Delhi capital
-
తీవ్ర విషాదం.. క్రికెటర్ ఈశ్వర్ ఇకలేరు
విశాఖపట్నం: జీవీఎంసీ 68వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన క్రికెటర్ సోముదల ఈశ్వర్(40) కన్నుమూశారు. ఆగస్టు 28వ తేదీనే ఆయన గుండెపోటుతో మృతి చెందగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాఖలో డివిజన్ క్రికెట్ ఆడుతూనే ఈశ్వర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏసీఏకు చేదోడు వాదోడుగానూ ఉంటూ.. టోర్నీల నిర్వహణలో సహాయం అందించేవాడు. అలా ఆయన ప్రతిభ ఐపీఎల్‌కు తాకింది. ఎడమ చేతి వాటం బౌలర్ అయిన ఈశ్వర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్లకు నెట్స్‌లో బంతులు విసిరేందుకు సహాయకుడిగా చేరాడు. ఐపీఎల్లో సపోర్టింగ్ స్టాఫ్‌గా ప్రస్థానం కొనసాగిస్తూనే.. విశాఖలో జరిగిన ఏపీఎల్ సీజన్ పాల్గొన్నాడు. ఇటీవల ఏపీఎల్ సీజన్ ముగియడంతో అప్పన్నకాలనీలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ నెల 28న స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చాడు. బైక్ దిగి స్టాండ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తల్లి రాములమ్మ తెలిపారు. ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడని బోరున విలపించారు. ఈ వార్త విన్న భారత క్రికెటర్ శ్రీకర్ భరత్.. ఈశ్వర్ ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈశ్వర్‌కు వివాహం కాలేదు. క్రికెటర్ వేణుగోపాల్‌తో సాన్నిహిత్యం తన 16వ ఏటనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈశ్వర్‌కు పేదరికం వెంటాడింది. 10వ తరగతి వరకు చదువుకున్న ఈశ్వర్ క్రికెట్టే ప్రపంచంగా భావించాడు. క్రికెటర్ వేణుగోపాల్, ఈశ్వర్ ఇద్దరూ రంజీ సెలక్షన్‌కు వెళ్లారు. వేణుగోపాల్ రంజీకి ఎంపిక కాగా.. ఈశ్వర్‌కు నిరాశే మిగిలింది. అయినా ఏనాడు కుంగిపోలేదు. ఈ క్రమంలో ఈశ్వర్‌పై అభిమానం పెంచుకున్న వేణుగోపాల్ తనతో పాటు పలు మ్యాచ్‌లకు తీసుకువెళ్లేవాడు. ఈశ్వర్ ఫాస్ట్ బౌలర్. గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఈశ్వర్ బౌలింగ్ అంటే భారత క్రికెటర్లకు ఎంతో ఇష్టం. అందుకే స్టార్ క్రికెటర్లు ఆయనతో బౌలింగ్ వేయించుకుని నెట్ ప్రాక్టీస్ చేసేవారు. దీంతో ఈశ్వర్‌కు ఎక్కువగా భారత క్రికెట్ క్యాంపుల్లో అవకాశం దక్కేది. అలా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రికీ పాటింగ్, డేవిడ్ వార్నర్.. తదితర ఎంతో మంది క్రికెటర్లకు అభిమానిగా మారాడు. ఈశ్వర్‌ను ఎక్సట్రా ప్లేయర్‌గా అన్ని విషయాల్లో సమానంగా చూసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మరణవార్త తెలుసుకున్న క్రికెటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మృతి బాధాకరం నేనూ ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు ప్రస్తుత సీజన్ ఐపీఎల్లో ఆడాను. జట్టుతో పాటు ప్రాక్టీస్ చేసేప్పుడు ఈశ్వర్ నెట్స్‌లో బంతులు విసిరేవాడు. ఇద్దరం విశాఖ వాసులమే కావడంతో తొలినాళ్ల నుంచి అతనితో పరిచయం ఉంది. అతను అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరం. – భరత్, భారత టెస్ట్ క్రికెటర్ ప్రగాఢ సానుభూతి మా అన్ని శిక్షణ సెషన్స్, మ్యాచ్‌ల్లో జట్టుకు సహాయకారిగా ఉన్న ఈశ్వర్‌ను మిస్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మా ప్రియమైన సైడ్ ఆర్మ్ స్పెషలిస్ట్ ఈశ్వర్ ఇకలేరు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. – ఢిల్లీ కాపిటల్స్ మేనేజ్మెంట్ -
ఉప్పల్‌లో మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం (ఫొటోలు)
-
వారి వల్లే మేం ఫైనల్‌కు వచ్చాం: ధోనీ
వైజాగ్ : ఎంఎస్ ధోనీ మరోసారి తానేంటో నిరూపించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో డ్యాడ్స్ ఆర్మీగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మరోసారి ఫైనల్‌కు చేర్చాడు. వైజాగ్‌లో శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరు వికెట్లతో సునాయస విజయాన్ని అందుకోవడం ద్వారా చెన్నై జట్టు ఎనిమిదిసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న ధోనీ సేన.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లకు 147 పరుగులకు పరిమితం చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. డు ప్లెసిస్, షేన్ వాట్సన్ అర్ధ సెంచరీలతో రాణించడంతో అలవోకగా విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. ఈ సీజన్లో చెన్నై జట్టు మంచి ప్రదర్శనకు, ఫైనల్‌కు చేరడానికి బౌలర్లే కారణమని ప్రశంసల జల్లు కురిపించారు. ‘వికెట్లు పడగొట్టడమే మ్యాచ్‌లో అత్యంత కీలకం. కాబట్టి బౌలర్లకే క్రెడిట్ ఇవ్వాల్సిందే. తనకు ఏం కావాలన్నది కెప్టెన్ అడుగుతాడు. దానిని బట్టి బౌలర్లు ఎలా బౌలింగ్‌చేయాలి, ఎలా వికెట్లు తీయాలి అన్నది నిర్ణయించుకుంటారు. ఈ సీజన్లో మేం ఇక్కడ ఉన్నామంటే అందుకే బౌలర్లే కారణం. మా బౌలింగ్ డిపార్ట్మెంట్కు థాంక్స్ చెప్తున్నా’ అని ధోనీ వివరించారు. ఐపీఎల్ 12వ సీజన్లో ఫైనల్‌కు చేరుకున్న చెన్నై జట్టు ఆదివారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ‘గత ఏడాది కన్నా భిన్నంగా ఈ సారి ఐపీఎల్ ఫైనల్‌కు వచ్చాం. గత మ్యాచ్‌లో పరుగుల విషయంలో, క్యాచ్‌ల విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. కానీ గట్టిగా కమ్‌బ్యాక్ ఇచ్చాం. 140కిపైగా పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించడం ఆనందంగా ఉంది. మా బౌలర్ల కృషి కూడా చాలా బావుంది. ఢిల్లీని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగాం. వాళ్ల బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఓపెనర్లను త్వరగా ఔట్ చేయడం చాలా ముఖ్యంగా భావించాం. ఢిల్లీలో లెఫ్ట్ హ్యాండర్స్ చాలామంది ఉన్నారు. వారిని కట్టడి చేసేందుకు మా దగ్గర ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ను వాడాం. మైదానం చిన్నగా ఉండటంతో త్వరగా వికెట్లు రాబట్టడం కీలకంగా భావించాం’ అని ధోనీ తెలిపారు. -
ఫైనల్దారిలో...
ఐపీఎల్ తుది అంకంలో సెమీ ఫైనల్ మ్యాచ్. బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్దపెద్ద స్టార్లు లేకున్నా ఒక్కో మెట్టు ఎక్కుతూ నాకౌట్ దశకు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్... కొంత తడబడినా హిట్టర్లు, ఫలితాన్ని మార్చేయగల మొనగాళ్లతో కూడిన, తక్కువ అంచనా వేయలేని చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖ నగరంలో శుక్రవారం క్వాలిఫయర్ –2 మ్యాచ్. ఇప్పటికే ఇక్కడ ఒక మ్యాచ్ ఆడిన అనుభవంతో ఉన్న ఢిల్లీ ఆ అనుకూలతను సద్వినియోగం చేసుకుని ఫైనల్ బెర్తు కొట్టేస్తుందో? తమ శక్తియుక్తులను కూడదీసుకుని చెన్నై పైచేయి సాధిస్తుందో చూడాలి. ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లలో ఒత్తిడిని గట్టెక్కిన అనుభవం ఉన్న ధోని బృందానికి, కుర్రాళ్లతో నిండిన అయ్యర్ జట్టు ఎంతటి పోటీ ఇస్తుందో అనేది ఆసక్తికరం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అసలు ప్లే ఆఫ్స్ చేరుతుందని భావించని ఢిల్లీకి, క్వాలిఫయర్–2 ఆడాల్సి వస్తుందని ఊహించని చెన్నైకి మధ్య ఐపీఎల్–12 ఫైనల్ బెర్తు కోసం శుక్రవారం ఇక్కడి డా.వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ మైదానం వేదికగా సమరం జరుగనుంది. లీగ్ చరిత్రలో తొలిసారి నాకౌట్ దశలో మ్యాచ్ గెలిచిన ఊపులో ఉన్న ఢిల్లీ... అదే జోరులో తుది పోరాటానికి అర్హత సాధించాలని భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఎదురైన పరాజయాల నుంచి తేరుకుని ఫైనల్ చేరాలని చెన్నై పట్టుదలగా ఉంది. సీనియర్ శిఖర్ ధావన్‌కు తోడు ఢిల్లీ యువ బ్యాటింగ్ త్రయం పృథ్వీ షా–కెప్టెన్ శ్రేయస్ అయ్యర్–రిషభ్ పంత్, చెన్నై స్పిన్ త్రయం తాహిర్–హర్భజన్–జడేజాలలో ఎవరు రాణిస్తే మ్యాచ్ వారి పరమవుతుంది. కుర్రాళ్లు కుమ్మేస్తేనే... కీలక సమయంలో ఓపెనర్ పృథ్వీ ఫామ్‌లోకి రావడం ఢిల్లీని సంతోషపరిచే అంశం. ధావన్ కూడా రాణిస్తే జట్టు ఇన్నింగ్స్‌కు మంచి పునాది పడుతుంది. తర్వాత సంగతిని అయ్యర్, పంత్ చూసుకుంటారు. అయితే, అయ్యర్ అంచనాలకు తగ్గట్లు స్కోరు చేయడం లేదు. ఈ నలుగురి అనంతరం సరైన బ్యాట్స్‌మన్ లేకపోవడం మరో లోటు. నాలుగో స్థానం నుంచి ఏడో స్థానం మధ్య జట్టు బ్యాట్స్‌మన్ సగటు 20.5 కావడమే దీనికి నిదర్శనం. ఇంగ్రామ్, మున్రో ఇద్దరూ ధాటిగా ఆడగలవారే. సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లో మున్రోను తీసుకున్నారు. అతడినే కొనసాగిస్తారా? లేక ఇంగ్రామ్‌ను తీసుకుంటారా? అనేది చూడాలి. అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్‌లతో ఢిల్లీ స్పిన్ పటిష్ఠంగా ఉంది. గత మ్యాచ్‌లో మిశ్రా బౌలింగే ఫలితాన్ని ప్రభావితం చేసింది. బ్యాట్‌తోనూ రాణించే క్రిస్ మోరిస్‌ను ట్రెంట్ బౌల్ట్ స్థానంలో ఆడించే వీలుంది. ఇషాంత్ లయ తప్పకుండా, కచ్చితత్వంతో బంతులేస్తుండటం సానుకూలాంశం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, వాటిని సమన్వయం చేసుకుంటూ ఆడే చెన్నైపై నెగ్గాలంటే ఢిల్లీ కాస్తంత ఎక్కువే శ్రమించక తప్పదు. చెన్నై... చేజారకుండా పంజాబ్, ముంబైలతో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో చెన్నై జోరు తగ్గిందనే చెప్పాలి. బ్యాటింగ్ వైఫల్యమే దీనికి ప్రధాన కారణం. క్వాలిఫయర్–1లో అది కూడా సొంతగడ్డపై ముంబైని నిలువరించలేకపోయింది. ఓపెనర్ షేన్ వాట్సన్ ఫామ్ దారుణంగా ఉంది. దీంతో డుప్లెసిస్, రైనాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. కెప్టెన్ ధోని ఆదుకుంటుండటంతో కొంతైనా పోటీ ఇస్తోంది. రాయుడు, మురళీ విజయ్ బ్యాట్ ఝళిపిస్తేనే భారీ స్కోరు చేయగలుగుతుంది. హిట్టింగ్తో స్కోరును పెంచగల బ్రేవోకు బ్యాటింగ్ అవకాశం రావడం లేదు. స్పిన్ త్రయంతో పాటు పేసర్ దీపక్ చహర్ తమ బాధ్యతలు సమర్థంగా నెరవేరుస్తుండటంతో బౌలింగ్‌లో మాత్రం సూపర్ కింగ్స్‌కు తిరుగులేదు. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేస్తే... బౌలింగ్ దన్నుతో చెన్నై బయటపడగలదు. లీగ్ దశలో ఢిల్లీని 99 పరుగులకే చుట్టేసిన తీరే దీనికి ఉదాహరణ. ►ఈ సీజన్లో ధోని చేసిన 405 పరుగుల్లో 213 పరుగులు 18 నుంచి 20వ ఓవర్ మధ్య వచ్చినవే. ►ఢిల్లీ ఆల్‌రౌండర్ మోరిస్ పడగొట్టిన 13 వికెట్లలో 10 వికెట్లు 16 నుంచి 20వ ఓవర్ మధ్య తీసినవే. ► 55 ఐపీఎల్ 12లో చెన్నై స్పిన్నర్లు తీసిన వికెట్ల సంఖ్య. అన్ని సీజన్లలోకెల్లా ఇదే అత్యధికం. తాహిర్–హర్భజన్–జడేజా ముగ్గురూ 12పైగా వికెట్లు సాధించారు. ►148 గత ఆరేళ్లుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ సహా వైజాగ్ మైదానంలో సగటు స్కోరిది. ఇక్కడ స్పిన్నర్ల ఎకానమీ రేట్ 6 కాగా, పేసర్లది 9.6 ►తుది జట్లు (అంచనా) ►చెన్నై: వాట్సన్, డుప్లెసిస్, రైనా, మురళీ విజయ్, రాయుడు, ధోని, జడేజా, బ్రేవో, హర్భజన్, దీపక్ చహర్, తాహిర్ ►ఢిల్లీ: పృథ్వీ, ధావన్, అయ్యర్, పంత్, ఇంగ్రామ్/మున్రో, రూథర్‌ఫర్డ్, అక్షర్, కీమోపాల్, మిశ్రా, మోరిస్/ బౌల్ట్, ఇషాంత్. -
సాగర తీరంలో తాడోపేడో
డేవిడ్ వార్నర్ (692 పరుగులు); కగిసొ రబడ (25 వికెట్లు)... బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఐపీఎల్–12 సీజన్ టాపర్లు వీరు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వార్నర్ ఒంటిచేత్తో ముందుకు నడిపించగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ను పదునైన పేస్‌తో రబడ ఒడ్డున పడేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి గెలిస్తేనే లీగ్‌లో ముందుకెళ్లే అవకాశం ఉన్న స్థితిలో రెండు జట్లూ వీరు లేకుండానే తలపడబోతున్నాయి. బలాబలాలు విశ్లేషించి చూస్తే... బ్యాటింగ్‌లో పటిçష్టంగా ఉన్న ఢిల్లీ ముందు హైదరాబాద్ కొంత డీలాగా కనిపిస్తోంది. కానీ, బౌలింగ్ బలగంతో ప్రత్యర్థిని కట్టిపడేసే సన్‌రైజర్స్ తేలిగ్గా తలొగ్గకపోవచ్చు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పేరుతో పాటు ఆటతీరూ మార్చుకుని ఏడు సీజన్ల తర్వాత ప్లే ఆఫ్ చేరిన ఢిల్లీ... గతేడాది రన్నరప్ హైదరాబాద్ సాగరతీరాన అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐపీఎల్–12లో భాగంగా బుధవారం రెండు జట్ల మధ్య ఇక్కడి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ టాపార్డర్ బ్యాటింగ్ బలంగా ఉంటే, హైదరాబాద్ బౌలింగ్‌లో మెరుగ్గా కనిపిస్తోంది. లీగ్ దశలో రెండు జట్ల ప్రయాణం భిన్నంగా సాగింది. ఢిల్లీ పెద్దగా కష్టపడకుండానే ప్లే ఆఫ్స్ చేరగా, సన్‌రైజర్స్‌కు అదృష్టం తోడై బయటపడింది. అనూహ్యంగా మారిన వేదికపై కీలకమైన మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి. అదే హైదరా‘బాధ’... ముందు బెయిర్‌స్టో, తర్వాత వార్నర్ దూరమవడం, ప్రత్యామ్నాయంగా షకీబుల్ హసన్ వంటి నాణ్యమైన ఆల్‌రౌండర్ కూడా అందుబాటులో లేకపోవడంతో సన్‌రైజర్స్ ఒక్కసారిగా సాధారణ జట్టులా మారిపోయింది. ఈ విధ్వంసక బ్యాట్స్‌మెన్‌కు తోడు భువనేశ్వర్, రషీద్ ఖాన్ వంటి బౌలర్లతో ఓ దశలో హైదరాబాద్ అత్యంత పటిష్ఠంగా కనిపించింది. ఎప్పుడైతే ఓపెనర్లు వెళ్లిపోయారో అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. నెట్ రన్‌రేట్ ఆదుకోవడంతో లీగ్ చరిత్రలో తొలిసారిగా 12 పాయింట్లతోనే ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈ రన్‌రేట్ కూడా వార్నర్, బెయిర్‌స్టోల దూకుడైన ఆట పుణ్యమే. ఇప్పుడు ఈ బలహీనతలన్నీ అధిగమించి ముందుకెళ్లాల్సి ఉంది. ఇన్నింగ్స్‌ను ప్రారంభించే గప్టిల్, వృద్ధిమాన్ సాహాలపై పెద్ద బాధ్యతే ఉంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే, నాలుగో స్థానంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్ సానుకూలాంశం. వీరి తర్వాత విజయ్ శంకర్, నబీ, యూసుఫ్ పఠాన్ స్కోరును నడిపించాలి. భువీ పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నా, మిస్టరీ స్పిన్నర్ రషీద్‌ను ప్రత్యర్థులు బాదేస్తున్నారు. కీలకమైన మ్యాచ్‌లో అతడు తిరిగి లయ అందుకుంటే జట్టుకు మేలు. పేసర్లు థంపి, ఖలీల్ మెరుగ్గా రాణిస్తున్నారు. విజయ్ మాత్రం పరుగులిస్తున్నాడు. ఫీల్డింగ్‌లో జట్టుకు తిరుగులేదు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ముంచి నా తేల్చినా అంతా బ్యాట్స్‌మెన్ చేతుల్లోనే. ఢిల్లీ ఢీకొట్టేలా... గతేడాది వరకు హైదరాబాద్‌కు ఆడిన శిఖర్ ధావన్... ఈసారి ఢిల్లీ ఫ్లే ఆఫ్స్ చేరడంలో కీలకంగా నిలిచాడు. యువ ఓపెనర్ పృథ్వీ షా తడబడుతున్నా ధావన్ జోరుతో ఆ ప్రభావం కనిపించడం లేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే భారీ స్కోరు ఖాయం. వీరు విఫలమైతేనే ఇబ్బందికరం. హిట్టర్లయినప్పటికీ నిలకడ కొరవడిన ఇంగ్రామ్, రూథర్ఫర్డ్ల నుంచి ఎక్కువ ఆశించలేం. బౌలింగ్‌లో రబడ లోటును ఎడమ చేతివాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ పూడ్చాడు. ఇషాంత్ కచ్చితత్వం చూపుతున్నాడు. అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా స్పిన్ ప్రభావవంతంగా ఉంది. జట్టులోని వారు ఏదో ఒక దశలో గట్టెక్కిస్తుండటంతో ఢిల్లీ ఇక్కడివరకు వచ్చింది. బ్యాటింగ్ త్రయం (ధావన్–అయ్యర్–పంత్) చెలరేగితే ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటుంది. విశాఖ వాసులకు భలే ఛాన్సులే అందాల విశాఖపట్నం వాసులకు ప్లే ఆఫ్ మ్యాచ్‌ల నిర్వహణ రూపంలో ఐపీఎల్ మెరుపులను చూసే భాగ్యం దక్కింది. లీగ్‌కు సంబంధించి... మామూలు పరిస్థితుల్లో అయినా ఇక్కడ మ్యాచ్‌లు జరిగే అవకాశం లేదు. కానీ, చెన్నై స్టేడియంలో స్టాండ్స్ వివాదం కారణంగా అనూహ్యంగా వైజాగ్ నాకౌట్ మ్యాచ్‌లకు వేదికైంది. పైగా ఒకటి కాదు రెండు మ్యాచ్‌లు అవి కూడా కీలకమైనవి జరుగనుండటంతో స్థానికుల ఆనందం, ఉత్సాహం రెట్టింపవుతోంది. అన్నింటికి మించి వాతావరణం పూర్తి ప్రశాంతంగా ఉండే వేళ రాత్రి 7.30కు మ్యాచ్‌లు ప్రారంభం కానుండంతో నగర వాసులు వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరే కీలకం విలియమ్సన్ పిచ్‌తో సంబంధం లేకుండా పరుగులు సాధించే విలియమ్సన్... సంప్రదాయ షాట్లతో అంతే వేగంగా చాప కింద నీరులా స్కోరును నడిపిస్తాడు. గత మ్యాచ్‌లో బెంగళూరుపై చివరి వరకు నిలిచి దీనిని మరోసారి నిరూపించాడు. మనీశ్ పాండే కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. వరుసగా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇతడిని వన్‌డౌన్‌లో పంపడం జట్టుకు మేలు చేసింది. దూకుడుగానూ ఆడగలడు. భువనేశ్వర్ మిగతా ఇద్దరు పేసర్లు సందీప్ శర్మ, సిద్ధార్థ కౌల్ ఈసారి విఫలమైనా భువనేశ్వర్ మాత్రం ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగానే పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లు (11) మాత్రం తక్కువ తీశాడు. రషీద్ ఈ సీజన్లో 15 వికెట్లు పడగొట్టాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులకు లొంగినా మొత్తమ్మీద ఇతడి బౌలింగ్ ఆడటం కష్టమే. ధావన్ ఫ్రాంచైజీ మారినా, బ్యాటింగ్‌లో అదే నిలకడ చూపుతూ ఈ సీజన్లో 450 పరుగులు చేశాడు. పవర్ ప్లే ఓవర్లలో చకచకా పరుగులు సాధిస్తున్నాడు. అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ 442 పైగా పరుగులు చేశాడు. కొన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ దూకుడైన బ్యాటింగ్‌తో ఫలితాన్ని మార్చేసే పంత్... ఎంత ఎక్కువసేపు క్రీజులో ఉంటే ప్రత్యర్థులకు అంత నష్టం. ఈ సీజన్లో 401 పరుగులు చేశాడు. అమిత్ మిశ్రా ఐపీఎల్లో 150కిపైగా వికెట్లు తీసిన ఈ వెటరన్ లెగ్ స్పిన్నర్ మ్యాచ్ మలుపుతిప్పే స్పెల్ వేయగలడు. -
నేడు ముంబై , ఢిల్లీ ఫిరోజ్ షాకోట్ల మైనదానంలో మ్యాచ్
-
ఢిల్లీ గర్జన
కోల్‌కతా గడ్డ ఈడెన్‌లో ఢిల్లీ గర్జించింది. శిఖర్ ధావన్ తన జట్టు గెలిచేదాకా నిలవగా, అతనికి రిషభ్ పంత్ చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో స్పిన్, పేస్ తేడా లేకుండా ప్రతీ బౌలర్‌ను వీరిద్దరు సమర్థంగా ఎదుర్కోవడంతో ఢిల్లీ అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్‌కతా: చాన్నాళ్ల తర్వాత శిఖర్ ధావన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. గెలిచే దాకా క్రీజు వీడకుండా పోరాడాడు. దీంతో శుక్రవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధిం చాడు. రసెల్ (21 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (63 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. రాణించిన శుబ్‌మన్ టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా తొలి బంతికే ఓపెనర్ జో డెన్లీ (0) వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ బౌలింగ్‌లో అతను డకౌటయ్యాడు. మరోవైపు ఐపీఎల్లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన శుబ్‌మన్ గిల్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రాబిన్ ఉతప్ప (30 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రబడా వేసిన నాలుగో ఓవర్లో ఉతప్ప మూడు బౌండరీలతో స్కోరుకు ఊపుతెచ్చాడు. ఆ మరుసటి ఓవర్లో ఇషాంత్ బౌలింగ్‌లో శుబ్‌మన్ 2 ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 41/1. కీమో పాల్ బౌలింగ్‌లో రాబిన్ సిక్స్ బాదగా, శుబ్‌మన్ ఫోర్ కొట్టాడు. కానీ ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడు ఓవర్ల వ్యవధిలో రాబిన్ వికెట్‌ను కోల్పోయిన నైట్‌రైడర్స్ 14 పరుగులే చేసింది. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 72/2 స్కోరు చేసింది. శుబ్‌మన్ 34 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. రసెల్ సిక్సర్లు రసెల్‌కు ఈ మ్యాచ్‌లో కాస్త ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశమిచ్చారు. 13వ ఓవర్లో నితీశ్ రాణా (11)ను మోరిస్ ఔట్ చేయడంతో క్రీజ్‌లోకి వచ్చాడు. ఇతను రాగానే జట్టు స్కోరు వందకు చేరింది. కానీ క్రీజ్‌లో పాతుకుపోయిన శుబ్‌మన్, కెప్టెన్ కార్తీక్ (2) నిష్క్రమించారు. ఆ తర్వాత రసెల్ జోరు పెంచాడు. మోరిస్, రబడ బౌలింగ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో 18 పరుగులే సాధ్యమయ్యాయి. ధనాధన్‌తో మొదలై... లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తొలి ఓవర్లో ఒక పరుగే చేసింది. కానీ రెండో ఓవర్ నుంచి ధనాధన్ మొదలైంది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో పృథ్వీ షా (7 బంతుల్లో 14; 2 సిక్స్‌లు) రెండు భారీ సిక్సర్లు బాదాడు. ప్రసిధ్ కృష్ణ మరుసటి ఓవర్లో ధావన్ 2 సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. అయితే 17 పరుగులు వచ్చిన ఇదే ఓవర్ చివరి బంతికి పృథ్వీ షా ఔటయ్యాడు. ధావన్ మాత్రం తన జోరు తగ్గించలేదు. ఈ సారి రసెల్ బౌలింగ్ చేయగా మూడు బౌండరీలు బాదాడు. దీంతో ఢిల్లీ 4.4 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. ఆరో ఓవర్ వేసిన రసెల్ 2 పరుగులిచ్చి శ్రేయస్ అయ్యర్ (6)ను పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (31 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధావన్ జాగ్రత్తగా ఆడటంతో మధ్యలో కొన్ని ఓవర్లు పరుగుల్ని కట్టడి చేశాయి. మళ్లీ పదో ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన ధావన్ 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 2 వికెట్లను కోల్పోయి 88 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ స్పిన్నర్లను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. శిఖర్–రిషబ్లిద్దరు మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. గెలుపుతీరం వద్ద పంత్ నిష్క్రమించగా, ఇంగ్రామ్ (6 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడి సిక్సర్‌తో ముగించాడు. టి20 కెరీర్లో తొలి సెంచరీని చేజార్చుకున్న ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు (97 నాటౌట్) నమోదు చేశాడు. -
ప్రతిరోజూ ఓటమికి సాకులు చెప్పలేం : కోహ్లి
తొలి మ్యాచ్... రెండో మ్యాచ్... కనీసం మూడో మ్యాచ్... నాలుగోదైనా...పోనీ ఐదో మ్యాచ్... వరుసగా ఆరోమ్యాచ్‌లోనూ బెంగళూరు కథ మారలేదు. ఒక్క గెలుపు కోసం ఆశగా ఎదురు చూస్తోన్న ఆ జట్టుకు నిరీక్షణ తప్పేలా లేదు. నిలకడ లేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్‌తో వరుసగా ఆరోసారి కోహ్లిసేన ఓటమి పాలైంది. మరోవైపు రెండు ఓటముల తర్వాత ఢిల్లీకి స్ఫూర్తిదాయక విజయం దక్కింది. శ్రేయస్ అయ్యర్‌కు తోడు బౌలర్లు రాణించడంతో ఢిల్లీ మళ్లీ గెలుపుబాట పట్టింది. బెంగళూరు: బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో తేలిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని ఆహ్వానించింది. సొంతగడ్డపై ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (33 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మొయిన్ అలీ (18 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రబడ 4 కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, మోరిస్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. పృథ్వీ షా (22 బంతుల్లో 28; 5 ఫోర్లు) రాణించాడు. ప్రతీ ఏడాది తరహాలోనే ఈ సారి కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఆకుపచ్చ రంగు జెర్సీలతో బరిలో దిగింది. తేలిపోయిన బ్యాట్స్‌మెన్... గత మ్యాచ్‌లో అదరగొట్టిన బెంగళూరు బ్యాట్స్‌మన్ ఈ మ్యాచ్‌లో తడబడ్డారు. ఢిల్లీ బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేయడంతో పెద్దగా మెరుపుల్లేకుండానే బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసిన రాయల్ చాలెంజర్స్... ఆ తర్వాత మరీ ఘోరంగా ఆడింది. అంతకుముందు సిక్స్‌తో అలరించిన డివిలియర్స్ రనౌటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. కానీ కొద్దిసేపటికే మరో బౌండరీ బాది రబడ బౌలింగ్‌లో ఇంగ్రామ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్టొయినిస్ (15) క్రీజులో నిలవలేకపోయాడు. మొయిన్ అలీ ఒక్కడే వేగంగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ లమిచానే అతని ఆటలు సాగనివ్వలేదు. ఇషాంత్ బౌలింగ్‌లో 6, 4 బాదిన అలీ.. అక్షర్, లమిచానే ఓవర్లలోనూ రెండు సిక్సర్లతో చెలరేగాడు. అనంతరం రబడ విజృంభించడంతో ఒకే ఓవర్లో కోహ్లి, అ„Š దీప్ నాథ్ (19), నేగి (0) వికెట్లను కోల్పోయి బెంగళూరు కష్టాల్లో పడింది. కీలకమైన చివరి 18 బంతుల్లో బెంగళూరు కేవలం 16 పరుగులే చేసి సాధారణ స్కోరుకే పరిమితమైంది. అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ బెంగళూరు బౌలర్ల తీరుతో లక్ష్యఛేదనలో ఢిల్లీకి ఏ దశలోనూ ఇబ్బంది ఎదురు కాలేదు. ఆరంభలోనే ధావన్ (0) పెవిలియన్ చేరాడు. అయితే పృథ్వీ షాతో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్ నడిపించాడు. సౌతీ ఓవర్లో వరుసగా 4 ఫోర్లతో పృథ్వీ చెలరేగాడు. తొలి ఓవర్లోనే పార్థివ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అయ్యర్ కూడా ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 53 పరుగులు చేసింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించాక నేగి బౌలింగ్‌లో పృథ్వీ ఔటయ్యాడు. అయ్యర్‌కు జతకూడిన ఇంగ్రామ్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) మంచి స్ట్రోక్ ప్లేతో అలరించాడు. నేగి బౌలింగ్‌లో 6, 4 బాది 14 పరుగులు రాబట్టాడు. చహల్ బౌలింగ్‌లోనూ ఓ ఫోర్ రాబట్టిన అతను వికెట్ల ముందు మొయిన్అలీకి దొరికిపోయాడు. మరోవైపు అయ్యర్ 37 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. తర్వాత ప్రతి ఓవర్‌కు కనీసం ఒక బౌండరీ అయిన బాదుతూ ఢిల్లీ లక్ష్యం దిశగా సాగింది. చివరి 5 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సి ఉండగా చహల్ బౌలింగ్‌లో అయ్యర్ సిక్స్, పంత్ ఫోర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. దీంతో విజయానికి 18 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో అయ్యర్, మోరిస్ (0), పంత్ (18) ఔటైనా ఢిల్లీ విజయాన్ని అందుకుంది. కోహ్లి ఉన్నా... లేనట్టే ఈ మ్యాచ్‌లో కోహ్లి ఇన్నింగ్స్ విచిత్రంగా సాగింది. పార్థివ్ (9)తో కలిసి ఓపెనింగ్ చేసిన అతను ఎప్పుడు లేని విధంగా చాలా నెమ్మదిగా ఆడాడు. 15వ ఓవర్ ముగిసేవరకు కూడా కోహ్లి కేవలం 27 బంతులే ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. పవర్‌ప్లేలో కూడా అతను 11 బంతులే ఆడాడు. గతంలో ఎప్పుడూ ఇలా జరుగలేదు. దీంతో మ్యాచ్‌లో అతను ఉన్నా లేనట్టే అనిపించింది. రెండో ఓవర్లో మోరిస్ బౌలింగ్‌లో ఒక బౌండరీ బాదిన కోహ్లి... పదిహేడో ఓవర్ చివర్లో గానీ మళ్లీ బౌండరీ జోలికి పోలేదు. లమిచానే వేసిన ఈ ఓవర్లో రెండు సిక్స్‌లతో జోరు పెంచిన అతను మరుసటి ఓవర్లోనే రబడకు దొరికిపోయాడు. దీంతో డెత్ ఓవర్లలో ధాటిగా ఆడాలనుకున్న అతని వ్యూహం ఫలించలేదు. ►ప్రతీ రోజు ఓటమికి సాకులు చెప్పలేము. బుర్రంతా చెత్తతో నిండి ఉంటే మన వద్దకు వచ్చిన అవకాశాలు కూడా ఉపయోగించుకోలేం. శ్రేయస్ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో. అందరం బాధ్యతగా ఆడాలని ఎంతగా చెప్పినా ఇప్పటి వరకు అది జరగడం లేదనేది వాస్తవం. ఈ సీజన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జట్టుకు అవసరమైన రోజే మేం రాణించలేకపోతున్నాం’ విరాట్ కోహ్లి -
కోల్‌కతాను ఆపతరమా!
కీలక పోరులో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్న వేళ... గత మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ తమ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడి చావబాదిన తీరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును వెంటాడుతూనే ఉంటుంది. ఢిల్లీకి కూడా తమ సొంత సమస్యలు ఉండటం ఒక్కటే బెంగళూరుకు కాస్త ఊరటనిచ్చే విషయం. తమ బ్యాట్స్‌మెన్ చెత్త షాట్లు ఆడటంతో తక్కువ స్కోరుకే పరిమితమై సన్‌రైజర్స్‌కు మ్యాచ్ సమర్పించుకుంటే ఆ జట్టు పిచ్‌ను నిందిస్తోంది. నిజాయితీగా తమ లోపాలను గుర్తించి సరిదిద్దుకునే బదులు పిచ్‌ను తిట్టి ప్రధాన అంశాన్ని పక్కదోవ పట్టించడం చూస్తే ‘పని చేతకానివాడు తమ పనిముట్లను తప్పు పట్టాడట’...అనే పాతకాలం సామెత నాకు గుర్తుకొస్తోంది. అసలు వారు ఆడిన షాట్లు చూశారా! ఆ తర్వాత ఐదు వికెట్లు తీసిన తర్వాత కూడా ఒత్తిడి పెంచకుండా పస లేని బౌలింగ్‌తో వారు హైదరాబాద్‌కు కోలుకునే అవకాశం కల్పించారు. బెంగళూరులో బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన పిచ్‌పై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు చెలరేగడంతో 400కు పైగా పరుగులు రావడం అభినందించదగ్గ విషయం. పిచ్ ఇక ముందు కూడా మారకపోవచ్చు. కాబట్టి కోహ్లి టాస్ గెలిచి ఛేదనకు మొగ్గు చూపాలని బెంగళూరు అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా జట్టు బౌలర్లు నిలబెట్టలేకపోతున్నారు. సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే ఇక్కడి అదనపు బౌన్స్ రబడ, మోరిస్‌లకు సహకరించవచ్చు. ఓటమి దిశగా వెళుతున్న సమయంలో రసెల్ భీకర బ్యాటింగ్‌తో మ్యాచ్ గెలుచుకున్న అనంతరం కోల్‌కతా జట్టులో జోరు మరింత పెరిగింది. ఇలాంటి సమయంలో ఆ జట్టు తో రాజస్తాన్ రాయల్స్‌కు పోరాటం తప్పదు. రాయ ల్స్ పవర్‌ప్లేలో మరింత సానుకూలంగా ఆడితే మం చిది. ఇప్పటి వరకు చెలరేగని స్మిత్, స్టోక్స్ కూడా బా గా ఆడితే రాజస్తాన్ భారీ స్కోరు చేయవచ్చు. కోల్‌కతా నైట్‌రైడర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రసెల్ చెలరేగడం, ఇతర ఆటగాళ్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తుండటంతో పాటు చివరి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ జట్టును గెలిపిస్తున్నాయి. ఇక నరైన్ ఒక్కడు గతంలోలాగా ఆరంభంలో వికెట్లు తీయగలిగితే కోల్‌కతాను ఆపడం కష్టం కావచ్చు. -
ఢిల్లీ పతనాన్ని శాసించిన స్యామ్ కరన్!
పంజాబ్‌పై 167 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో ఢిల్లీ స్కోరు 16.3 ఓవర్లలో 144/3... అయితే 17 బంతులు ముగిసేసరికి ఆటంతా మారిపోయింది. కేవలం 8 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో 152 పరుగుల వద్ద ఆలౌటైంది! సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ 14 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌పై ఊహించని విజయాన్ని సాధించింది. అద్భుత బౌలింగ్‌తో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసిన స్యామ్ కరన్ ఢిల్లీ పతనాన్ని శాసించాడు. మొహాలి: ఐపీఎల్లో పంజాబ్ వరుస విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (30 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సర్ఫరాజ్ ఖాన్ (29 బంతుల్లో 39; 6 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇంగ్రామ్ (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హ్యాట్రిక్‌తో చెలరేగిన స్యామ్ కరన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌ల హిట్టర్ క్రిస్ గేల్ గాయంతో ఈ మ్యాచ్ ఆడలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న అతని స్థానంలో కరన్ బరిలోకి దిగాడు. ధాటిగా ఆడిన మిల్లర్, సర్ఫరాజ్ టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. గేల్ లేని పంజాబ్ ఇన్నింగ్స్ కళ తప్పింది. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన ఓపెనర్లు కె.ఎల్.రాహుల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్), కరన్ (10 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) తమ ధాటిని ఎంతోసేపు కొనసాగించలేకపోయారు. మోరిస్ బౌలింగ్‌లో రాహుల్, లమిచానే బౌలింగ్‌లో కరన్ ఎల్బీగా నిష్క్రమించారు. తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ (6) విఫలమయ్యాడు. ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్, మిల్లర్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు బౌండరీలతో పంజాబ్‌ను నడిపించారు. నాలుగో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. సర్ఫరాజ్ చూడచక్కని స్ట్రోక్స్‌తో అలరించాడు. జట్టు స్కోరు 120 పరుగులు చేరాక, మొదట సర్ఫరాజ్, కాసేపటికి మిల్లర్ పెవిలియన్ చేరారు. మళ్లీ మోరిస్, లమిచానే కీపర్ క్యాచ్‌లతో వీళ్లిద్దరి ఆటకట్టించారు. ఇంతటితో పంజాబ్‌కు ఆ కాస్త మెరుపులు కూడా మాయమయ్యాయి. తర్వాత మన్దీప్ సింగ్ (21 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే మెరుగనిపించాడు. పృథ్వీ షా డకౌట్ గత మ్యాచ్‌లో పరుగు తేడాతో సెంచరీని కోల్పోయిన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (0) ఈ మ్యాచ్‌లో పరుగైనా చేయకుండా అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ తొలిబంతికే నిష్క్రమించాడు. ఓపెనర్ ధావన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అడపాదడపా ఫోర్లు కొడుతూ రెండో వికెట్‌కు 7.1 ఓవర్లలో 61 పరుగుల్ని జోడించారు. శ్రేయస్ (22 బంతుల్లో 28; 5 ఫోర్లు)ను బౌల్డ్ చేసి విలోన్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. కాసేపటికే ధావన్ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు)ను అశ్విన్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. కరన్ ‘హ్యాట్రిక్’... క్యాపిటల్స్ ఆలౌట్ ఇక్కడి నుంచి రిషభ్ పంత్, ఇంగ్రామ్‌లు ఢిల్లీని నడిపించారు. పంత్ మొదట అశ్విన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి ఓవర్ షమీ వేయగా సిక్స్‌తో అలరించాడు. కానీ తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. ఇక్కడి నుంచి క్యాపిటల్స్ పతనం మొదలైంది. షమీ ఓవర్లోనే మోరిస్ (0) రనౌట్ కాగా.. కరన్ నిప్పులు చెరిగే బౌలింగ్‌లో ఇంగ్రామ్, హర్షల్ (0) కూడా ఔటయ్యారు. 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన దశలో విహారి (2) చేతులెత్తేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి హర్షల్‌ను ఔట్ చేసిన కరన్... 20వ ఓవర్ తొలి రెండు బంతులకి రబడ (0), లమిచానే (0)లను క్లీన్‌బౌల్డ్ చేసి ఈ సీజన్లో తొలి ‘హ్యాట్రిక్’ను నమోదు చేశాడు. ►ఐపీఎల్లో ఇది 17వ హ్యాట్రిక్ కాగా...అతి పిన్న వయసులో (20 ఏళ్ల 302) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కరన్ నిలిచాడు. -
ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచేందుకు 14 బంతుల్లో 16 పరుగులు కావాలి. క్రీజులో సెంచరీకి చేరువైన పృథ్వీ షా, హిట్టర్ రిషభ్ పంత్ ఉన్నారు. కానీ కుల్దీప్ వేసిన 18వ ఓవర్ ఐదో బంతి పంత్ (11) వికెట్‌ను తీసింది. 19వ ఓవర్ వేసిన ఫెర్గూసన్... పృథ్వీని ఔట్ చేశాడు. ఇక్కడే గేమ్ ఛేంజ్ అయ్యింది. ఇక ఢిల్లీ 6 బంతుల్లో 6 పరుగులు చేయాలి. కుల్దీప్ తొలి నాలుగు బంతుల్లో 4 పరుగులిచ్చాడు. తర్వాత బంతికి విహారి (2) ఔటయ్యాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు. క్రీజ్‌లో ఉన్న ఇంగ్రామ్ తొలి పరుగు పూర్తి చేసి, రెండో పరుగు చేసేలోపే రనౌటయ్యాడు. స్కోరు 185 వద్ద సమమైంది. మ్యాచ్ టై అయింది. సులువుగా గెలిచే మ్యాచ్‌ను ‘సూపర్ ఓవర్’దాకా తెచ్చుకున్న ఢిల్లీ చివరకు గెలిచింది. ఈ సూపర్‌లో ముందుగా ఢిల్లీ 10 పరుగులు చేస్తే... 11 పరుగులు చేయాల్సిన కోల్‌కతా 7 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రసెల్ (28 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మళ్లీ దంచేశాడు. దినేశ్ కార్తీక్ (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులే చేసింది. పృథ్వీ షా (55 బంతుల్లో 99; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. పృథ్వీకే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది రసెల్ మళ్లీ జిగేల్ నైట్‌రైడర్స్ బ్యాటింగ్ మొదలైంది. పవర్‌ప్లే ముగియనేలేదు. అపుడే రెండు వికెట్లను కోల్పోయింది. నిఖిల్ నాయక్ (7), రాబిన్ ఉతప్ప (11) ఔట్. తర్వాత ఓవర్‌కు ఓ వికెట్ చొప్పున మరో మూడు వికెట్లను చేజార్చుకుంది. లిన్ (20), నితీశ్ రాణా (1), శుభ్‌మన్ గిల్ (4) ఇలా ఐదుగురు బ్యాట్స్‌మెన్ పది ఓవర్లలోపే పెవిలియన్ చేరారు. హర్షల్‌కు 2, లమిచానె, రబడ చెరో వికెట్ తీశారు. గిల్ రనౌటయ్యాడు. జట్టు స్కోరు 61/5. ఈ దశలో మళ్లీ రసెల్ పెద్దదిక్కయ్యాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్‌తో కలిసి దంచేసే బాధ్యతని తన భుజాన వేసుకున్నాడు. అంతే..! చూస్తుండగానే సిక్సర్ల మోత, పరుగుల ప్రవాహం కట్టలు తెంచుకుంది. ఢిల్లీ ప్రేక్షకులకు ఐపీఎల్ మజాను పంచింది. కళ్లు చెదిరే భారీ సిక్సర్లతో రసెల్ క్యాపిటల్స్ బౌలర్లను ఆరేశాడు. తొలి 50 పరుగులు చేసేందుకు ఢిల్లీ 45 బంతులు అవసరమైతే... రసెల్ 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో ఫిఫ్టీ సాధించాడు. కార్తీక్‌తో కలిసి ఆరో వికెట్‌కు 95 పరుగులు జోడించాడు. జట్టును పటిష్ట స్థితిలోకి తీసుకొచ్చాక 156 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. కార్తీక్ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే నిష్క్రమించాడు. చివర్లో చావ్లా (12; 1 ఫోర్, 1 సిక్స్), కుల్దీప్ (10 నాటౌట్) వీలైనన్ని పరుగులు జతచేసేందుకు శ్రమించారు. పృథ్వీ ‘షో’ తర్వాత ఢిల్లీ క్యాపిటల్ ధాటిగా లక్ష్యఛేదనను ప్రారంభించింది. ఈ క్రమంలో ధావన్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ పడినా... ఢిల్లీ దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా బౌలర్లను సులువుగా ఆడేశారు. క్రమం తప్పని బౌండరీలు, అప్పుడప్పుడు సిక్సర్లతో ఢిల్లీ ఇన్నింగ్స్ సాఫీగా, వేగంగా సాగిపోయింది. 10 ఓవర్లకు క్యాపిటల్స్ స్కోరు 82/1. ఇక మిగతా సగం ఓవర్లలో వందపైచిలుకు పరుగులు చేయాల్సిన అవసరం రావడంతో ఇద్దరు వేగం పెంచారు. ముఖ్యంగా పృథ్వీ బ్యాటింగ్ ఆకట్టుకుంది. ఎవరు బౌలింగ్‌కు వచ్చినా తన స్ట్రోక్స్ రుచిచూపించాడు. 11వ ఓవర్ వేసిన కుల్దీప్ బౌలింగ్‌లో శ్రేయస్ సిక్స్ కొడితే... పృథ్వీ సిక్స్, ఫోర్ బాదేశాడు. దీంతో ఆ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత రసెల్ బౌలింగ్‌లో ఇద్దరు మూడు బౌండరీలు కొట్టారు. శ్రేయస్ నిష్క్రమించినా... ఢిల్లీ జోరు మాత్రం తగ్గలేదు. రిషభ్ పంత్, పృథ్వీ జోడీ కూడా సగటున 9 పరుగుల చొప్పున బాదేయడంతో కోల్‌కతా బౌలర్లకు కష్టాలు తప్పలేదు. సూపర్ ఓవర్లు ఇలా... ►ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్ 1, 4, ఔట్ (శ్రేయస్), 2, 2, 1లతో మొత్తం 10 పరుగులు సాధించారు. ►రబడ వేసిన ఓవర్లో కోల్‌కతా 4, 0, ఔట్ (రసెల్), 1, 1, 1లతో మొత్తం 7 పరుగులు చేసి ఓటమిపాలైంది. -
బ్యాట్ పట్టిన బంగారు చేప
న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ స్విమ్మర్, ఆల్‌టైమ్ గ్రేట్ ఒలింపియన్ మైకేల్ ఫెల్ప్స్ సరదాగా క్రికెట్ బ్యాట్ పట్టాడు. వాణిజ్య ప్రచార కార్యక్రమంలో భాగంగా భారత్‌లో ఉన్న అతను... ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లతో బుధవారం కొంత సమయం గడిపాడు. మంగళవారం ఢిల్లీ, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌ను కూడా అతను స్టేడియంలో కూర్చొని చూశాడు. క్రికెట్ ఆట ఆసక్తికరంగా అనిపించినా... ఆడటం మాత్రం తన వల్ల కాదని అతను నవ్వుతూ చెప్పాడు. ‘ఐపీఎల్ మ్యాచ్‌లో సిక్సర్లను ఆస్వాదిం చాను. ఆటలో కొన్ని నిబంధనలు ఆసక్తికరంగా అనిపించాయి. ప్రేక్షకుల ఉత్సాహం మాత్రం చాలా బాగుంది. బ్యాట్‌ను పట్టుకోవడం మొదలు మరికొన్ని చిట్కాలు ఇవాళ నేర్చుకున్నాను. వచ్చేసారి భారత్‌కు వచ్చినప్పుడు మాత్రం క్రికెట్ గురించి బాగా తెలుసుకొని వస్తా’ అని ఫెల్ప్స్ వ్యాఖ్యానిం చాడు. కావాల్సినన్ని రోజులు తన ఇంట్లో ఉండి ఫెల్ప్స్ క్రికెట్ నేర్చుకోవచ్చని రిషభ్ పంత్ సరదాగా చెప్పగా... తాను నేర్చుకోగలనని నమ్మినందుకు అతను కృతజ్ఞతలు చెప్పాడు. ఫెల్ప్స్ లాంటి దిగ్గజంతో సమయం గడిపే అవకాశం రావడం పట్ల క్రిస్ మోరిస్, ఇషాంత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. 2004–2016 మధ్య నాలుగు ఒలింపిక్స్‌లలో కలిపి ఫెల్ప్స్ 23 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు గెలుచుకున్నాడు. -
పంత్ ప్రతాపం
కొత్త పేరు... సరికొత్త రూపు, రంగుతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్‌ను ఘనంగా ప్రారంభించింది. తనకే చెల్లిన రీతిలో యువ రిషభ్ పంత్ చెలరేగిపోవడంతో ఆ జట్టు అద్భుత విజయంతో బోణీ చేసింది. ఢిల్లీ భారీ స్కోరును ఛేదించే క్రమంలో యువరాజ్ ముందుండి కొంత పోరాడినా చివరకు ముంబై ఇండియన్స్‌కు ఓటమి తప్పలేదు. ముంబై: మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌ను ఓటమితో మొదలు పెట్టింది. ఆదివారం జరిగిన ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 37 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (27 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత అర్ధసెంచరీ సాధించగా... ఇంగ్రామ్ (32 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్స్), శిఖర్ ధావన్ (36 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్రామ్, పంత్ దెబ్బకు ఆరుగురు ముంబై బౌలర్లు కనిష్టంగా 10 ఎకానమీ చొప్పున పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం ముంబై ఇండియన్స్ 19.2 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. యువరాజ్ సింగ్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. పంత్ విధ్వంసం... వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం తనను తాను నిరూపించుకునే ప్రయత్నం, భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. తొలి ఐదు బంతుల్లో ఒకే పరుగు చేసిన అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. కటింగ్ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ బాదిన తర్వాత హార్దిక్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 6 కొట్టాడు. మెక్లీనగన్ ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టిన తర్వాత మరింతగా చెలరేగిపోయాడు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్ బుమ్రానూ పంత్ వదల్లేదు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్ కొట్టిన అతను... బుమ్రానే వేసిన 20వ ఓవర్లో కూడా మరో భారీ సిక్స్ బాదాడు. ఈ రెండు ఓవర్ల మధ్య జమ్మూ కశ్మీర్‌కు చెందిన కొత్త బౌలర్ రసిఖ్ సలామ్ వేసిన 19వ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదడం విశేషం. 18 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. తొలి 10 ఓవర్లలో 82 పరుగులు చేసిన క్యాపిటల్స్ తర్వాతి పది ఓవర్లలో 131 పరుగులు సాధించింది. ఇందులో పంత్ జోరు మొదలైన తర్వాత చివరి 6 ఓవర్లలో వచ్చిన 99 పరుగులు ఉన్నాయి. ఇంగ్రామ్, ధావన్ కూడా... సుదీర్ఘ కాలం తర్వాత సొంత టీమ్ ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన శిఖర్ ధావన్ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. తాను ఎదుర్కొన్న 13వ బంతికి తొలి ఫోర్ కొట్టిన ధావన్... మెక్లీనగన్ ఓవర్లో ఫోర్, సిక్స్‌తో అలరించాడు. చివరకు హార్దిక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్ మిడ్వికెట్లో క్యాచ్ ఇచ్చాడు. మరో వైపు ఇంగ్రామ్ ఇన్నింగ్స్ కూడా హైలైట్‌గా నిలిచింది. 2011 ఐపీఎల్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అతను ఇప్పుడు పునరాగమనం చేశాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అతను... హార్దిక్ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదాడు. కృనాల్ ఓవర్లో అతను మూడు ఫోర్లతో జోరును ప్రదర్శించడం విశేషం. ఆకట్టుకున్న యువీ... ముంబై తరఫున సీనియర్ యువరాజ్ సింగ్ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డ అతను ఆ తర్వాత ఆకట్టుకునే స్ట్రోక్స్ ఆడాడు. అక్షర్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో జోరు మొదలు పెట్టిన యువీ... అక్షర్ మరో ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. బుమ్రాకు గాయం... ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి బంతికి పేసర్ బుమ్రా గాయపడ్డాడు. పంత్ కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నం చేయగా అతని ఎడమ చేయి సహకరించలేదు. నొప్పితో తన ఎడమ భుజాన్ని పట్టుకున్న అతను బాధతో విలవిల్లాడాడు. సరిగ్గా ఏం జరిగిందో తెలియకపోగా, అతని గాయంపై ముంబై స్పష్టతనివ్వలేదు. తమ ఇన్నింగ్స్‌లో మరో నాలుగు బంతులు మిగిలినా బుమ్రా బ్యాటింగ్‌కు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం! -
ఢిల్లీకి గంగూలీ సలహాలు...
న్యూఢిల్లీ: ఐపీఎల్ జట్టు ‘ఢిల్లీ క్యాపిటల్స్’ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తమ సలహాదారుడిగా నియమించింది. అడ్వైజర్‌గా అతని బాధ్యతలపై పూర్తి స్పష్టత లేకపోయినా హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి గంగూలీ పని చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ సహ యజమాని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో సౌరవ్‌కు సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉంది. ‘జిందాల్ కుటుంబం నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఇప్పుడు వారితో జత కట్టడం సంతోషంగా ఉంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని సౌరవ్ వ్యాఖ్యానించాడు. తన దూకుడైన శైలితో భారత కెప్టెన్‌గా ప్రత్యేక ముద్ర వేసిన గంగూలీ తమతో కలిసి పని చేయనుండటం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఢిల్లీ యజమాని పార్థ్ జిందాల్... అతని అనుభవం ఐపీఎల్లో తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 2008 నుంచి 2010 వరకు కోల్‌కతా తరఫున ఐపీఎల్ ఆడిన గంగూలీ...2011 నుంచి 2013 వరకు పుణే వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మరో వైపు తాను క్యాపిటల్స్‌కు సలహాదారుడిగా వ్యవహరించడంలో ఎలాంటి ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ లేదని సౌరవ్ స్పష్టం చేశాడు. తాను గత ఏడాదే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్నుంచి తప్పుకున్నానని, క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)తో చర్చించిన తర్వాతే తాజా నిర్ణయం తీసుకున్నట్లు అతను వెల్లడించాడు. -
అక్షర్ అ‘ధర’హో
జైపూర్: ఐపీఎల్ సీజన్ 12 కోసం ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జాక్‌పాట్ కొట్టేశాడు. కోటి కనీస ధరతో ఐపీఎల్ వేలంలోకి వచ్చిన అక్షర్ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు ఈ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసుకోవడానికి పోటీపడ్డాయి. కానీ చివరకు అక్షర్‌ను ఢిల్లీ సొంత చేసుకుంది. ఇప్పటివరకూ జరిగిన వేలంలో హనుమ విహారి జాక్‌పాట్ కొట్టాడు. అతని కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్ బ్రాత్‌వైట్ రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్ తీసుకోగా, హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. -
ఢిల్లీలో మరో కీచకం
డెన్మార్క్ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం విలువైన వస్తువులు, నగదు దోపిడీ ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు న్యూఢిల్లీ: దేశ రాజధాని మహిళలకు ఏమాత్రం సురక్షితం కాదని మరోసారి రుజువైంది. భారత్ అందాలను చూసి వెళదామని వచ్చిన డెన్మార్క్ మహిళపై కొందరు దుండగులు కీచకానికి తెగబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి బుధవారం రాత్రి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. డెన్మార్క్‌కు చెందిన 51 ఏళ్ల మహిళ ఈనెల 1న భారత పర్యటనకు వచ్చింది. ఆగ్రా తదితర ప్రాంతాలను సందర్శించిన తర్వాత సోమవారం ఢిల్లీకి చేరుకుంది. ఆమె మంగళవారం నేషనల్ మ్యూజియంను తిలకించి, సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కన్నాట్ ప్లేస్ నుంచి పహాడ్గంజ్లోని హోటల్‌కు వెళుతూ దారి తప్పింది. హోటల్‌కు చేరుకునేందుకు తోవలో కనిపించిన కొందరు యువకుల సాయం కోరింది. హోటల్ చూపిస్తామంటూ వారు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుపోయి, కత్తులతో బెదిరించి నగదు, ఐపాడ్, ఫోన్ వంటి విలువైన వస్తువులను, ఆమె వద్దనున్న నగదును దోచుకున్నారు. తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు గంటల తర్వాత నానా తంటాలు పడి హోటల్‌కు చేరుకున్న ఆమె, జరిగిన సంఘటనను మేనేజర్‌కు తెలిపారు. ఆయనకు పోలీసులకు ఫోన్ చేయడంతో వారు రాత్రి 8.30 గంటలకు హోటల్‌కు చేరుకుని, బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 376 జీ(2) కింద సామూహిక అత్యాచారంతో పాటు దోపిడీ కేసు నమోదు చేసుకున్నారు. ఆరుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, బాధితురాలు బుధవారం మధ్యాహ్నం స్వదేశానికి బయలుదేరి వెళ్లింది. స్వదేశంలో వైద్య పరీక్షలు జరిపించుకుని, నివేదిక పంపుతానని, అవసరమైతే సాక్ష్యం చెప్పేందుకు తిరిగి భారత్‌కు వస్తానని ఆమె చెప్పింది. ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన మహేందర్ అలియాస్ గంజా (25), రాజా అనే నిందితులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారి వద్దనుంచి ఐపాడ్, ఇయర్‌ప్లగ్, దోచుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన రూ.1200 విలువ చేసే నోకియా మొబైల్‌ఫోన్, ఒక కళ్లద్దాల కేసు, రూ.1,800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈనెల 3న పోలండ్ మహిళపై ఒక క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడి, ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్ వద్ద వదిలేసి పరారైన సంగతి తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్‌తో సీఎం కేజ్రీవాల్ భేటీ... డెన్మార్క్ పర్యాటకురాలిపై అత్యాచారం ఘటన వెలుగులోకి రావడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌తో భేటీ అయ్యారు. నగరంలో మహిళలకు భద్రత పెంచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుసుకుని, మహిళలపై నేరాల కేసులను సత్వరమే విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.