
న్యూఢిల్లీ: ఐపీఎల్ జట్టు ‘ఢిల్లీ క్యాపిటల్స్’ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తమ సలహాదారుడిగా నియమించింది. అడ్వైజర్‌గా అతని బాధ్యతలపై పూర్తి స్పష్టత లేకపోయినా హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి గంగూలీ పని చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ సహ యజమాని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో సౌరవ్‌కు సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉంది. ‘జిందాల్ కుటుంబం నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఇప్పుడు వారితో జత కట్టడం సంతోషంగా ఉంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని సౌరవ్ వ్యాఖ్యానించాడు. తన దూకుడైన శైలితో భారత కెప్టెన్‌గా ప్రత్యేక ముద్ర వేసిన గంగూలీ తమతో కలిసి పని చేయనుండటం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఢిల్లీ యజమాని పార్థ్ జిందాల్... అతని అనుభవం ఐపీఎల్‌లో తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
2008 నుంచి 2010 వరకు కోల్‌కతా తరఫున ఐపీఎల్ ఆడిన గంగూలీ...2011 నుంచి 2013 వరకు పుణే వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మరో వైపు తాను క్యాపిటల్స్‌కు సలహాదారుడిగా వ్యవహరించడంలో ఎలాంటి ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ లేదని సౌరవ్ స్పష్టం చేశాడు. తాను గత ఏడాదే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌నుంచి తప్పుకున్నానని, క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)తో చర్చించిన తర్వాతే తాజా నిర్ణయం తీసుకున్నట్లు అతను వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment