విశాఖపట్నం: జీవీఎంసీ 68వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన క్రికెటర్ సోముదల ఈశ్వర్(40) కన్నుమూశారు. ఆగస్టు 28వ తేదీనే ఆయన గుండెపోటుతో మృతి చెందగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
విశాఖలో డివిజన్ క్రికెట్ ఆడుతూనే ఈశ్వర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏసీఏకు చేదోడు వాదోడుగానూ ఉంటూ.. టోర్నీల నిర్వహణలో సహాయం అందించేవాడు. అలా ఆయన ప్రతిభ ఐపీఎల్‌కు తాకింది. ఎడమ చేతి వాటం బౌలర్ అయిన ఈశ్వర్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్లకు నెట్స్‌లో బంతులు విసిరేందుకు సహాయకుడిగా చేరాడు.
ఐపీఎల్‌లో సపోర్టింగ్ స్టాఫ్‌గా ప్రస్థానం కొనసాగిస్తూనే.. విశాఖలో జరిగిన ఏపీఎల్ సీజన్ పాల్గొన్నాడు. ఇటీవల ఏపీఎల్ సీజన్ ముగియడంతో అప్పన్నకాలనీలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ నెల 28న స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చాడు. బైక్ దిగి స్టాండ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తల్లి రాములమ్మ తెలిపారు. ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడని బోరున విలపించారు. ఈ వార్త విన్న భారత క్రికెటర్ శ్రీకర్ భరత్.. ఈశ్వర్ ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈశ్వర్‌కు వివాహం కాలేదు.
క్రికెటర్ వేణుగోపాల్‌తో సాన్నిహిత్యం
తన 16వ ఏటనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈశ్వర్‌కు పేదరికం వెంటాడింది. 10వ తరగతి వరకు చదువుకున్న ఈశ్వర్ క్రికెట్టే ప్రపంచంగా భావించాడు. క్రికెటర్ వేణుగోపాల్, ఈశ్వర్ ఇద్దరూ రంజీ సెలక్షన్‌కు వెళ్లారు. వేణుగోపాల్ రంజీకి ఎంపిక కాగా.. ఈశ్వర్‌కు నిరాశే మిగిలింది. అయినా ఏనాడు కుంగిపోలేదు. ఈ క్రమంలో ఈశ్వర్‌పై అభిమానం పెంచుకున్న వేణుగోపాల్ తనతో పాటు పలు మ్యాచ్‌లకు తీసుకువెళ్లేవాడు. ఈశ్వర్ ఫాస్ట్ బౌలర్. గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఈశ్వర్ బౌలింగ్ అంటే భారత క్రికెటర్లకు ఎంతో ఇష్టం.
అందుకే స్టార్ క్రికెటర్లు ఆయనతో బౌలింగ్ వేయించుకుని నెట్ ప్రాక్టీస్ చేసేవారు. దీంతో ఈశ్వర్‌కు ఎక్కువగా భారత క్రికెట్ క్యాంపుల్లో అవకాశం దక్కేది. అలా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రికీ పాటింగ్, డేవిడ్ వార్నర్.. తదితర ఎంతో మంది క్రికెటర్లకు అభిమానిగా మారాడు. ఈశ్వర్‌ను ఎక్సట్రా ప్లేయర్‌గా అన్ని విషయాల్లో సమానంగా చూసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మరణవార్త తెలుసుకున్న క్రికెటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈశ్వర్ మృతి బాధాకరం
నేనూ ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు ప్రస్తుత సీజన్ ఐపీఎల్‌లో ఆడాను. జట్టుతో పాటు ప్రాక్టీస్ చేసేప్పుడు ఈశ్వర్ నెట్స్‌లో బంతులు విసిరేవాడు. ఇద్దరం విశాఖ వాసులమే కావడంతో తొలినాళ్ల నుంచి అతనితో పరిచయం ఉంది. అతను అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరం.
– భరత్, భారత టెస్ట్ క్రికెటర్
ప్రగాఢ సానుభూతి
మా అన్ని శిక్షణ సెషన్స్, మ్యాచ్‌ల్లో జట్టుకు సహాయకారిగా ఉన్న ఈశ్వర్‌ను మిస్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మా ప్రియమైన సైడ్ ఆర్మ్ స్పెషలిస్ట్ ఈశ్వర్ ఇకలేరు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
– ఢిల్లీ కాపిటల్స్ మేనేజ్‌మెంట్
Comments
Please login to add a commentAdd a comment