దొంగల దాడిలో కానిస్టేబుల్ మృతి!
ఒక ఎస్సైకి గాయాలు.. నగర శివార్లలో అర్ధరాత్రి ఘటన
పోలీసుల కాల్పుల్లో ఒక దొంగ మృతి
శామీర్‌పేట: తమను వెంబడిస్తూ వచ్చిన పోలీసులపై కత్తులతో దొంగలు చేసిన దాడిలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా.. ఎస్సైకి తీవ్రగాయా లయ్యాయి. ఇదే సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక దొంగ మృతిచెందాడు. హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ చౌరస్తా సమీపంలోని బావర్చి హోటల్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రాజీవ్ రహదారిపై అనుమానాస్పదంగా వెళుతున్న కొందరు దొంగలను జేటీఎఫ్ టీమ్ పోలీసులు వెంబడించారు.
కానీ, వారు ముందుగా వెళ్లిపోవడంతో... మజీద్‌పూర్ చౌరస్తా సమీపంలోని బావర్చి హోటల్ వద్ద ఆగిపోయారు. పోలీసు బృందం అక్కడ ఆగిన సమయంలోనే... ఆ దొంగలు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక దొంగ మరణించగా... ఎస్సై వెంకటరెడ్డికి, కానిస్టేబుల్ ఈశ్వర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో వెంకటరెడ్డిని మెడిసిటీ ఆస్పత్రికి తరలించగా... ఆల్వాల్‌లోని ఆక్సిజన్ ఆస్పత్రికి ఈశ్వర్‌ను తరలించారు. తీవ్రంగా గాయపడిన ఈశ్వర్.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించినట్లు సమాచారం.