న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచేందుకు 14 బంతుల్లో 16 పరుగులు కావాలి. క్రీజులో సెంచరీకి చేరువైన పృథ్వీ షా, హిట్టర్ రిషభ్ పంత్ ఉన్నారు. కానీ కుల్దీప్ వేసిన 18వ ఓవర్ ఐదో బంతి పంత్ (11) వికెట్‌ను తీసింది. 19వ ఓవర్ వేసిన ఫెర్గూసన్... పృథ్వీని ఔట్ చేశాడు. ఇక్కడే గేమ్ ఛేంజ్ అయ్యింది. ఇక ఢిల్లీ 6 బంతుల్లో 6 పరుగులు చేయాలి. కుల్దీప్ తొలి నాలుగు బంతుల్లో 4 పరుగులిచ్చాడు. తర్వాత బంతికి విహారి (2) ఔటయ్యాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు. క్రీజ్‌లో ఉన్న ఇంగ్రామ్ తొలి పరుగు పూర్తి చేసి, రెండో పరుగు చేసేలోపే రనౌటయ్యాడు. స్కోరు 185 వద్ద సమమైంది. మ్యాచ్ టై అయింది. సులువుగా గెలిచే మ్యాచ్‌ను ‘సూపర్ ఓవర్’దాకా తెచ్చుకున్న ఢిల్లీ చివరకు గెలిచింది. ఈ సూపర్‌లో ముందుగా ఢిల్లీ 10 పరుగులు చేస్తే... 11 పరుగులు చేయాల్సిన కోల్‌కతా 7 పరుగులకే పరిమితమైంది.
అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రసెల్ (28 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మళ్లీ దంచేశాడు. దినేశ్ కార్తీక్ (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులే చేసింది. పృథ్వీ షా (55 బంతుల్లో 99; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. పృథ్వీకే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది
రసెల్ మళ్లీ జిగేల్
నైట్‌రైడర్స్ బ్యాటింగ్ మొదలైంది. పవర్‌ప్లే ముగియనేలేదు. అపుడే రెండు వికెట్లను కోల్పోయింది. నిఖిల్ నాయక్ (7), రాబిన్ ఉతప్ప (11) ఔట్. తర్వాత ఓవర్‌కు ఓ వికెట్ చొప్పున మరో మూడు వికెట్లను చేజార్చుకుంది. లిన్ (20), నితీశ్ రాణా (1), శుభ్‌మన్ గిల్ (4) ఇలా ఐదుగురు బ్యాట్స్‌మెన్ పది ఓవర్లలోపే పెవిలియన్ చేరారు. హర్షల్‌కు 2, లమిచానె, రబడ చెరో వికెట్ తీశారు. గిల్ రనౌటయ్యాడు. జట్టు స్కోరు 61/5. ఈ దశలో మళ్లీ రసెల్ పెద్దదిక్కయ్యాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్‌తో కలిసి దంచేసే బాధ్యతని తన భుజాన వేసుకున్నాడు. అంతే..! చూస్తుండగానే సిక్సర్ల మోత, పరుగుల ప్రవాహం కట్టలు తెంచుకుంది. ఢిల్లీ ప్రేక్షకులకు ఐపీఎల్ మజాను పంచింది. కళ్లు చెదిరే భారీ సిక్సర్లతో రసెల్ క్యాపిటల్స్ బౌలర్లను ఆరేశాడు. తొలి 50 పరుగులు చేసేందుకు ఢిల్లీ 45 బంతులు అవసరమైతే... రసెల్ 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో ఫిఫ్టీ సాధించాడు. కార్తీక్‌తో కలిసి ఆరో వికెట్‌కు 95 పరుగులు జోడించాడు. జట్టును పటిష్ట స్థితిలోకి తీసుకొచ్చాక 156 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. కార్తీక్ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే నిష్క్రమించాడు. చివర్లో చావ్లా (12; 1 ఫోర్, 1 సిక్స్), కుల్దీప్ (10 నాటౌట్) వీలైనన్ని పరుగులు జతచేసేందుకు శ్రమించారు.
పృథ్వీ ‘షో’
తర్వాత ఢిల్లీ క్యాపిటల్ ధాటిగా లక్ష్యఛేదనను ప్రారంభించింది. ఈ క్రమంలో ధావన్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ పడినా... ఢిల్లీ దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా బౌలర్లను సులువుగా ఆడేశారు. క్రమం తప్పని బౌండరీలు, అప్పుడప్పుడు సిక్సర్లతో ఢిల్లీ ఇన్నింగ్స్ సాఫీగా, వేగంగా సాగిపోయింది. 10 ఓవర్లకు క్యాపిటల్స్ స్కోరు 82/1. ఇక మిగతా సగం ఓవర్లలో వందపైచిలుకు పరుగులు చేయాల్సిన అవసరం రావడంతో ఇద్దరు వేగం పెంచారు. ముఖ్యంగా పృథ్వీ బ్యాటింగ్ ఆకట్టుకుంది. ఎవరు బౌలింగ్‌కు వచ్చినా తన స్ట్రోక్స్ రుచిచూపించాడు. 11వ ఓవర్ వేసిన కుల్దీప్ బౌలింగ్‌లో శ్రేయస్ సిక్స్ కొడితే... పృథ్వీ సిక్స్, ఫోర్ బాదేశాడు. దీంతో ఆ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత రసెల్ బౌలింగ్‌లో ఇద్దరు మూడు బౌండరీలు కొట్టారు. శ్రేయస్ నిష్క్రమించినా... ఢిల్లీ జోరు మాత్రం తగ్గలేదు. రిషభ్ పంత్, పృథ్వీ జోడీ కూడా సగటున 9 పరుగుల చొప్పున బాదేయడంతో కోల్‌కతా బౌలర్లకు కష్టాలు తప్పలేదు.
సూపర్ ఓవర్లు ఇలా...
►ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్ 1, 4, ఔట్ (శ్రేయస్), 2, 2, 1లతో మొత్తం 10 పరుగులు సాధించారు.
►రబడ వేసిన ఓవర్లో కోల్‌కతా 4, 0, ఔట్ (రసెల్), 1, 1, 1లతో మొత్తం 7 పరుగులు చేసి ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment