ఐపీఎల్ తుది అంకంలో సెమీ ఫైనల్ మ్యాచ్. బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్దపెద్ద స్టార్లు లేకున్నా ఒక్కో మెట్టు ఎక్కుతూ నాకౌట్ దశకు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్... కొంత తడబడినా హిట్టర్లు, ఫలితాన్ని మార్చేయగల మొనగాళ్లతో కూడిన, తక్కువ అంచనా వేయలేని చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖ నగరంలో శుక్రవారం క్వాలిఫయర్ –2 మ్యాచ్.
ఇప్పటికే ఇక్కడ ఒక మ్యాచ్ ఆడిన అనుభవంతో ఉన్న ఢిల్లీ ఆ అనుకూలతను సద్వినియోగం చేసుకుని ఫైనల్ బెర్తు కొట్టేస్తుందో? తమ శక్తియుక్తులను కూడదీసుకుని చెన్నై పైచేయి సాధిస్తుందో చూడాలి. ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లలో ఒత్తిడిని గట్టెక్కిన అనుభవం ఉన్న ధోని బృందానికి, కుర్రాళ్లతో నిండిన అయ్యర్ జట్టు ఎంతటి పోటీ ఇస్తుందో అనేది ఆసక్తికరం.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
అసలు ప్లే ఆఫ్స్ చేరుతుందని భావించని ఢిల్లీకి, క్వాలిఫయర్–2 ఆడాల్సి వస్తుందని ఊహించని చెన్నైకి మధ్య ఐపీఎల్–12 ఫైనల్ బెర్తు కోసం శుక్రవారం ఇక్కడి డా.వైఎస్‌ఆర్ ఏసీఏ–వీడీసీఏ మైదానం వేదికగా సమరం జరుగనుంది. లీగ్ చరిత్రలో తొలిసారి నాకౌట్ దశలో మ్యాచ్ గెలిచిన ఊపులో ఉన్న ఢిల్లీ... అదే జోరులో తుది పోరాటానికి అర్హత సాధించాలని భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఎదురైన పరాజయాల నుంచి తేరుకుని ఫైనల్ చేరాలని చెన్నై పట్టుదలగా ఉంది. సీనియర్ శిఖర్ ధావన్‌కు తోడు ఢిల్లీ యువ బ్యాటింగ్ త్రయం పృథ్వీ షా–కెప్టెన్ శ్రేయస్ అయ్యర్–రిషభ్ పంత్, చెన్నై స్పిన్ త్రయం తాహిర్–హర్భజన్–జడేజాలలో ఎవరు రాణిస్తే మ్యాచ్ వారి పరమవుతుంది.
కుర్రాళ్లు కుమ్మేస్తేనే...
కీలక సమయంలో ఓపెనర్ పృథ్వీ ఫామ్‌లోకి రావడం ఢిల్లీని సంతోషపరిచే అంశం. ధావన్ కూడా రాణిస్తే జట్టు ఇన్నింగ్స్‌కు మంచి పునాది పడుతుంది. తర్వాత సంగతిని అయ్యర్, పంత్ చూసుకుంటారు. అయితే, అయ్యర్ అంచనాలకు తగ్గట్లు స్కోరు చేయడం లేదు. ఈ నలుగురి అనంతరం సరైన బ్యాట్స్‌మన్ లేకపోవడం మరో లోటు. నాలుగో స్థానం నుంచి ఏడో స్థానం మధ్య జట్టు బ్యాట్స్‌మన్ సగటు 20.5 కావడమే దీనికి నిదర్శనం. ఇంగ్రామ్, మున్రో ఇద్దరూ ధాటిగా ఆడగలవారే.
సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లో మున్రోను తీసుకున్నారు. అతడినే కొనసాగిస్తారా? లేక ఇంగ్రామ్‌ను తీసుకుంటారా? అనేది చూడాలి. అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్‌లతో ఢిల్లీ స్పిన్ పటిష్ఠంగా ఉంది. గత మ్యాచ్‌లో మిశ్రా బౌలింగే ఫలితాన్ని ప్రభావితం చేసింది. బ్యాట్‌తోనూ రాణించే క్రిస్ మోరిస్‌ను ట్రెంట్ బౌల్ట్ స్థానంలో ఆడించే వీలుంది. ఇషాంత్ లయ తప్పకుండా, కచ్చితత్వంతో బంతులేస్తుండటం సానుకూలాంశం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, వాటిని సమన్వయం చేసుకుంటూ ఆడే చెన్నైపై నెగ్గాలంటే ఢిల్లీ కాస్తంత ఎక్కువే శ్రమించక తప్పదు.
చెన్నై... చేజారకుండా
పంజాబ్, ముంబైలతో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో చెన్నై జోరు తగ్గిందనే చెప్పాలి. బ్యాటింగ్ వైఫల్యమే దీనికి ప్రధాన కారణం. క్వాలిఫయర్–1లో అది కూడా సొంతగడ్డపై ముంబైని నిలువరించలేకపోయింది. ఓపెనర్ షేన్ వాట్సన్ ఫామ్ దారుణంగా ఉంది. దీంతో డుప్లెసిస్, రైనాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. కెప్టెన్ ధోని ఆదుకుంటుండటంతో కొంతైనా పోటీ ఇస్తోంది. రాయుడు, మురళీ విజయ్ బ్యాట్ ఝళిపిస్తేనే భారీ స్కోరు చేయగలుగుతుంది.
హిట్టింగ్‌తో స్కోరును పెంచగల బ్రేవోకు బ్యాటింగ్ అవకాశం రావడం లేదు. స్పిన్ త్రయంతో పాటు పేసర్ దీపక్ చహర్ తమ బాధ్యతలు సమర్థంగా నెరవేరుస్తుండటంతో బౌలింగ్‌లో మాత్రం సూపర్ కింగ్స్‌కు తిరుగులేదు. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేస్తే... బౌలింగ్ దన్నుతో చెన్నై బయటపడగలదు. లీగ్ దశలో ఢిల్లీని 99 పరుగులకే చుట్టేసిన తీరే దీనికి ఉదాహరణ.
►ఈ సీజన్‌లో ధోని చేసిన 405 పరుగుల్లో 213 పరుగులు 18 నుంచి 20వ ఓవర్ మధ్య వచ్చినవే.
►ఢిల్లీ ఆల్‌రౌండర్ మోరిస్ పడగొట్టిన 13 వికెట్లలో 10 వికెట్లు 16 నుంచి 20వ ఓవర్ మధ్య తీసినవే.
► 55 ఐపీఎల్ 12లో చెన్నై స్పిన్నర్లు తీసిన వికెట్ల సంఖ్య. అన్ని సీజన్లలోకెల్లా ఇదే అత్యధికం. తాహిర్–హర్భజన్–జడేజా ముగ్గురూ 12పైగా వికెట్లు సాధించారు.
►148 గత ఆరేళ్లుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ సహా వైజాగ్ మైదానంలో సగటు స్కోరిది. ఇక్కడ స్పిన్నర్ల ఎకానమీ రేట్ 6 కాగా, పేసర్లది 9.6
►తుది జట్లు (అంచనా)
►చెన్నై: వాట్సన్, డుప్లెసిస్, రైనా, మురళీ విజయ్, రాయుడు, ధోని, జడేజా, బ్రేవో, హర్భజన్, దీపక్ చహర్, తాహిర్
►ఢిల్లీ: పృథ్వీ, ధావన్, అయ్యర్, పంత్, ఇంగ్రామ్/మున్రో, రూథర్‌ఫర్డ్, అక్షర్, కీమోపాల్, మిశ్రా, మోరిస్/ బౌల్ట్, ఇషాంత్.
Comments
Please login to add a commentAdd a comment