మాజీ కానిస్టేబుల్ ఈశ్వర్‌పై హత్యాయత్నం
ఏళ్లుగా జేబుదొంగల గ్యాంగ్‌లు నిర్వహిస్తున్న ఈశ్వర్
నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల చోరీలు
ఈ వ్యవస్థీకృత దందాలో ఇతడిదే పూర్తి ఆధిపత్యం..
దీంతో ముఠా నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు
‘దొంగలతో దోస్తీ’ ఆరోపణలపై పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయిన మేకల ఈశ్వర్‌పై గురువారం రాత్రి హత్యాయత్నం జరిగింది. వ్యవస్థీకృతంగా జేబు దొంగల ముఠాలు నడిపే ఈశ్వర్‌కు, ఆ ముఠాలకు చెందిన మరికొందరు నాయకుల మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణమని తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొన్నాళ్లుగా తమిళనాడులో ఉంటూ తెలంగాణ వ్యాప్తంగా సెల్‌ఫోన్ జేబు దొంగల ముఠాలు నిర్వహిస్తున్న ఇతడిని సెటిల్‌మెంట్ కోసమని పిలిచిన నలుగురు కీలక నిందితులు కారుతో ఢీ కొట్టారు. అతడి పైనుంచి రెండుసార్లు వాహనాన్ని నడపటంతో ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. మీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా వద్ద ఈ ఘటన జరగ్గా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలిసింది. – సాక్షి, హైదరాబాద్
క్రైమ్ వర్క్ చేస్తూ క్రిమినల్స్‌తో నెట్‌వర్క్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మేకల ఈశ్వర్ 2010లో కానిస్టేబుల్‌గా పోలీసు విభాగంలో అడుగుపెట్టాడు. ఎస్సార్‌నగర్, చిక్కడపల్లి, బేగంపేట పోలీసుస్టేషన్లతో పాటు టాస్క్‌ఫోర్స్‌లోనూ పని చేశాడు. మొదట్నుంచీ నేరాలకు సంబంధించిన విధులే నిర్వర్తించిన ఇతను.. అప్పట్లో చోరీ చేసిన ఫోన్లు ఖరీదు చేసే వాళ్లను బెదిరిస్తూ దందా మొదలెట్టాడు. తనకున్న పరిచయాలను వినియోగించుకుని చోరీకి గురైన ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు సేకరించేవాడు.
వాటి ఆధారంగా అవి ప్రస్తుతం ఎవరు వాడుతున్నారో గుర్తించేవాడు. విషయం తెలియక సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో చోరీ ఫోన్లు కొనుగోలు చేసి వాడుతున్న వారిని పిలిచి బెదిరించేవాడు. ఫోన్ తీసుకోవడంతో పాటు కేసు పేరుతో భయపెట్టి కనీసం రూ.25 వేలు వసూలు చేసేవాడు. రికవరీ చేసిన ఫోన్‌ను అమ్ముకుని సొమ్ము చేసుకునే వాడు. ఇలా మొదలైన ఈశ్వర్ దందా పెద్ద నెట్‌వర్క్‌గా మారింది.
వసతులు, ‘జీతాలు’ ఇచ్చి నేరాలు
చోరీ ఫోన్ల మార్కెట్‌పై పట్టు లభించడంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న స్నాచర్లు, దొంగలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ప్రాంతానికి చెందిన వారిని మరోచోటుకు పంపేవాడు. అక్కడ వారికి అద్దె ఇంటిలో వసతి కల్పించేవాడు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం నాలుగు ఫోన్లు కొట్టేయాలనే టార్గెట్ పెట్టేవాడు. వీటిలో ఒక ఫోన్‌ను విలువను లెక్కించి ఆ మొత్తాన్ని జీతం కింద వారికి ఇచ్చేవాడు.
ఇక ఈ ఫోన్లను విక్రయించడానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోని వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. వీరినుంచి ప్రతినెలా మామూళ్లు కూడా వసూలు చేసేవాడని తెలిసింది. మరోవైపు సెల్‌ఫోన్లతో పాటు బంగారు నగలనూ స్నాచింగ్ చేయించేవాడు. 2022లో నల్లగొండ పోలీసులు ఈ తరహా ఓ కేసులో ఈశ్వర్‌ను అరెస్టు చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు.
తల్లిదండ్రులకు అప్పులిచ్చి పిల్లలతో దందా
హైదరాబాద్‌లో ఫోన్ల దొంగతనం, విక్రయం దందా చేసే ముఠాలు ఎన్నో ఉన్నాయి. కొన్నాళ్లుగా వీళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ప్రత్యేకంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. తల్లిదండ్రులకు భారీ మొత్తం అప్పు ఇవ్వడం ద్వారా వారి పిల్లలతో హైదరాబాద్ సహా దక్షిణాదిలోని ఇతర ప్రధాన నగరాల్లో దందా చేయిస్తున్నారు. వీరికి వసతి కల్పించడంతో పాటు ఆహారం, మద్యం సరఫరా చేయడమే కాకుండా ప్రతిరోజూ రూ.300 ఖర్చుల కోసం ఇస్తున్నారు.
రద్దీ ప్రదేశాలు, బస్సులు, సభలు, సమావేశాల్లో సెల్‌ఫోన్ల చోరీ వీరి పని. ఈ ముఠాల్లో అప్పులు తీసుకున్న మహిళలు కూడా ఉన్నారు. వీరు తమ చిన్నారులతో కలిసి బంగారం, ఇతర దుకాణాలకు వెళ్లి, యజమానులు వర్కర్ల దృష్టి మళ్లించి చోరీలు చేస్తుంటారు. వీరు ప్రతిరోజూ నిర్దిష్ట సంఖ్యలో చోరీలు చేయాలనే షరతు ఉంది. కాగా చోరీ చేసిన సొత్తులో కొంత మొత్తం వారి అప్పులో అసలు, వడ్డీ జమ చేసుకుంటారు. ఇలా అప్పు తీరే వరకు వీరంతా ముఠా నాయకుల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి నగరంలో పలు ముఠాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కక్ష కట్టి, సెటిల్‌మెంట్ అంటూ పిలిచి..
ఇలాంటి కొన్ని ముఠాలపై ఈశ్వర్ గుత్తాధిపత్యం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నగరంలో మరే ఇతర ముఠాకు ‘పనివారు’ దొరకుండా చేస్తున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆధిపత్య పోరు పెరిగిపోగా ఎవరైనా అతికష్టమ్మీద వేరే ప్రాంతం నుంచి దొంగల్ని పట్టుకుని వస్తే, ఈశ్వర్ తనకున్న పాత పరిచయాల ద్వారా పోలీసులకు సమాచారం చేరవేస్తూ వాళ్లు అరెస్టు అయ్యేలా చేస్తున్నాడు. దీంతో కక్షకట్టిన నాలుగు ముఠాలకు చెందిన నాయకులు అతనిపై హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.
గురువారం మందమల్లమ్మ చౌరస్తాలోని ఓ బార్‌కు అతన్ని పిలిచిన నలుగురు నిందితులు.. కొద్దిసేపు వాగ్వాదం తర్వాత తమ ప్రతిపాదనల్ని తిరస్కరించి, బెదిరించి వెళ్లిపోతున్న ఈశ్వర్‌పై కారుతో ఢీ కొట్టి హత్యాయత్నం చేసినట్లు తెలిసింది. అయితే కొందరు వ్యక్తులు చిట్టీల వ్యాపారంలో విభేదాల వల్లే ఈశ్వర్‌పై హత్యాయత్నం చేశామంటూ మీర్‌పేట పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలుస్తోంది. దీంతో రాచకొండ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment