తొలి మ్యాచ్... రెండో మ్యాచ్... కనీసం మూడో మ్యాచ్... నాలుగోదైనా...పోనీ ఐదో మ్యాచ్... వరుసగా ఆరోమ్యాచ్‌లోనూ బెంగళూరు కథ మారలేదు. ఒక్క గెలుపు కోసం ఆశగా ఎదురు చూస్తోన్న ఆ జట్టుకు నిరీక్షణ తప్పేలా లేదు.
నిలకడ లేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్‌తో వరుసగా ఆరోసారి కోహ్లిసేన ఓటమి పాలైంది. మరోవైపు రెండు ఓటముల తర్వాత ఢిల్లీకి స్ఫూర్తిదాయక విజయం దక్కింది. శ్రేయస్ అయ్యర్‌కు తోడు బౌలర్లు రాణించడంతో ఢిల్లీ మళ్లీ గెలుపుబాట పట్టింది.
బెంగళూరు: బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో తేలిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని ఆహ్వానించింది. సొంతగడ్డపై ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (33 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మొయిన్ అలీ (18 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.
ఢిల్లీ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రబడ 4 కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, మోరిస్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. పృథ్వీ షా (22 బంతుల్లో 28; 5 ఫోర్లు) రాణించాడు. ప్రతీ ఏడాది తరహాలోనే ఈ సారి కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఆకుపచ్చ రంగు జెర్సీలతో బరిలో దిగింది.
తేలిపోయిన బ్యాట్స్‌మెన్...
గత మ్యాచ్‌లో అదరగొట్టిన బెంగళూరు బ్యాట్స్‌మన్ ఈ మ్యాచ్‌లో తడబడ్డారు. ఢిల్లీ బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేయడంతో పెద్దగా మెరుపుల్లేకుండానే బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసిన రాయల్ చాలెంజర్స్... ఆ తర్వాత మరీ ఘోరంగా ఆడింది. అంతకుముందు సిక్స్‌తో అలరించిన డివిలియర్స్ రనౌటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. కానీ కొద్దిసేపటికే మరో బౌండరీ బాది రబడ బౌలింగ్‌లో ఇంగ్రామ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
స్టొయినిస్ (15) క్రీజులో నిలవలేకపోయాడు. మొయిన్ అలీ ఒక్కడే వేగంగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ లమిచానే అతని ఆటలు సాగనివ్వలేదు. ఇషాంత్ బౌలింగ్‌లో 6, 4 బాదిన అలీ.. అక్షర్, లమిచానే ఓవర్లలోనూ రెండు సిక్సర్లతో చెలరేగాడు. అనంతరం రబడ విజృంభించడంతో ఒకే ఓవర్‌లో కోహ్లి, అ„Š దీప్ నాథ్ (19), నేగి (0) వికెట్లను కోల్పోయి బెంగళూరు కష్టాల్లో పడింది. కీలకమైన చివరి 18 బంతుల్లో బెంగళూరు కేవలం 16 పరుగులే చేసి సాధారణ స్కోరుకే పరిమితమైంది.
అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్
బెంగళూరు బౌలర్ల తీరుతో లక్ష్యఛేదనలో ఢిల్లీకి ఏ దశలోనూ ఇబ్బంది ఎదురు కాలేదు. ఆరంభలోనే ధావన్ (0) పెవిలియన్ చేరాడు. అయితే పృథ్వీ షాతో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్ నడిపించాడు. సౌతీ ఓవర్‌లో వరుసగా 4 ఫోర్లతో పృథ్వీ చెలరేగాడు. తొలి ఓవర్‌లోనే పార్థివ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అయ్యర్ కూడా ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 53 పరుగులు చేసింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించాక నేగి బౌలింగ్‌లో పృథ్వీ ఔటయ్యాడు. అయ్యర్‌కు జతకూడిన ఇంగ్రామ్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) మంచి స్ట్రోక్ ప్లేతో అలరించాడు. నేగి బౌలింగ్‌లో 6, 4 బాది 14 పరుగులు రాబట్టాడు.
చహల్ బౌలింగ్‌లోనూ ఓ ఫోర్ రాబట్టిన అతను వికెట్ల ముందు మొయిన్‌అలీకి దొరికిపోయాడు. మరోవైపు అయ్యర్ 37 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. తర్వాత ప్రతి ఓవర్‌కు కనీసం ఒక బౌండరీ అయిన బాదుతూ ఢిల్లీ లక్ష్యం దిశగా సాగింది. చివరి 5 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సి ఉండగా చహల్ బౌలింగ్‌లో అయ్యర్ సిక్స్, పంత్ ఫోర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. దీంతో విజయానికి 18 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో అయ్యర్, మోరిస్ (0), పంత్ (18) ఔటైనా ఢిల్లీ విజయాన్ని అందుకుంది.
కోహ్లి ఉన్నా... లేనట్టే
ఈ మ్యాచ్‌లో కోహ్లి ఇన్నింగ్స్ విచిత్రంగా సాగింది. పార్థివ్ (9)తో కలిసి ఓపెనింగ్ చేసిన అతను ఎప్పుడు లేని విధంగా చాలా నెమ్మదిగా ఆడాడు. 15వ ఓవర్ ముగిసేవరకు కూడా కోహ్లి కేవలం 27 బంతులే ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. పవర్‌ప్లేలో కూడా అతను 11 బంతులే ఆడాడు. గతంలో ఎప్పుడూ ఇలా జరుగలేదు. దీంతో మ్యాచ్‌లో అతను ఉన్నా లేనట్టే అనిపించింది. రెండో ఓవర్‌లో మోరిస్ బౌలింగ్‌లో ఒక బౌండరీ బాదిన కోహ్లి... పదిహేడో ఓవర్ చివర్లో గానీ మళ్లీ బౌండరీ జోలికి పోలేదు. లమిచానే వేసిన ఈ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో జోరు పెంచిన అతను మరుసటి ఓవర్‌లోనే రబడకు దొరికిపోయాడు. దీంతో డెత్ ఓవర్లలో ధాటిగా ఆడాలనుకున్న అతని వ్యూహం ఫలించలేదు.
►ప్రతీ రోజు ఓటమికి సాకులు చెప్పలేము. బుర్రంతా చెత్తతో నిండి ఉంటే మన వద్దకు వచ్చిన అవకాశాలు కూడా ఉపయోగించుకోలేం. శ్రేయస్ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో. అందరం బాధ్యతగా ఆడాలని ఎంతగా చెప్పినా ఇప్పటి వరకు అది జరగడం లేదనేది వాస్తవం. ఈ సీజన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జట్టుకు అవసరమైన రోజే మేం రాణించలేకపోతున్నాం’
విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment