- ఎల్బీనగర్‌లో ఘటన
- పరారీలో నిందితులు
నాగోలు: ఓ చిన్నారిపై దుండగులు లైంగికదాడికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి ఎల్బీనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా అందోల్ మండలం కిచ్చెనపల్లికి చెందిన ఈశ్వర్ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చారు. వీరికి ఐదేళ్ల కూతురు, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈశ్వర్ ఎల్బీనగర్ సిరినగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తన కుటుంబం కూడా అక్కడే నివాసం ఉంటున్నారు.
గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత అతని భార్యా పిల్లలు మొదటి అంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2 గంటల ప్రాంతంలో తల్లి లేచి చూసేసరికి కూతురు కనిపించలేదు. వెంటనే విషయాన్ని భర్తకు చెప్పింది. అంతలోనే మూడో అంతస్తు నుంచి ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. కుటుంబ సభ్యులు పైకి వెళ్లేసరికి చిన్నారి రోదిస్తూ కనిపించింది. పరిశీలించగా తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు కిందికి వచ్చేసరికి వీరు నివాసం ఉండే గది తాళం పగులగొట్టి ఉంది. రూ.4 వేల నగదు కనిపించకపోగా లైట్లు ఆర్పివేసి ఉన్నాయి.
చిన్నారిని ఆరా తీయగా ఇద్దరు వ్యక్తులు నోరు మూసి పైఅంతస్తులోకి తీసుకెళ్లారని ఏడుస్తూ చెప్పింది. చికిత్స నిమిత్తం శుక్రవారం ఉదయం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరీక్షల నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎల్బీ నగర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ సీతారాం, ఎల్బీనగర్ సీఐ సంఘటన స్థలానికి చేరుకుని డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. ఎల్బీ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులను శిక్షించాలి..
లైంగిక దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనూరాధ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలన్నారు.