ్వర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో వెంకటరెడ్డిని మెడిసిటీ ఆస్పత్రికి తరలించగా... ఆల్వాల్‌లోని ఆక్సిజన్ ఆస్పత్రికి ఈశ్వర్‌ను తరలించారు. తీవ్రంగా గాయపడిన ఈశ్వర్.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించినట్లు సమాచారం. -
ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి
ఎల్బీనగర్లో ఘటన పరారీలో నిందితులు నాగోలు: ఓ చిన్నారిపై దుండగులు లైంగికదాడికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా అందోల్ మండలం కిచ్చెనపల్లికి చెందిన ఈశ్వర్ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చారు. వీరికి ఐదేళ్ల కూతురు, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈశ్వర్ ఎల్బీనగర్ సిరినగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తన కుటుంబం కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత అతని భార్యా పిల్లలు మొదటి అంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2 గంటల ప్రాంతంలో తల్లి లేచి చూసేసరికి కూతురు కనిపించలేదు. వెంటనే విషయాన్ని భర్తకు చెప్పింది. అంతలోనే మూడో అంతస్తు నుంచి ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. కుటుంబ సభ్యులు పైకి వెళ్లేసరికి చిన్నారి రోదిస్తూ కనిపించింది. పరిశీలించగా తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు కిందికి వచ్చేసరికి వీరు నివాసం ఉండే గది తాళం పగులగొట్టి ఉంది. రూ.4 వేల నగదు కనిపించకపోగా లైట్లు ఆర్పివేసి ఉన్నాయి. చిన్నారిని ఆరా తీయగా ఇద్దరు వ్యక్తులు నోరు మూసి పైఅంతస్తులోకి తీసుకెళ్లారని ఏడుస్తూ చెప్పింది. చికిత్స నిమిత్తం శుక్రవారం ఉదయం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరీక్షల నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎల్బీ నగర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ సీతారాం, ఎల్బీనగర్ సీఐ సంఘటన స్థలానికి చేరుకుని డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. ఎల్బీ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను శిక్షించాలి.. లైంగిక దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనూరాధ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలన్నారు.